కృష్ణా పుష్కరాలకు సర్వం సిద్ధం

Indrakaranreddy1తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత తొలిసారిగా జరుగనున్న కృష్ణా పుష్కరాలను పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ నెల 12 నుంచి 25 వరకు జరిగే పుష్కరాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 81 పుష్కరఘాట్లను ఏర్పాటు చేసింది. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిల, పెబ్బేరు మండలం రంగాపురం పుష్కరఘాట్లను పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీ లకా్ష్మరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కృష్ణా పుష్కరాల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. నల్లగొండ జిల్లాలో 29, మహబూబ్‌నగర్ జిల్లాలో 52 పుష్కరఘాట్లు ఏర్పాటు చేశా మన్నారు. శాంతిభద్రతల నిర్వహణకు 14వేల మంది పోలీసులను నియమించినట్టు చెప్పారు. బుధవారం సాయం త్రం నాటికి అన్ని పుష్కరఘాట్లలో పనులు పూర్తి అవుతాయన్నారు. కృష్ణా పుష్కరాలకు 3 కోట్ల మంది భక్తులు పుష్కరస్నానం ఆచరిస్తారని భావిస్తున్నామని తెలిపారు.
ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు వస్తున్నందున మరో మూడు రోజుల్లో శ్రీశైలం నుంచి 30టీఎంసీల నీరు వచ్చి చేరే అవకాశం ఉన్నదని.. అవి చేరితే నాగార్జున సాగర్ నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కృష్ణా పుష్కరాల నిర్వహణకు అవసరమైన అన్నిఏర్పాట్లు చేసినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సమైక్యరాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లాలో కేవలం 17 పుష్కరఘాట్లు మాత్రమే ఏర్పాటు చేయగా, తెలంగాణ రాష్ట్రంలో 52 పుష్కరఘాట్లను ఏర్పాటు చేశామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ లకా్ష్మరెడ్డి మాట్లాడుతూ పుష్కర స్నానాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అంటువ్యాధులు సోకకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. సోమశిల వద్ద మంత్రులు బోట్‌లో ప్రయాణించారు. కార్యక్రమాల్లో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, జిల్లా కలెక్టర్ శ్రీదేవి, జిల్లా పరిషత్ చైర్మన్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Source:http://www.namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/prepare-everything-for-krishna-pushkaras-1-2-519647.html