కృష్ణా పుష్కరం వైభవం!

-కన్నులపండువగాముగిసిన పుష్కరోత్సవాలు..
-పుణ్యస్నానాలు చేసి తరించిన భక్తులు..
-సీఎం కేసీఆర్‌కు జన నీరాజనం..
-12వ రోజు 18 లక్షల మంది రాక..
-కోటి 85 లక్షల మందికి పైగా పుష్కరస్నానాలు ఆచరించినట్లు అంచనా..
-సమన్వయం చేసిన మంత్రులు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, జడ్పీచైర్మన్, ఎమ్మెల్యేలు..
-కలెక్టర్, ఎస్పీల చొరవతో ప్రశాంతం..
-ఊపిరిపీల్చుకున్న అధికారగణం..
-నదీహారతితో అంగరంగ వైభవంగా ముగింపు ఉత్సవాలు..
తెలంగాణలో తొలిసారి వచ్చిన కృష్ణా పుష్కరాలు జిల్లాలో వైభవంగా ముగిశాయి. తొలిరోజు సీఎం కేసీఆర్ జోగుళాంబ ఘాట్‌వద్ద నదీస్నానమాచరించి పుష్కరాలను ప్రారంభించగా, చివరిరోజు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లకా్ష్మరెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షడు నిరంజన్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ భాస్కర్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజు, చిట్టెం రామ్మెహన్‌రెడ్డి, కలెక్టర్ శ్రీదేవి, ఇతర అధికారులు ఆయా ఘాట్లల్లో నదీహారతి ఇచ్చి ముగింపు వేడుకలు ఘనంగా జరిపారు.

మునుపెన్నడూ కనీవిని ఎరుగని రీతిలో కృష్ణా పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. జిల్లాలోని 52 పుష్కరఘాట్లలో భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా మంత్రులు, అధికారులు చర్యలు తీసుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పక్కా వ్యూహంతో భద్రత పటిష్టం చేసింది. తెలంగాణతో పాటు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేదశ్ రాష్ర్టాల నుంచి తరలివచ్చిన భక్తులు, వీఐపీలు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో శభాష్ అంటూ కితాబు ఇచ్చారు.

విపక్ష నేతలు సైతం పుష్కరాల ఏర్పాట్లు బాగున్నాయని సీఎం కేసీఆర్‌ను, మంత్రుల పనితీరును, ప్రభుత్వ యంత్రాంగాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. కృష్ణవేణి పుష్కరాలతో ఎన్నో పట్టణాలు, పర్యాటక ప్రదేశాలు, ఆలయాలు భక్తులు, సందర్శకుల రాకతో తెలుసుకునే అవకాశం కలిగింది. సాంస్కృతిక కార్యక్రమాలతో పుష్కరాల కార్యక్రమం నేత్రపర్వంగా ముగిసింది.

కృష్ణా పుష్కరాలు విజయవంతమయ్యాయి. చివరి రోజైన మంగళవారం నదీ తీరం వెంట ఉన్న ఘాట్ల వద్ద భక్తుల సందడి నెలకొన్నది. పుష్కర స్నానం ఆచరించారు. నదికి హారతి ఇచ్చి పూజలు చేశారు. భక్తులు ఆ సమీపంలోనే ఉన్న పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ పుణ్యస్నానం చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు.

Source:http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B0%BE-%E0%B0%AA%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B0%82-%E0%B0%B5%E0%B1%88%E0%B0%AD%E0%B0%B5%E0%B0%82-20-599863.aspx