అన్నిఘాట్లకు.. జన కళ

-ఊహించిన దానికంటే ఎక్కువగా…
-ఇతర రాష్ర్టాల నుంచి తరలివస్తున్న ప్రజలు..
-ఏర్పాట్లు భేష్ అంటున్న భక్తులు..
-మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల నిరంతర పర్యవేక్షణ..
మహబూబ్‌నగర్ నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలోని 52ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీటిలో లో లెవల్, హై లెవల్ ఘాట్లుగా విభజించారు. నది ప్రవాహం హెచ్చు తగ్గుల పరిస్థితులు ఎదురయ్యే సందర్భంలోనూ ఇబ్బందులు ఎదురవ్వకుండా ఘాట్ల నిర్మాణాలను చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఘాట్లలో ప్రజలు పుష్కర స్నానమాచరించే వెసులుబాటు కలిగింది. 15రోజుల ముందు దాకా కృష్ణానది ఓ వాగులా మాత్రమే కనిపించింది. కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ సంకల్పానికి ప్రకృతి పరవసించింది. తెలంగాణలోని పుష్కరాలను విజయవంతం చేయడానికి అన్నట్లు కర్ణాటక ప్రాంతం నుంచి కృష్ణమ్మ పరుగెత్తుకుంటూ పాలమూరుకు వచ్చింది. ఇలా వచ్చిన కృష్ణమ్మ పరవళ్లతోనే నేడు జరుగుతున్న పుష్కర సంబురం వేడుకగా జరుగుతోంది.

పరవశిస్తున్న భక్త జనం
పుష్కరాలకు వస్తున్న భక్తులు పరవశించిపోతున్నారు. గతంలో మొక్కుబడిగా కనిపించే పుష్కరాలు ఇప్పుడు సరికొత్త ఒరవడిని భక్తులకు తలపిస్తున్నాయి. 60ఏళ్ల నుంచి పుష్కరాలను చూసిన అనుభవాన్ని నేడు కొత్త రాష్ట్రంలో అంచనా వేసుకుంటున్నారు. పుష్కరాలు ప్రారంభమైన రెండో రోజునే భక్తులు అధికంగా తరలిరావడం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కరస్నానమాచరించి దైవదర్శనం చేసుకుని వెళ్లడం సంతోషంగా ఉందని చెబుతున్నారు. షవర్లు కూడా ఏర్పాటు చేయడంతో భక్తులు నీళ్లలో కేరింతలు కొడుతూ పరవశంపొందుతున్నారు.

నిరంతర పర్యవేక్షణలో పుష్కరాలు
మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పుష్కరాల కార్యక్రమాలపై నిరంతరాయంగా పర్యవేక్షణ జరుపుతున్నారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, లకా్ష్మరెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, కలెక్టర్ శ్రీదేవి, జేసీ రాంకిషన్, అదనపు జేసీ బాలాజీ రంజిత్‌ప్రసాద్‌లు నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నారు.

ఇతర ప్రాంతాల నుంచి…
పుష్కరాలకు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. రెండో రోజు ఇతర ప్రాంతాలకు చెందిన వారు భారీసంఖ్యలో తరలివచ్చారు. రంగాపూర్, బీచుపల్లి, సోమశిల, క్రిష్ణ (మాగనూరు), నదీఅగ్రహారం, గొందిమళ్ల పుష్కరఘాట్‌లలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల తాకిడి కనిపించింది. ప్రధానంగా రాయిచూర్, కర్నూల్, అనంతపూర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు.

Source:
http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%85%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF%E0%B0%98%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%9C%E0%B0%A8-%E0%B0%95%E0%B0%B3-20-597393.aspx