కృష్ణమ్మ తీరం..పుష్కర మేళా

krishnaకృష్ణవేణి పుష్కరాలకు ప్రజలు ప్రభంజనంలా తరలివచ్చారు. పుష్కరాలు మరో రెండు రోజుల్లో ముగుస్తుండటంతోపాటు ఆదివారం సెలవు కావడంతో భక్తులు పుణ్యస్నానాల కోసం మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని ఘాట్లకు పోటెత్తారు. రెండు జిల్లాల్లో కలిపి ఒక్కరోజే 50 లక్షల మంది భక్తులు నదీస్నానమాచరించారు. పది రోజుల్లో దాదాపు రెండు కోట్ల మంది పుష్కరస్నానాలు ఆచరించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక్కరోజే 35 లక్షల మంది పుష్కరాలకు తరలివచ్చారు. ప్రధాన పుష్కరఘాట్ల ప్రాంతాల్లో చెట్టు, పుట్ట, గుట్ట అన్నీ జనంతో నిండిపోయాయి. అధికారులు, పోలీసులు కంట్రోల్ చేయలేనంత పరిస్థితి ఏర్పడింది. సోమశిల పుష్కరఘాట్‌లో దాదాపు 8 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సోమశిల నుంచి కొల్లాపూర్ వరకు వాహనాల రాకపోకలకు బ్రేక్ పడటంతో స్వయంగా మంత్రి జూపల్లి కృష్ణారావు రంగంలోకి దిగి బైక్‌పై వెళ్లి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేశారు.
krishna3అక్కడి నుంచి పుష్కరఘాట్‌కు వెళ్లి మైకు ద్వారా ట్రాఫిక్ రద్దీపై భక్తులు సహకరించాలని సూచనలు చేస్తూ స్నానాల వేగవంతానికి కృషిచేశారు. రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి పారేవుల ఘాట్‌లో, పస్పుల ఘాట్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సోదరుడు ప్రభాకర్‌రావు, బీచుపల్లిలో సినీహీరో సునీల్, రంగాపూర్‌ఘాట్‌లో దర్శకుడు శంకర్, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి స్నానమాచరించారు. సోమ, మంగళవారాలు సైతం ఇంతకంటే భారీగా జనం వచ్చే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో ఉదయం నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఘాట్ల వద్ద బారులు తీరారు. మొత్తం 28 ఘాట్లలో 15 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు.
హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు సాగర్‌కు క్యూ కట్టడంతో హైవేపై రద్దీ ఏర్పడింది. ఒక దశలో పైలాన్ నుంచి హిల్‌కాలనీకి రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే తేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రభుత్వ సలహాదారు రమణాచారి కుటుంబ సమేతంగా సాగర్‌లోని శివాలయం ఘాట్‌లో పుష్కర స్నానం చేసి కృష్ణవేణి జలాలకు పూజలు నిర్వహించారు.

Source:
http://www.namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/krishna-pushkaram-festival-celebration-in-telangana-1-2-520741.html