ఐదో రోజూ అదే జోరు…

-పుష్కర ఘాట్లలో జనసందడి
-స్నానమాచరించిన 3లక్షల మంది భక్తులు
నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ:కృష్ణా పుష్కరోత్సవానికి అశేష జన ప్రవాహం కొనసాగుతోంది. పవిత్ర పుణ్య స్నానాలు, పెద్దలకు పిండ ప్రదానాలతో అన్ని ఘాట్లలో రద్దీ నెలకొంది. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో నదీతీరం వేదంలా ఘోషిస్తోంది. ఐదో రోజు సుమారు 3లక్షల మంది పుష్కర స్నానాలు చేయగా.. నాగార్జునసాగర్‌లోనే ఈ సంఖ్య లక్ష ఉండడం విశేషం. వాడపల్లి, మట్టపల్లి, మహంకాళిగూడెం ఘాట్లు సైతం భక్తులతో కిటకిటలాడాయి. మరోవైపు సాగర్ బ్యాక్‌వాటర్ చెంత కాచరాజుపల్లిలో నిర్మించిన పుష్కర ఘాట్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న నదిలోకి నేటి నుంచి భక్తులను అనుమతించనున్నారు. ఇందుకోసం అక్కడ ప్రత్యేక భద్రతా ఏర్పాట్ల్లు చేపట్టారు.

కృష్ణాపుష్కరాల్లో భక్త జన హోరు కొనసాగుతోంది. మంగళవారం అయిదో రోజు జిల్లాలోని ప్రధాన పుష్కర ఘాట్ల వద్ద భక్తుల రద్దీ కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా 28 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే కాగా.. మంగళవారం ఉదయం మందకొడిగా ప్రారంభమైన భక్తుల రాక మధ్యాహ్నానికి ఊపందుకుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్ని ఘాట్ల వద్ద భక్తులు పుణ్య స్నానాలు, పిండ ప్రదానాలు కొనసాగాయి. సోమవారంతో పోల్చుకుంటే భక్తుల సంఖ్య తగ్గినప్పటికీ.. ఘాట్లు మాత్రం ఒక దశలో కిక్కిరిసిపోయాయి. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పుష్కర స్నానాల కోసం జిల్లాలోని ఘాట్లకు పోటెత్తారు.

షాద్ నగర్ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఐపీఎస్ ఆఫీసర్ తరుణ్ జోషీ కుటుంబ సమేతంగా సాగర్‌లోని శివాలయం ఘాట్‌లో పుష్కర స్నానాలు ఆచరించారు. ఇప్పటి వరకు జల్లు స్నానాలకే పరిమితమైన కాచరాజుపల్లి ఘాట్‌లో నేటి నుంచి భక్తులు నేరుగా నదిలోనే స్నానం చేసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ప్రస్తుత పుష్కర ఘాట్‌కు సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న నది చెంతకు ఇప్పటికే భక్తులు భారీ సంఖ్యలో వెళ్తుండగా.. నేటి నుంచి వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టి అనుమతించనున్నారు.

భక్త జన సాగరమే…
జిల్లా వ్యాప్తంగా మంగళవారం సుమారు 3 లక్షల మంది పుష్కర స్నానాలు చేశారు. సాయంత్రం 6 గంటల వరకు 2,24,972 మంది భక్తులు పుష్కర స్నానాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ఆ తర్వాత రాత్రి పొద్దు పోయే వరకు వివిధ ఘాట్లలో మరో 50 వేల మంది పాల్గొని ఉంటారన్నది అంచనా. అయితే.. మంగళవారం కూడా ఎక్కువ మంది భక్తులు నాగార్జునసాగర్‌కే తరలి వ చ్చారు. శివాలయంతోపాటు సురికి వీరాంజనేయస్వామి ఘాట్‌లలో సుమారు లక్ష మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.

సాగర్ తర్వాత అత్యధిక మంది వాడపల్లికి పోటెత్తారు. ఇక్కడ సాయంత్రానికే సుమారు 50వేల మంది భక్తులు హాజరయ్యారు. తర్వాత మట్టపల్లితోపాటు నేరేడుచర్ల మండలం మహంకాళిగూడెం ఘాట్లకు భక్తుల రద్దీ ఎక్కువగా కొనసాగింది. నల్లగొండలోని పానగల్, దర్వేశిపురం ఘాట్లతోపాటు మేళ్లచెర్వు మండలంలోని వజినేపల్లి, కిష్టాపురం, బుగ్గమాదారం.. చందంపేట మండలంలోని కాచరాజుపల్లి, పెద్ద మునిగల్, పీఏపల్లి మండలంలోని అజ్మాపురం, పెద్దవూర మండలం ఉట్లపల్లి ఘాట్లకు ఓ మోస్తరుగా భక్తులు హాజరయ్యారు.

సాగర్‌లో కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు…
జిల్లాలోనే అన్ని ఘాట్ల కంటే ఎక్కువ మంది భక్తులు హాజరవుతున్న నాగార్జున సాగర్‌లో మాత్రం పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సాగర్‌లోని హిల్‌కాలని, పైలాన్ పార్కింగ్‌లు ఖాళీగా ఉంటున్నా భక్తుల సొంత వాహనాలను మాత్రం 10 కిలోమీటర్ల ముందే నిలిపేస్తున్నారు. ఇద్దరు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, గుంటకండ్ల జగదీష్‌రెడ్డి మంగళవారం సాగర్‌కు వచ్చిన నేపథ్యంలో తమపై కొనసాగుతున్న ఆంక్షలను పలువురు మీడియా ప్రతినిధులు శివాలయం ఘాట్ వద్ద ఆందోళన చేపట్టి మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి వెంటనే స్పందించి ఎస్పీ ప్రకాష్‌రెడ్డితో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. మంత్రి ఆదేశం మేరకు ఎస్పీ ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా సాగర్‌లో మీడియా ప్రతినిధులపై ఆంక్షలు కొనసాగుతున్నాయని సాయంత్రం మరో దఫా ఆందోళన జరిగింది. ఇక సాధారణ భక్తులకు మాత్రం కొంత కూడా ఉపశమనం కలిగించే ఆంక్షలను ఇప్పటికీ పోలీసు శాఖ అమలు చేయకపోవడం గమనార్హం.

Source:http://www.namasthetelangaana.com/Districts/Nalgonda/%E0%B0%90%E0%B0%A6%E0%B1%8B-%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%82-%E0%B0%85%E0%B0%A6%E0%B1%87-%E0%B0%9C%E0%B1%8B%E0%B0%B0%E0%B1%81-22-598090.aspx