కృష్ణా తీరం.. జన హారం

-మారమునగాల ఘాట్‌లో మంత్రి హరీశ్‌రావు తల్లిదండ్రులు..
-రంగాపూర్‌లో బీజేపీ నేత లక్ష్మణ్, ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి..
-బీచుపల్లిలో ఎంపీ గరికపాటి, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, మాజీ మంత్రి పొన్నాల, సినీ రచయిత గోపీ మోహన్..
-సోమశిలలో సాహితీవేత్త కపిలవాయి..
-నదీఅగ్రహారంలో హైకోర్టు జడ్జి స్వరూపారెడ్డి..
-ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, లకా్ష్మరెడ్డి, డీఐజీ అకున్ సబర్వాల్..
-11వ రోజు 21లక్షల మంది పుణ్యస్నానాలు..
-నేటితో ముగియనున్న పుష్కర మహోత్సవం..
-జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించిన అధికారులు..
మహబూబ్‌నగర్ నమస్తే తెలంగాణ ప్రతినిధి :కృష్ణాతీరం.. జనహారంలా మారింది.. పుష్కలంగా నీళ్లు, తగిన ఏర్పాట్లు కల్పించడంతో భక్తులు తనివితీరా పుణ్యస్నానాలు చేస్తున్నారు. బీచుపల్లికి భక్తుల తాకిడి పెరగడంతో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక షవర్లను ఏర్పాటు చేశారు. కృష్ణా తీరానికి వీఐపీల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న ది. మారమునగాల ఘాట్‌లో మంత్రి హరీశ్‌రావు తల్లిదండ్రులు లక్ష్మీదేవి, సత్యనారాయణరావులు స్నానమాచరించి జోగుళాంబను దర్శించుకున్నారు. నదీఅగ్రహారంలో హైకోర్టు జడ్జి స్వరూపారెడ్డి స్నానమాచరించారు. పుష్కరఘాట్లల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు మంత్రులు జూపల్లి కృష్ణారావు, లకా్ష్మరెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, డీఐజీ అకున్ సబర్వాల్, కలెక్టర్ శ్రీదేవి, ఎస్పీ రెమా రాజేశ్వరి పర్యవేక్షిస్తున్నారు. పుష్కర మహోత్సవానికి నేడు ఆఖరి రోజు కావడంతో జిల్లాలోని పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.పాలమూరు జిల్లాలో కృష్ణా పుష్కర వేడుక 11 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగుతుంది. ఈ నెల 12 నుంచి ప్రారంభమైన పుష్కరాలు 23 వరకు(12 రోజులు) కొనసాగుతాయి. ఈ క్రమంలో మంగళవారం పుష్కరాలకు చివరి రోజు కానుంది. జోగుళాంబ ఘాట్‌లో సీఎం కేసీఆర్ పుష్కరాలను అధికారికంగా ప్రారంభించడంతో తెలంగాణలో సంబురాలు మొదలయ్యాయి. తొలిసారి నూతన రాష్ట్రంలో వచ్చిన పుష్కరాలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేసింది. కనీవినీ ఎరుగని రీతిలో అధికారులు చేసిన వసతులను చూసి ఔరా మన తెలంగాణ ప్రభుత్వం అనిపించుకునేలా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించి పాలమూరు చరిత్రను తిరగరాశారు. ఇంత పెద్ద మహోత్సవంలో చీమ కూడా చిటుక్కు మనకుండా కార్యాన్ని నడిపించిన ఘనత మంత్రులు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్,ఎమ్మెల్యేలు, కలెక్టర్,ఎస్‌పీలకే దక్కుతుంది.

కోటీ 70 లక్షల మంది
పదకొండు రోజుల పాటు సాగుతున్న పాలమూరు పుష్కర సంబురంలో కోటీ 70 లక్షల మంది స్నానమాచరించారు. గతంలో పుష్కరాలు వచ్చినా ఇంత ప్రాచూర్యం ఎక్కడా కనిపించక పోవడంతో ముఖ్యులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొనే వారు. నూతన రాష్ట్రంలో ప్రభుత్వం పట్టుదలతో ఏర్పాట్లు చేయించి, సాధారణ ప్రజల వరకు పుష్కర ప్రాధాన్యతను తీసుకెళ్లింది. దీంతో గ్రామీణ స్థాయిలో ప్రజలంతా పుష్కరం వైపు మళ్లారు. దశాబ్దకాలం అనంతరం వచ్చే వేడుకలో మనం పునీతులం అవుదామన్న సంకల్పం రావడంతోనే నేడు లక్షలాదిగా భారీ జనసందోహం ఘాట్లకు తరలి వచ్చింది. ఇలా 11 రోజుల పాటు ఘాట్లకు వచ్చిన భక్తుల సంఖ్య చూస్తే మాత్రం కళ్లు తిరిగి పోతాయి. ఏకంగా కోటి 70 లక్షల మంది భక్తులు జిల్లాలోని పుష్కర వేడుకల్లో పాల్గొనడం విశేషం.

నూతనోత్సహంలో మంత్రులు
పుష్కర వేడుకల్లో మంత్రులు జూపల్లి కృష్ణారా వు, లకా్ష్మరెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిలు నూతనోత్సాహాన్ని కనబరిచారు. గోదావరి పుష్కరాలు పూర్తి అయినప్ప టి నుంచి పాలమూరు జిల్లాలో కొత్త ఒరవడిని సృ ష్టించాలని ముందు నుంచే ప్రణాళికలు రచించారు. అనుకున్నట్లుగా 52 ఘాట్లను ఏర్పాటు చేసి వాటిలో భక్తులు ఎక్కువగా వచ్చే ప్రాంతాలను గుర్తించి వాటికి తగిన ఏర్పాట్లు చేయడంలో సఫలీకృతులయ్యారు. జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాలరాజ్, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, ఎంఎల్‌సీ కసిరెడ్డి నారాయణరెడ్డిలతో కలిసి సమన్వయం చేసుకుంటూ ముందు కు వెళ్లారు. భక్తులకు అసౌకర్యాలు కలగనీయకుండా మంత్రులు ప్రత్యే క చొరవ తీసుకొని లక్షలాది మంది నీరాజనాలను అందుకున్నారు.

విజయదరహాసంలో కలెక్టర్, ఎస్పీ
జిల్లాలో జరుగుతున్న పుష్కర వేడుకలు 11 రోజుల పాటు ప్రశాంతంగా ముగియడంతో కలెక్టర్ శ్రీదేవి, ఎస్‌పీ రెమారాజేశ్వరిలు విజయదరహాసంతో ఉన్నారు. గడిచిన ఆరు నెలలుగా ఓ ప్రత్యేక ప్రణాళికతో పుష్కరాలకు సమాయత్తమవుతూ వచ్చిన కలెక్టర్ ముందుస్తు వ్యూహం తో విజయవంతంగా నిర్వహణ చేశారు. పగలు…. రాత్రి…అంటూ తేడా లేకుండా పుష్కర పనులను పురమాయించి చిన్న ఘటన లేకుండా వేడుకను ముగించడమంటే అనుకున్నంత ఆశామాసి కాదు. దైర్యేసాహసే లక్ష్మి అన్నట్లు…. సంకల్పంతో ముందుకు వెళితే ఎంతటి గొప్ప కార్యాన్నైనా చేయవచ్చని కలెక్టర్ శ్రీదేవి మరోమారు నిరూపించినట్లు పుష్కర సంబురం కనిపిస్తుంది.

నేడు మరింతగా జనం
చివరి రోజు మంగళవారం జిల్లాలోని పుష్కరఘాట్లన్ని జనంతో కళకళలాడనున్నాయి. ఇప్పటి వరకు జన రద్దీతో సాగిన ఘాట్లు మరింత ఎక్కవ మందితో నిండుకుంటాయని అంచనా ఉంది. అన్ని రోజుల కంటే ఎక్కువగా ప్రధానఘాట్లకు చివరి రోజున జనం తరలి రావచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మంత్రులు, అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Source:http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B0%BE-%E0%B0%A4%E0%B1%80%E0%B0%B0%E0%B0%82-%E0%B0%9C%E0%B0%A8-%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82-20-599526.aspx