కృష్ణవేణికి హారతులందించడంతోపూర్వజన్మ సుకృతం

పన్నెండేళ్లకు ఒక మారు వచ్చే కృష్ణవేణి పుష్కరాలకు ప్రతి రోజు నదికి హారతులివ్వడంతో పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లకా్ష్మరెడ్డిలు అన్నారు. శుక్రవారం రాత్రి బీచుపల్లిలోని పుష్కర ఘాట్‌లో కృష్ణానదికి పూజలు చేసి, పూల చల్లి, హారతులిచ్చారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఎనిమిది రోజులుగా జిల్లాలోని 52 పుష్కర ఘాట్లకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారని పేర్కొన్నారు. మరో నాలుగు రోజుల్లో రెట్టింపు భక్తులు పుష్కర స్నానాలకు హాజరై పుష్కరిణిలో స్నానాలు ఆచరించి పుష్కరాలను ఆదరించాలని భక్తులకు పిలుపునిచ్చారు. బీచుపల్లిలో ప్రదర్శిన నిర్వహించిన పేరణి నృత్యం పలువురిని ఆకట్టుకున్నది.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా పేరణి నృత్యం నిలుస్తోందని మంత్రులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పేరణి కళాకారులను మంత్రులు అభినందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్, జేసీ రాంకిషన్, ప్రత్యేకాధికారి గంగారెడ్డి, ఇటిక్యాల జెడ్పీటీసీ ఖగనాథ్‌రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Source:
http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B0%B5%E0%B1%87%E0%B0%A3%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%A1%E0%B0%82%E0%B0%A4%E0%B1%8B%E0%B0%AA%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%9C%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AE-%E0%B0%B8%E0%B1%81%E0%B0%95%E0%B1%83%E0%B0%A4%E0%B0%82-20-598840.aspx