కృష్ణవేణి పుష్కరాల్లో ఆధ్యాత్మిక తీరాలు

somasila05హైదరాబాద్: భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కృష్ణా పుష్కరాలు మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. బృహస్పతి కన్యారాశిలోకి ప్రవేశించడంతో ఆరంభమయ్యే పుష్కర మహోత్సవాల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొననున్నారు. రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాలనుంచి సైతం భక్తులు నదీతీరంలో పుణ్య స్నానాలాచరించేందుకు వస్తుంటారు. గత ఏడాది గోదావరి పుష్కరాల్లో, నిన్నా మొన్నటి అంత్య పుష్కరాల్లో సైతం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు అందరి చూపు కృష్ణా పుష్కరాల వైపే. ఈ నెల 12 నుంచి 23వ తేదీ వరకు ఇవి నిర్వహించనున్నారు. పుష్కరాల సందర్భంగా నదీ స్నానాలు, పూజల వల్ల పుణ్య ఫలం లభిస్తుందంటారు. అందుకే వేలాదిగా భక్తులు పుష్కరాల్లో భాగస్వామ్యమవుతుంటారు. మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లో పలుచోట్ల ప్రభుత్వం పుష్కరఘాట్‌లు నిర్మించింది. ఆయా పుణ్యక్షేత్రాలను ప్రత్యేకంగా ముస్తాబు చేస్తోంది. కృష్ణా పుష్కరాల సందర్భంగా మీరూ మీకు దగ్గరలోని పుష్కరఘాట్‌ని సందర్శించవచ్చు.

మహారాష్ట్రలోని మహాబలేశ్వరం వద్ద ఉద్భవించిన కృష్ణానది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. తుంగభద్ర, వేణి, మూసీ, దిండి, పాలేరు, మున్నేరు ఉపనదులుగా ఉన్నాయి. పుష్కరాల సందర్భంగా నదీ స్నానం చేయడం వల్ల పన్నెండేళ్ల పాటు నిత్యం నదీ స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుందంటారు. కాగా కృష్ణా పుష్కరాలకు ఆయా పుష్కర ఘాట్‌లను, దేవాలయాలను సందర్శించేందుకు ఇప్పటికే పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలను సైతం రూపొందించింది. మహబూబ్ నగర్‌లో వల్లభాపురం, బీచుపల్లి, సోమశిల, ఆలంపూర్, మాగనూరు మండలం తంగిడి పుష్కర ఘాట్ సమీపంలోని వల్లభేశ్వరస్వామి ఆలయం, దత్తాత్రేయ స్వామి ఆలయం, రామలింగేశ్వరస్వామి ఆలయం, మక్తల్ మండలంలో పస్పుల ఘాట్ సమీపంలోని ఆంజనేయ స్వామి దేవాలయం, వీపనగండ్ల మండలంలో పెద్దమరూర్ ఘాట్ సమీపంలో ఈశ్వర ఆలయం, జప్రోలు మదన గోపాల స్వామి, కొల్లాపూర్ మండలం సింగోటం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలను సైతం దర్శించుకోవచ్చు.

Source:
http://www.namasthetelangaana.com/LatestNews-in-Telugu/krishnaveni-pushkaralu-spiritual-temples-1-1-499978.html