కృష్ణమ్మకు పుష్కర శోభ

krishna శ్రావణశుద్ధ నవమి శుక్రవారం, దేవగురువు బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించే శుభలగ్నంలో ఈ నెల 12న కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. కృష్ణమ్మ పాదసన్నిధిలో పవిత్ర పుష్కరస్నానాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎగువన కర్ణాటక రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురువడంతో కృష్ణవేణి పరవళ్లు తొక్కుతూ తెలంగాణ నేలపై నుంచి అలల హారతితో విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం అధికార నివాసంలో పుష్కరాల ఏర్పాట్లను సమీక్షించారు. ఇటీవల కురిసిన వర్షాలకు కృష్ణమ్మ ఉరవళ్లు పరవళ్లతో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ప్రవహిస్తూ కొత్తగా నిర్మించిన 81 ఘాట్లను పలుకరిస్తున్న సంగతి తెలిసి సీఎం సంతోషభరితులయ్యారు. దుర్ముఖిలో ప్రకృతిమాత, కృష్ణా గోదావరి నదులు తెలంగాణకు శుభాశీస్సులందిస్తున్నాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు. శుక్ర, శని, ఆది, సోమ వారాలలో వరుస సెలవులు వస్తున్నందున పవిత్ర కృష్ణమ్మ పాదసన్నిధిలో లక్షల సంఖ్యలో భక్తజనం పవిత్ర పుష్కరస్నానం ఆచరిస్తారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
-రేపటినుంచి పుష్కరాలు.. సమీక్షించిన ముఖ్యమంత్రి
-నేడు అలంపూర్‌కు సీఎం కేసీఆర్
-మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో 81 పుష్కరఘాట్లు.. అన్ని ఏర్పాట్లు పూర్తి
-సకల సదుపాయాలపై శ్రద్ధ
-అధికారులకు సీఎం ఉద్బోధ
-రేపు గొందిమల్ల పుష్కరఘాట్‌లో సతీసమేతంగా కేసీఆర్ పుష్కరస్నానం
-అనంతరం జోగుళాంబ దర్శనం

సదుపాయాల విషయంలో లోపాలు ఉండవద్దని, భక్తులకు కావాల్సిన విధంగా అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ అధికారుల ప్రధాన కర్తవ్యం కావాలని ఉద్బోధించారు. సమావేశంలో దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, బీసీ, అటవీ సంక్షేమశాఖ మంత్రి జోగురామన్న, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మునిసిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, శంభీపూర్ రాజు, సీఎంవో అధికారి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేవగురువు కన్యారాశిలోకి వచ్చిన పదకొండు రోజులలో కృష్ణానదిలో పవిత్రస్నానం ఆచరించినట్లయితే పారమార్థిక చింతన సుసంపన్నమవుతుందనే విశ్వాసం ప్రజలలో గాఢంగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ఓషధులతో కూడిన నీరు కావడం వల్ల శారీరక శుద్ధి, ఆధ్యాత్మిక క్రతువు కావడం వల్ల ఆత్మశుద్ధి పుష్కరాలతో కలుగుతాయని, ఇది మన భారతీయ ధార్మిక సంప్రదాయమని వివరించారు.
ఈ పుష్కరాల సందర్భంలో దానధర్మాలు చేయడం, పితృదేవతలకు పిండప్రదానాలు చేయడం, తర్పణాలు ఇవ్వడం వల్ల ప్రాంతమంతా ఆధ్యాత్మిక తేజస్సుతో వెల్లివిరియనున్నదని వ్యాఖ్యానించారు. ఆగస్టు 12 నుంచి 23 వరకు 12 రోజులపాటు పుష్కరాలు కొనసాగనున్నందున, ప్రాజెక్టులన్నీ జలకళతో తొణికిసలాడుతున్నందున పుష్కరఘాట్ల వద్ద సమృద్ధిగా నీరు ఉండేవిధంగా నీటిపారుదల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, గజ ఈతగాళ్లను అందుబాటులో పెట్టాలని చెప్పారు. అడుగడుగున భద్రత ఉండాలని, సీసీటీవీలతో రెప్పవాల్చకుండా పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. మంచినీటి సదుపాయంలో, నిరంతర విద్యుత్తు సరఫరాలో, ఆలయాల వద్ద క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దని అన్నారు. గోదావరి పుష్కరాల స్ఫూర్తితో అత్యద్భుతమైన రీతిలో ఏర్పాట్లు ఉండాలని అధికారులను, ప్రజాప్రతినిధులను ఉత్సాహపరిచారు
Source:http://www.namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/krishna-pushkaralu-starts-from-tomorrow-1-2-519755.html