కృష్ణ తీర్థం

అశేషంగా భక్తులు.. విశేషంగా పూజలు.. పిండ ప్రదానాలు, పుష్కర పుణ్య స్నానాలు.. వెరసి కృష్ణమ్మ ఒడిలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. నదీ తీరంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రధాన ఘాట్లకు ఉదయం నుంచే భక్తుల రద్దీ పారంభం కాగా.. నాగార్జునసాగర్, వాడపల్లి, మట్టపల్లి, మహంకాళిగూడెం భక్తజనంతో కిక్కిరిసిపోతున్నాయి. ఆరో రోజు జిల్లా అంతటా సుమారు .5లక్షల మంది పుష్కర స్నానాలు చేయగా.. అత్యధికంగా వాడపల్లిలో 90వేల మంది పాల్గొన్నారు. గవర్నర్ నరసింహన్ ఈ నెల 19నే మట్టపల్లిలో పుష్కరస్నానం చేయనున్నారు.

పుష్కర వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఈనెల 20న జిల్లాకు వస్తారని అనుకోగా.. ఆయన యాత్ర ఒకరోజు ముందుకు మారింది. మట్టపల్లిలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద ఉన్న పుష్కర ఘాట్‌లో ఈ నెల 19న గవర్నర్ కుటుంబ సభ్యులతో కలిసి పుష్కర స్నానం చేయనున్నారు. ఈ రోజు రాత్రికే గవర్నర్ నరసింహన్ మట్టపల్లికి చేరుకుని.. రేపు తెల్లవారుజామున పుష్కర స్నానం ఆచరించే అవకాశం ఉంది.

ఆరో రోజూ పుష్కర ఘాట్లకు భక్త జనులు క్యూ కట్టారు. పవిత్ర కృష్ణా నదిలో స్నానాల కోసం బారులు తీరారు. ఉదయం నుంచే భక్తుల రాక ప్రారంభం కాగా.. మధ్యాహ్నం తర్వాత ఆ సంఖ్య భారీగా పెరిగింది. సాయంత్రం నాలుగు గంటల వరకూ జిల్లాలోని ప్రధాన పుష్కర ఘాట్లు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. ఆ తర్వాత క్రమంగా భక్తుల రాక తగ్గు ముఖం పట్టింది. అశేషంగా తరలి వచ్చిన భక్త జనులతో ఘాట్లన్నీ పుష్కర స్నానాలు, పిండ ప్రదానాలతో దర్శనమిచ్చాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఘాట్లలో కలుపుకొని ఆరోరోజు సుమారు 2.5లక్షల మంది భక్తులు పుణ్యస్నానం చేశారు.

ప్రధాన ఘాట్లకు కొనసాగిన భక్తుల రద్దీ…
బుధవారం దామరచర్ల మండలం వాడపల్లి వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది. ఇక్కడి శివాలయం ఘాట్‌లో ఎక్కువ మంది భక్తులు పుష్కర స్నానాలు చేయగా.. దామరచర్ల మండలంలోని 11ఘాట్లలో మొత్తం 90వేల మంది భక్తులు పుష్కర వేడుకల్లో పాల్గొన్నారు. నాగార్జునసాగర్‌లోనూ శివాలయం ఘాట్‌లోనే ఎక్కువ మంది భక్తులు పుష్కర వేడుకలకు హాజరు కాగా.. మొత్తం పెద్దవూర మండలంలోని నాలుగు ఘాట్లలో కలుపుకుని సుమారు 80వేల మంది భక్తులు స్నానాలు చేశారు. మట్టపల్లిలోని ఘాట్లలో 40వేల మంది, నేరేడుచర్ల మండలం మహంకాళిగూడెంలో 13వేల మంది భక్తులు పాల్గొన్నారు.

మేళ్లచెర్వు మండలంలోని వజినేపల్లి, కిష్టాపురం, బుగ్గమాదారం ఘాట్లలో 6వేల మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారు. చందంపేట మండలం కాచరాజుపల్లిలో భక్తులను నదీ జలాల చెంతకు అనుమతించడంతో భక్తుల సంఖ్య కొంత పెరిగింది. ఇక్కడ బుధవారం సుమారు 2వేల మంది పుష్కర స్నానాలు చేశారు. పెద్దమునిగల్‌తోపాటు అజ్మాపురం, పానగల్, దర్వేశిపురం ఘాట్లు కూడా భక్తుల పుణ్య స్నానాలతో పరవశించాయి.

ప్రముఖుల పుణ్య స్నానాలు…
జిల్లా వ్యాప్తంగా ఉన్న ఘాట్లలో బుధవారం పలువురు ప్రముఖులు పుష్కర స్నానాలు, పిండ ప్రదానాలు చేశారు. లోకాయుక్త ఆనందరెడ్డి కుటుంబ సమేతంగా వాడపల్లి శివాలయం ఘాట్‌లో పెద్దలకు శ్రాద్ధకర్మలు నిర్వహించిన అనంతరం నదిలో పుష్కర స్నానం చేశారు. మెట్రో ఇండియా పత్రిక చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సీఎల్ రాజం కుటుంబ సమేతంగా మట్టపల్లిలోని వీఐపీ ఘాట్‌లో పుష్కర స్నానం చేసి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. సినీ నటుడు వేణు మాధవ్ కూడా మట్టపల్లి వీఐపీ ఘాట్‌లో పుష్కర స్నానం చేశారు. మల్కాజ్‌గిరి ఎంపీ నల్ల మల్లారెడ్డి నాగార్జున సాగర్‌లోని శివాలయం ఘాట్‌లో నదీ జలాలకు పూజలు చేసి పుష్కర స్నానం ఆచరించారు.

తన విద్యా సంస్థల్లో చదువుతున్న 1200మంది విద్యార్థులతో కలిసి వచ్చి మల్లారెడ్డి సాగర్‌లో పుష్కర స్నానం చేశారు. కాచరాజుపల్లిలో భక్తులను నదీ జలాల చెంతకు అనుమతించిన చోట జిల్లా పరిషత్ చైర్మన్ బాలూ నాయక్, దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్ కుమార్‌లు వేర్వేరుగా పుష్కర స్నానం చేశారు. దామరచర్ల మండలం అడవిదేవులపల్లిలో ఎమ్మెల్సీ పూల రవీందర్ కుటుంబ సమేతంగా పుష్కరస్నానం చేసిన తర్వాత శివపంచాయతనంలో దైవ దర్శనం చేసుకున్నారు. ఇంకా పలువురు ప్రముఖులు వివిధ ఘాట్లలో పుష్కర స్నానాలు ఆచరించారు.

వాడపల్లిలో అంగరంగ వైభవంగా నదీ హారతి…
పుష్కరాల్లో 12రోజుల పాటు ప్రతీ రోజు కృష్ణా నదికి సమర్పించే హారతి కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా కన్నుల పండువగా కొనసాగుతోంది. ముఖ్యంగా వాడపల్లిలో రెండు రోజులుగా ఈ కార్యక్రమం అత్యంత రమణీయంగా నిర్వహిస్తున్నారు. పూలతో అలంకరించిన తోరణాల కిందుగా భక్త జన సందోహం మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించిన బుధవారం నాటి హారతి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మట్టపల్లి, నాగార్జునసాగర్, మహంకాళిగూడెంలోనూ నదికి హారతి వైభవోపేతంగా నిర్వహించారు. సాయంత్రం వేళ సాగర్, వాడపల్లి, మట్టపల్లి ఘాట్ల వద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తలోకాన్ని అలరించాయి.
-ఆరో రోజూ పుష్కర ఘాట్లకు భారీగా భక్తజనులు
-కృష్ణా తీరంలో వెల్లివిరుస్తున్న ఆధ్యాత్మికత
-జిల్లా అంతటా 2.5లక్షల మంది హాజరు
-మట్టపల్లికి గవర్నర్ నరసింహన్ రాక రేపే…

Source:http://www.namasthetelangaana.com/Districts/Nalgonda/%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3-%E0%B0%A4%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5%E0%B0%82-22-598347.aspx