ఏడాదంతా పుష్కరమే.

-అంత్య పుష్కరాల తర్వాతే కృష్ణను వీడనున్న పుష్కరుడు
-12వ రోజూ ఘాట్లకు భారీ సంఖ్యలో భక్తుల హాజరు
-చివరి రోజు 9లక్షల మంది భక్తజనుల పుణ్య స్నానాలు
-వాడపల్లిలో అలరించిన హంస వాహనసేవ
కృష్ణా పుష్కర వేడుకలో పన్నెండు రోజుల ఆది పండుగ అత్యద్భుతంగా ముగిసింది. పుష్కర వేడుక మాత్రం ఏడాదిపాటు నిరంతరాయంగా కొనసాగనుంది. బృహస్పతి కన్యారాశి ప్రవేశంతో కృష్ణవేణిలో ప్రవేశించిన పుష్కరుడు మాత్రం ఏడాదిపాటు నదిలో ఉండడమే ఇందుకు కారణం. వచ్చే జూలై చివర్లో అం పుష్కరాలు ముగిసే వరకు.. కృష్ణానదిలో భక్త జనం పుష్కర స్నానాలు ఆచరించవచ్చు. గ్రహబలం అధికంగా ఉండడమే కాకుండా.. పుణ్యఫలం ఎక్కువగా దక్కే అవకాశం ఉంటుందనే కారణంతోనే తొలి 12రోజులకు అధిక ప్రాధాన్యం ఉన్నా… జీవనది కృష్ణ ఏడాదిపాటు పుష్కరశోభతో అలరారుతూనే ఉంటుంది. ఆది పండుగ 12రోజుల్లోని చివరి రోజు కూడా 9లక్షల మంది భక్తులు జిల్లాలో పుష్కర స్నానం ఆచరించారు.

చివరి రోజూ అదే జోరు.. మొదటి రోజు వచ్చిన భక్తుల కంటే మూడింతల మంది అధనం కావడం మరింత విశేషం. 12 రోజుల్లో జిల్లా అం తటా 72 లక్షల మంది భక్తులు పుష్కరాలకు హాజరుకాగా.. చివరి రోజు సాయంత్రం ఆరు గంటల వరకు అన్ని ఘాట్లలో కలిపి మొత్తం 8,68,718 మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. రాత్రి వరకు ఈ సంఖ్య 10,34,133 చేరుకుంది. మొత్తం 28 ఘాట్లలో చివరి రోజు ఉద యం నుంచే భక్తుల రద్దీ కొనసాగింది. ముఖ్యంగా ఆఖరిరోజు కూడా నాగార్జున సాగర్ శివాలయం ఘాట్‌లోనే అత్యధిక మంది భక్తులు పిండ ప్రదానాలు నిర్వహించి పుష్కర స్నానాలు చేశారు. సాగర్‌లోని మొత్తం మూడు ఘాట్లలో సుమారు 3 లక్షల మంది భక్తులు హాజరయ్యారు.

ఒక్క శివాలయం ఘాట్‌లోనే 2 లక్షల కంటే ఎక్కువ మంది భక్తులు పుష్కర వేడుకల్లో పాల్గొన్నారు. వాడపల్లిలోనూ చివరిరోజు భక్త జనులు బారులు కొనసాగాయి. ఇక్కడకూడా ప్రదానంగా శివాలయం ఘాట్‌లోనే ఎక్కువ మంది భక్తులు పుష్కరస్నానాలు ఆచరించారు. 12వ రోజు వాడపల్లితో పాటు దామరచర్ల మండలంలోని 8 ఘాట్లలో కలిపి మొత్తం సుమారు 2 లక్షల మంది భక్తులు పుష్కర వేడుకల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత మట్టపల్లితోపాటు దర్వేశిపురంలోనూ లక్ష మంది కంటే ఎక్కువ భక్తులు పుష్కరాలకు హాజరయ్యారు.

చివరి రోజు పుష్కరాలకు ప్రముఖుల క్యూ..
కృష్ణా పుష్కరాల చివరిరోజు నాడు వివిధ ఘాట్లలో పలువురు ప్రముఖులు పుష్కర స్నానాలు చేశారు. అంతకు ముందు పిండ ప్రదానాలు కూడా నిర్వహించారు. నాగార్జున సాగర్‌లోని శివాలయం వీఐపీ ఘాట్‌లో సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ వేర్వేరుగా పుష్కర స్నానాలు చేసి.. కృష్ణవేణికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మట్టపల్లి పుష్కరఘాట్‌లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, హిమాలయాల నుంచి సాధువులు గణేష్ మహరాజ్ సహా పలువురు పుణ్య స్నానాలు ఆచరించారు. వీరితోపాటు ఇంకా పలువురు జిల్లాలోని పలు మారుమూల ఘాట్లలోనూ పుష్కర స్నానాలు చేయడం విశేషం. చివరిరోజు రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ పోలీసు ఉన్నతాధికారులతో కలిసి వాడపల్లి, నాగార్జున సాగర్‌లో పుష్కరఘాట్లను పరిశీలించారు. పోలీసుల కృషిని అభినందించారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
12 రోజుల పుష్కర వేడుక ముగింపు సందర్భంగా వాడపల్లిలో జిల్లా అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం శివకల్యాణంతోపాటు సాయంత్రం ఉత్సవ విగ్రహాలను నదిలో హంసవాహనం ద్వారా ఊరేగించారు. వాడపల్లిలో మొత్తం 8 పుష్కరఘాట్లలోనూ హంసవాహనానికి ప్రత్యేక హారతులు ఇచ్చారు. కన్నుల పండువగా సాగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ఎస్పీ ప్రకాష్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమెల్యే భాస్కర్‌రావుతోపాటు ఏజేసీ వెంకట్రావ్ పలువురు అధికారులు పాల్గొన్నారు.

వీటితోపాటు జిల్లా వ్యాప్తంగా సాగర్, మట్టపల్లి, మహంకాళిగూడెం, పానగల్, దర్వేశీపురం ఘాట్ల వద్ద చివరిరోజు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా సాగాయి. 12 రోజుల పండుగ ముగిసినా పుష్కరుడు ఏడాదిపాటు కృష్ణా నదిలోనే ఉండనున్నందున.. జిల్లాలోని కృష్ణాతీరానికి ఏడాది పొడవునా భక్తుల తాకిడి కొనసాగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది కృష్ణా అంత్య పుష్కరాలు పూర్తయిన తర్వాత కావేరీ నదిలో పుష్కరుడి ప్రవేశం జరుగుతుంది.

Source:http://www.namasthetelangaana.com/Districts/Nalgonda/%E0%B0%8F%E0%B0%A1%E0%B0%BE%E0%B0%A6%E0%B0%82%E0%B0%A4%E0%B0%BE-%E0%B0%AA%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B0%AE%E0%B1%87-22-599854.aspx