కృష్ణవేణి.. మహా పుష్కరమేని…

-ఏళ్ల తర్వాత కృష్ణా నదికి అరుదైన మహా పుష్కరాలు
-నేటి నుంచి ఏడాదిపాటు నదిలోనే ఉండనున్న పుష్కరుడు
సుముహూర్తం : నేటి ఉదయం 5.58గంటలు
12రోజులపాటు కృష్ణా కుంభమేళా
144ఏళ్ల తర్వాత అరుదైన మహాపుష్కరాలు
తెలుగింటి విరిబోణి.. నీలగిరి సిరివేణి… పుష్కరమేని ధరించి పన్నెండేళ్ల వేడుకకు
సిద్ధమైంది. ఏడాదిపాటు తనలోనే ఉంటూ పుణ్యం పంచనున్న పుష్కరుడి కోసం కృష్ణవేణి
సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. గురువారం రాత్రే దేవగురువు బృహస్పతి కృష్ణానదిలో
ప్రవేశించినా.. సూర్యోదయం వేళ శుక్రవారం ఉదయం 5.58గంటలకు కృష్ణా కుంభమేళా
ప్రారంభం కానుంది. ఈ పుష్కరోత్సవం తెలంగాణ రాష్ట్రంలో తొలి సంబురమే కాక.. పన్నెండు
పుష్కరాలకోసారి, 144ఏళ్ల తర్వాత కృష్ణాకు వచ్చిన అరుదైన మహా పుష్కరాలు కావడం విశేషం.
ఏడాదిపాటు నదిలోనే పుష్కరుడు ఉండనున్నా.. గ్రహాల ప్రకారం తొలి 12 రోజులే పుణ్యఫలం
ఎక్కువనేది పురోహితుల మాట.

మట్టపల్లిలో మంత్రి గుంటకండ్ల పుణ్యస్నానం
జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి కుటుంబ సమేతంగా తొలిరోజు పవిత్ర పుణ్యక్షేత్రం మట్టపల్లిలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. ప్రహ్లాద ఘాట్ నుంచి జిల్లాలో పుష్కరాలను ప్రారంభించనున్నారు. పుష్కరస్నానం అనంతరం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. అనంతరం పానగల్ ఘాట్‌ను సందర్శించనున్నారు.

నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పన్నెండేళ్ల తర్వాత కృష్ణా కుంభమేళా నేటి ఉదయం 5:58గంటలకు ప్రారంభం కానుంది. దేవగురువు బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించడంతో మొదలుకానున్న పుష్కరాలు.. ఏడాదిపాటు కొనసాగుతాయి. నేటి నుంచి ఏడాది కాలంపాటు మహావిష్ణువు సృష్టి అయిన పుష్కరుడు కృష్ణా నదిలోనే ఉంటాడు. దేశంలోని పన్నెండు జీవనదుల్లో ఏటా ఒక నదిలో కొనసాగే పుష్కరుడి ప్రయాణం.. మొన్నటి వరకూ గోదావరిలో కొనసాగిన సంగతి తెలిసిందే. బృహస్పతి సింహరాశి ప్రవేశంతో గతేడాది గోదావరి పుష్కరాలు ప్రారంభం కాగా.. నిన్నటితో అంత్య పుష్కరాలు పూర్తి చేసుకుంది. కన్యారాశిలో దేవగురువు బృహస్పతి ప్రవేశిస్తున్న సందర్భంగా నేటి నుంచి పుష్కరుడు కృష్ణలో ప్రవేశిస్తాడు. గురువారం రాత్రి 9:30గంటల ప్రాంతంలోనే పుష్కరుడి ప్రవేశం జరుగుతున్నా.. నిషీధి వేళ నదిలో స్నానాలు, పిండ ప్రదానాలు నిషిద్ధం అయినందున నేటి ఉదయం 5:58నుంచి పుష్కరాల ప్రారంభానికి వేద పండితులు సుముహూర్తం నిర్ణయించారు.

తొలి పన్నెండు రోజులు గురువు బలం
నదిలో పుష్కరుడు ఉండే ఏడాదిపాటూ ముక్కోటి దేవతలు, ఇంద్రాది అష్టదిక్పాలకులు ఆ నదీ తీరంలోనే సంచరిస్తారనేది ప్రతీతి. అందువల్ల ఆ సమయంలో నదుల్లో పుణ్యస్నానాలు చేయడం వల్ల వారి అనుగ్రహం లభిస్తుందనేది నమ్మకం. దేవతలతోపాటు గతించిన పితృ దేవతలు కూడా పుష్కర సమయంలో నదీ తీరాల్లోనే సంచరిస్తుంటారని.. వారికి పిండ ప్రదానం చేయడంతో వారి ఆత్మలు శాంతించడంతోపాటు మనకు అనుగ్రహమూ కలుగుతుందనేది ఆనవాయితీ. ఏడాది అంతా పుష్కరాలు కొనసాగనున్నప్పటికీ తొలి పన్నెండు రోజులు గురువు బలంగా ఉంటాడని.. అందుకే ఎక్కువ మంది ఆ సమయంలోనే పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. అందులోనూ ఈసారి కృష్ణానదికి వస్తున్నవి మహా పుష్కరాలు అయినందున భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. దేశ నలుమూలల నుంచీ భక్త జనులు నదీ స్నానాల కోసం పోటెత్తే అవకాశాలున్నాయి.

28ఘాట్లు, 8750 మంది సిబ్బంది, 6765మంది పోలీసులు..
కృష్ణా పుష్కరాలకు యంత్రాంగం సర్వం సన్నద్ధం చేసింది. జిల్లాలోని 9మండలాల్లో 28ఘాట్లు ఏర్పాటు చేయగా.. అన్ని ఘాట్లనూ పూర్తిస్థాయిలో ముస్తాబు చేశారు. ఘాట్ల వద్ద జల్లు స్నానాలతోపాటు బట్టలు మార్చుకునే గదులనూ ఏర్పాటు చేశారు. ప్రతి ఘాట్‌నూ విద్యుద్దీపాలతో అలంకరించారు. పూజా, ప్రదాన సామగ్రి అన్నిచోట్లా అందుబాటులో ఉంచారు. 1500 పురోహితులకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు. మొత్తం 8750 మంది సిబ్బందిని పుష్కర సేవల్లో మూడు షిఫ్టులుగా వినియోగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 6765 మంది పోలీసులు భద్రతా చర్యల్లో పాల్గొంటున్నారు. హైవేలతోపాటు అన్ని రహదారుల్లోనూ పోలీసు పహారా కొనసాగుతుంది. ఘాట్ల వద్ద 450మంది గజ ఈతగాళ్లు, 42మంది ఎన్డీఆర్‌ఎఫ్ బెటాలియన్ రక్షణ చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయగా.. భక్తుల, వాహన రద్దీని కంట్రోల్ చేయడానికి 29హోల్డింగ్, 30పార్కింగ్ పాయింట్లు సిద్ధం చేశారు.

144ఏళ్లకోసారి మహా పుష్కరాలు
పన్నెండేళ్లకోసారి వచ్చేవి పుష్కరాలు కాగా.. పన్నెండు పుష్కరాలకోసారి వచ్చే వాటిని మహా పుష్కరాలు అంటారు. అలా ఈసారి కృష్ణా నది పుష్కరాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ సమయంలో ఏడాదిపాటు పుష్కరుడు నదిలోనే ఉంటాడు. ఏడాది కాలంపాటు నదిలో స్నానం ఆచరించినా.. పిండ ప్రదానాలు చేసినా పాపాలు తొలగి పుణ్యం చేకూరుతుంది.
– రాపోలు మల్లికార్జునశర్మ, సకలపూజలు.కామ్ నిర్వాహకుడు

సకల దేవతల అనుగ్రహం
పుష్కరాల సమయంలో దేవతలు, అష్ట దిక్పాలకులు, పితృ దేవతలు నదీ తీరంలోనే సంచరిస్తుంటారు. పుణ్యస్నానాలు, పిండ ప్రదానాలతో వారందరి అనుగ్రహం లభిస్తుంది. తొలి పన్నెండు రోజులు పుణ్యఫలం అధికంగా ఉంటుందనేది ఆది నుంచీ కొనసాగుతున్న నమ్మకం. 144 ఏళ్ల తర్వాత వస్తున్న మహా పుష్కరాలు అయినందున.. ఈ సారి ఎక్కువ మంది భక్తులు స్నానమాచరించే అవకాశం ఉంది.
– దౌలతాబాద్ వాసుదేవశర్మ, అర్చకుల సంఘం జిల్లా అధ్యక్షుడు

కృష్ణవేణికి దండాలు
పుష్కర ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు
పిండ ప్రదానాలతో పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి
పుష్కర దానాలతో సకల పాపాలు హరింపు
దామరచర్ల : సహ్యముని తపోఫలంతో శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో మహారాష్ట్రలోని పూణే పట్టణానికి దక్షిణ కనుమలు గోఖర్ణేశ్వరము (మహాబలేశ్వరం) సహ్యపర్వతాల్లో సముద్ర మట్టానికి 4714అడుగుల్లో జన్మించింది కృష్ణమ్మ. వేణి నదిని కలుపుకొని కృష్ణవేణిగా పేరుగాంచింది. విష్ణుమూర్తి మానస పుత్రికైన కృష్ణవేణి.. త్రిమూర్తుల సహితంగా మహారాష్ట్రలో మహాదేవుడిని, కర్ణాటకలో వీరభద్రుడిని, తెలంగాణాలో ఆలంపూర్ జోగులాంబను, వాడపల్లిలోని అగస్తేశ్వరుడిని, ఆంధ్రాలోని శ్రీశైలం, విజయవాడ, అమరావతి పుణ్యక్షేత్రాలను పుణీతం చేస్తూ సముద్రుడిలో సంగమిస్తుంది.

ఇతిహాసంలో పుష్కరాల ప్రాముఖ్యం
మానవులు తాము చేసిన పాపాలను పొగొట్టుకునేందుకు నదీ స్నానం చేస్తారు. నదీమతల్లి ఆ పాపాలను స్వీకరించి మానవులను పునీతులను చేస్తుంది. మానవుల వల్ల పాపాలను మోస్తున్న నదులు భరించలేని బాధలు పడుతుంటే పుష్కరుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి బ్రహ్మ అనుగ్రహం పొంది తనను ఒక పవిత్ర క్షేత్రంగా మార్చమని కోరుతాడు. ఈ విధంగా పుష్కరుడు పుష్కరతీర్థంగా మారి స్వర్గలోకమున మందాకిని నదిలో అంతర్భాగమయ్యాడు. వాయు పురాణం ప్రకారం బ్రహ్మలోక వాసి పుష్కరుడు గురుగ్రహం ఎప్పుడు ఏ రాశిలో వస్తుందో కాలాన్ని బట్టి పుష్కరుడు ఆ నదులను దర్శిస్తుంటాడు. బ్రహ్మదేవుడు స్వయంగా పంపించిన పుష్కరుడు నదులకు వచ్చినప్పుడు సప్తమహారుషులు ఆయనకు ఆతిథ్యం ఇచ్చి గౌరవిస్తుంటారు. వారు సూక్ష్మదేహంతో వచ్చి నదీస్నానాలు ఆచరిస్తారు. కనుక ఆ కాలం పవిత్రమైనదని భావిస్తారు. నదులకు పుష్కరుడు ప్రవేశించిన తొలి 12రోజులు చాలా ముఖ్యం ఈ రోజుల్లో పితృదేవతలను స్మరించుకోవడానికి వారిని సంతృప్తి పర్చడానికి తర్పణాలు వదలడం చాలా మంచిదని భావిస్తారు. పుష్కర సమయంలో స్నానాలు చేసి తర్పణాలు, జపాలు, దానాలు చేస్తారు.

పుష్కరమంటే..
పుష్కరమంటే పన్నెండు సంవత్సరాలు. భారతదేశంలోని 12ముఖ్యమైన జీవనదులకు 12సంవత్సరాలకోసారి పుష్కరాలు వస్తాయి. ఆ సమయంలో ఆయా నదుల్లో స్నానాలు ఆచరిస్తే పుణ్యం వస్తుందని భావిస్తారు.
గంగానది మేషరాశి
యమున కర్కాటకరాశి
నర్మద వృషభరాశి
సరస్వతీనది మిథునరాశి
గోదావరి సింహరాశి
కృష్ణానది కన్యారాశి
కావేరి తులారాశి
భీమానది వృశ్చికరాశి
పుష్కరవాహిని ధనురాశి
తుంగభద్ర మకరరాశి
సింధూనది కుంభరాశి
ప్రాణహిత మీనరాశి
బృహస్పతి ఆయా ప్రవేశించినప్పుడు ఆయా నదులకు పుష్కరాలు వస్తాయి. పుష్కరకాలం ఏడాదిపాటు ఉంటుంది. ఈ సమయంలో మొదటి 12రోజులు ఆది పుష్కరంగా చివరి 12రోజులు అంత్య పుష్కరంగా వ్యవహరిస్తారు.

పుష్కరాలలో ప్రదానాలకు ప్రాధాన్యం
పుష్కరాల సమయంలో పుణ్యస్నానం ఆచరించి పితృదేవతలకు తర్పణం, పిండప్రదానం, శ్రాద్ధకర్మలు చేస్తే గతించిన వారికి ప్రాప్తిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. మరణించినవారు మాత్రమే పిండ ప్రదానానికి అర్హులు. పిత్రులను తృప్తిపరిచి వారి ఆశీస్సులను పొందడానికి ఈ పుష్కర సమయం శుభప్రదం. మొదటి రోజున హిరణ్యశ్రాద్ధం.. రోజున అన్నశ్రాద్ధం, పన్నెండో రోజున ఆమశ్రాద్ధం మంచిదని పురాణాల్లో ఉంది.

నదీమాతకు పూజలు.. వాయినాలు…
సుమంగళిగా జీవితాంతం ఉండాలని కోరుతూ మహిళలు పుష్కరాల సందర్భంగా నదీమతల్లికి వాయినాలు ఇస్తారు. విఘ్నాలు, ఆటంకాలు తొలగి అన్నీ శుభాలే కల్గేందుకు మహిళలు స్నానం ఆచరించిన తర్వాత కృష్ణవేణీమాతను స్మరించుకుని ఆవాహనం చేసి అష్టోత్తర పూజ నిర్వహించి, పలుచటి అరటిమోదలో, ప్రమిదలో దీపారాదన చేసి నదీమాతకు మంగళహారతి ఇవ్వాలి. చీర, జాకెట్, గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ, పుస్తె,మెట్టెలను పూజించి నదీమాతకు అర్పించాలి. నైవేధ్యం పెట్టిన అనంతరం నదికి కర్పూరంతో హారతి ఇవ్వాలి.

పుష్కరుడు పుట్టిందిలా..
పూర్వం తుందిలుడనే ధర్మాత్ముడు తపస్సు చేయడంతో ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. దీంతో తుందిలుడు తనలో కల్పించాలని కోరుకుంటాడు. ఈశ్వరుడు తన అష్టమూర్తుల్లో ఒకటైన జలమూర్తిలో అతడికి శాశ్వత స్థానం కల్పిస్తాడు. దీంతో తుందిలుడు మూడున్నర కోట్ల పుణ్యతీర్థాలకు అధిపతి అయ్యాడు. ఇలా సకల జీవరాశులను పోషించే శక్తిని పొంది పుష్కరుడుగా మారాడు. బ్రహ్మదేవుడి సృష్టికి జలం అవసరం కావడంతో పుష్కరుడిని తనకు ఇవ్వాల్సిందిగా ఈశ్వరుడిని కోరుతాడు. ఈశ్వరుడు తథాస్తు అనగానే పుష్కరుడు బ్రహ్మదేవుడి కమండలంలోకి ప్రవేశిస్తాడు. బ్రహ్మ కార్యం పూర్తయిన తర్వాత ప్రాణులను బతికించేందుకు, ధర్మం నెరవేరడానికి ప్రాణులకు జీవనాధారమైన జలం కోసం బృహస్పతి బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. ఆ కోరికను అమలు చేసే క్రమంలోనే పుష్కరుడు తాను బ్రహ్మదేవుడిని వదిలి వెళ్లలేనని చెప్తాడు. దీంతో బ్రహ్మ, బృహస్పతి, పుష్కరుడు ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు.

గ్రహరూపంలో ఉన్న బృహస్పతి.. రాశుల్లో ప్రవేశించినప్పుడు పన్నెండు రోజులపాటు, మిగిలిన ఏడాదిపాటు మధ్యాహ్న సమయంలో రెండు ముహూర్తాల్లో పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయిస్తారు. ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి అధిపతిగా ఉన్న నదికి పుష్కరుడితో వస్తారు. కనుక పుష్కరకాలంలో నదీస్నానం చేస్తే పుణ్య ప్రదాయమని పురాణాలు చెప్తున్నాయి.

పుష్కరస్నానం ఇలా చేయాలి..
భార్యాభర్తలు వేణి స్నానం చేయాలి. భార్య.. భర్త కొంగును తన కండువాకు కట్టుకుని కలిసి మునగాలి. భార్యాభర్తలు ఒకేసారి పుష్కర స్నానానికి వెళ్లని పక్షంలో స్త్రీలు మంగళసూత్రంపై, పురుషులు హృదయంపై చేయి పెట్టుకుని స్నానమాచరించాలి. ఉన్నవారు సైతం పుష్కర స్నానం చేయొచ్చు. పుష్కరస్నానం తరువాతే కృష్ణమ్మ తల్లికి బ్రాహ్మణ సహాయం చేత అష్టోత్తర (108)నామాలతో సుమంగళి పూజా కార్యక్రమాలు ఆచరించాలి. పితృదేవతలకు పిండప్రదానం చేసినట్లయితే తదుపరి పుష్కర స్నానం చేయాలి. పుష్కరాల్లో భాగంగా షోడష మహాదానములు. లేదా బ్రాహ్మణులకు అన్నదానం (బియ్యం, కూరగాయలు) శక్త్యనుసారం దక్షిణ తాంబూలాదులు సమర్పించి, వారి ఆశీర్వచనాలు పొందాలి. అనంతరం బ్రాహ్మణ జంటలకు, ముత్తయిదువులకు వాయినాలు అందజేసి వారి ఆశీస్సులు పొందాలి.
(ఈ శ్లోకాన్ని ఉచ్చరించి మొదటి
మునక వేయాలి)
తీర్థరాజా నమస్తుభ్యం
సర్వలోకైక సంశ్రయ!
త్రస్మత్త్నానం కరోమ్యహం
-భవబంధ విముక్తమే!!
పుష్కర సమయంలో బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే అశ్వమేధ చేసిన ఫలితం లభిస్తుంది. కేదారినాథ్‌లో కేదారేశ్వరుడిని, బదరీనాథ్‌లో విష్ణువుని నూరు సార్లు దర్శిస్తే ఏ పుణ్యఫలితం దక్కుతుందో.. పుష్కర కాలంలో అన్నదానం చేసిన వారికి అదే పుణ్య ఫలితం కలుగుతుంది. పుష్కర కాలంలో చేసిన దానధర్మాల వల్ల గతించిన పితృదేవతలకు (తల్లిదండ్రులకు) శాశ్వత బ్రహ్మలోక ప్రాపి ్తకలుగుతుంది. శ్రద్ధాదులయందు గోదానం ముఖ్యం. గోదానం కంటే వెయ్యిరెట్లు ఫలితం బ్రాహ్మణ అన్నదానం వల్ల వస్తుందని శాస్త్రం చెబుతుంది. బ్రాహ్మణ అన్నదానం వల్ల వేద పురుషుడు ఆనందింపబడి దాతల వంశములకు పుత్రపౌత్రాభి వృద్ధితోపాటు ఐష్టెశ్వర్యాలు ప్రాప్తిస్తాయి.

Source:
http://www.namasthetelangaana.com/Districts/Nalgonda/%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B0%B5%E0%B1%87%E0%B0%A3%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE-%E0%B0%AA%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B0%AE%E0%B1%87%E0%B0%A8%E0%B0%BF-22-596865.aspx