చరిత్రలో నిలిచేలా..

-కృష్ణా పుష్కరాలు విజయవంతంగా నిర్వహించుకున్నాం
-నిర్వహణలో ప్రతీ అధికారి, సిబ్బంది కృషి అత్యద్భుతం
-పరిశుభ్ర వాతావరణం.. ట్రాఫిక్ నియంత్రణ అమోఘం
-సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు : మంత్రి జగదీష్‌రెడ్డి
చరిత్రలో నిలిచిపోయే విధంగా కృష్ణా పుష్కరాలను జిల్లా యంత్రాంగం, ప్రజానీకం అత్యద్భుతంగా నిర్వహించారని.. ఇందుకోసం పని చేసిన ప్రతీ ఒక్కరి కృషి అమోఘమని జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ప్రశంసించారు. తెలంగాణలో తొలి కృష్ణా పుష్కరాలను పక్కా ప్రణాళికలతో ఘనంగా నిర్వహించిన యంత్రాంగాన్ని ఆయ న అభినందించారు. ముఖ్యంగా పారిశుధ్యం, ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఆయా విభాగాలు బాగా పని చేశాయని.. విద్యుత్, ఆర్టీసీ సిబ్బంది గణ నీయమైన సేవలు అందించారని పేర్కొన్నా రు.

పుష్కర పండుగ నిర్వహణలో సహకరించిన జిల్లా వాసులకూ కృతజ్ఞతలు చెప్పిన మంత్రి.. అంత్యపుష్కరాలు ముగిసే వరకు ఏడాదిపాటు వచ్చే భక్తులను సైతం సాదరంగా స్వాగతించాలని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో మొదటి కృష్ణా పుష్కరాల పన్నెండు రోజుల తొలి అంకం విజయవంతంగా ముగిసిందని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కు లాల అభివృద్ది శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. వీటిని విజయవంతం చేసిన ఉద్యోగులు, సిబ్బంది, సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. గోదావరి నదీ జలాల ఒప్పం దం విషయమై సీఎం కేసీఆర్‌తోపాటు ముంబై వెళ్లిన మంత్రి.. పుష్కరాల్లో 12రోజుల ముగింపు సందర్భంగా ప్రకటన విడుదల చేశారు.

కనీవిని ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్కరాల నిర్వహణ కోసం జిల్లాలో సుమారు రూ.500 కోట్ల వ్యయంతో ఏర్పాట్లు చేశామన్నారు. నిధుల విషయంలో కేసీఆర్ చలువతో పాటు.. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్పీ ప్రకాష్‌రెడ్డి అద్భుతంగా పర్యవేక్షించారని కితాబిచ్చారు. 12రోజుల కార్యక్రమంలో 72లక్షల మంది భక్తులు హాజరైనా.. విజయవంతంగా ముగించడంలో జిల్లా అధికారుల పాత్ర కీలకమైందని అభినందించారు.

పారిశుధ్యం పనులు అత్యద్భుతం
– మంత్రి జగదీష్‌రెడ్డి
పుష్కర జాతరలో లక్షల మంది వచ్చినా పారిశుధ్య పనుల పర్యవేక్షణలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చిన అధికార యంత్రాంగం పని తీరును మంత్రి జగదీష్‌రెడ్డి ప్రత్యేకంగా ప్రశంసించారు. తనకున్న గత అనుభవంతో పారిశుధ్య పనులను ప్రత్యేకంగా పర్యవేక్షించిన జేసీ సత్యనారాయణను అభినందించారు. సకాలంలో ఘాట్ల నిర్మాణం చేసిన ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ అధికారులతో పాటు ఏజేసీ వెకంట్‌రావు, డీఆర్‌డీఏ పీడీ అంజయ్య, జడ్పీ సీఈఓ మహేందర్‌రెడ్డి, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డితో పాటు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సేవలే కాకుండా.. స్వచ్ఛందంగా పుష్కర సేవలో పా ల్గొన్న సత్యసాయి సేవా సమితి, ఎన్‌ఎస్‌ఎస్, కల్కి సేవా సమితి, తెలంగాణ జాగృతి సంస్థల సేవలు వెలకట్టలేనివని మంత్రి కొనియాడారు.

పోలీసుల పాత్ర అమోఘం : మంత్రి
ట్రాఫిక్ నియంత్రణలో ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో కంట్రోల్ చేసిన పోలీస్ శాఖను ఆయన అభినందించారు. జిల్లా ఎస్పీ ప్రకాష్‌రెడ్డి తనదైన పక్కా ప్రణాళికతో పోలీసు బృందాన్ని విజయవంతంగా ముందుకు నడిపించారని తెలిపారు. దేవాదాయ శాఖ అధికారులు చేసిన ఏర్పాట్లు మట్టపల్లి, వాడపల్లి లాంటి పుణ్యక్షేత్రాల్లో పుష్కర భక్తులకు అన్నదానం చేసిన ఆయా సత్రాల నిర్వాహకుల సేవలు పుష్కరాల చరిత్రలో నిలిచి పోతాయన్నారు. వీటన్నింటికి మించి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా పాజిటివ్ కోణంలో ఎప్పటికప్పుడు వార్తలు అందించి చక్కని తోడ్పాటునిచ్చిన మీడియా ప్రతినిధులకు, సంస్థలకు మంత్రి జగదీష్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

విద్యుత్ ప్రసారంలో అంతరాయం లేకుండా శ్రమించిన విద్యుత్ శాఖ సిబ్బంది, ప్రయాణీకులను చేరవేసిన ఆర్టీసీ యంత్రాంగం పని తీరు ఈ పుష్కరాల్లో ముఖ్య భూమిక పోషించాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లకు తోడు విజయవంతం చేయడంలో చక్కటి సహకారం, సూచనలు సలహాలు అందించిన ప్రతీ ఒక్కరిని మంత్రి అభినందించారు. ప్రభుత్వానికి సహకారమందిం చి పుష్కరాల విజయవంతంలో కీలక పాత్ర పో షించిన భక్తులకు ధన్యవాదాలు తెలిపారు.

Source:http://www.namasthetelangaana.com/Districts/Nalgonda/%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BF%E0%B0%9A%E0%B1%87%E0%B0%B2%E0%B0%BE-22-599855.aspx