పన్నెండేండ్ల…సంబుర!

-స్వరాష్ట్రంలో కృష్ణమ్మకు తొలి పండుగ..
-పుష్కరుడి రాక కోసం భక్తుల నిరీక్షణ..
-తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తుల రాక ..
-3 కోట్ల మంది భక్తులు రానున్నట్లు అంచనా..
-జిల్లాలో 52 ఘాట్లు.. 10 ప్రధాన ఘాట్లు..
-గొందిమళ్ల ఘాట్ వద్ద సీఎం పుష్కర స్నానం..
-జోగుళాంబ పూజతో పుష్కరాలు ప్రారంభం..
-వరదనీటితో గల గల.. ఫ్లడ్ లైట్లతో కళకళ..
-తళుక్కుమంటున్న ఆలయాలు, ఘాట్లు..
-రేపటి నుంచి కృష్ణా పుష్కరాలు..
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ: పన్నెండేండ్ల సంబురానికి కృష్ణవేణి బిరబిరా తరలివస్తున్నది. తెలంగాణలో కృష్ణమ్మకు తొలి పుష్కరం సందర్భంగా అత్యంత వైభవంగా, మునుపెన్నడూ కనీవిని ఎరుగని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రూ.825కోట్లతో నూతన ఘాట్ల నిర్మాణం, ఆధునీకరణ పనులు శరవేగంగా పూర్తి చేశారు. జిల్లాలోని 52ఘాట్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అన్ని ఘాట్ల వద్ద భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల నుంచి దాదాపు మూడు కోట్ల మంది రానున్నట్లు అధికారులు అంచనా వేశారు.

గురువారం సాయంత్రమే జిల్లాకు సీఎం కేసీఆర్ చేరుకుని అలంపూర్‌లో బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం జోగుళాంబ ఘాట్‌వద్ద పుష్కరస్నానం చేసి పుష్కరోత్సవాలను ప్రారంభిస్తారు. అనంతరం ఐదో శక్తిపీఠం జోగుళాంబను దర్శించుకోనుండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక వలంటీర్లతో సేవలందించేలా చర్యలు తీసుకుంటున్నారు.

కృష్ణానది పుష్కరాలకు ముహూర్తం సమీపిస్తోంది. పుష్కరుడి రాకకోసం కృష్ణమ్మ, అ మ్మఒడిలో మునకవేసి పునీతమయ్యేందుకు భక్తులు నిరీక్షిస్తున్నారు. నాగరికత మొదలైనప్పటినుంచే సమస్త జీవకోటి గొంతుతడిపేందుకు, అన్నదాతల సేద్యానికి సాగునీరిచ్చి, బుద్ధిజీవులు కడుపునిండా బువ్వతినేందుకు ఆధారభూతమైంది కృష్ణమ్మ. పుష్కర జలాల్లో సంచరించే ముక్కోటి దేవతలను పూజించాలని, వంశాభివృద్ధికి, అందరి ఆయురారోగ్యానికి దీవెనలిచ్చే పితృదేవతలకు తర్పణాలు, పిండాలతో సంతుష్టులను చేయాలని భక్తులు పుష్కర ముహూ ర్తం కోసం ఎదురు చూస్తున్నారు.

12 ఏళ్లకోసారి వచ్చే ఈ మహాభాగ్యాన్ని ఆస్వాదించాలని భక్తు లు పరితపిస్తున్నారు. శుక్రవారం తెలవారు జామునుంచి ప్రా రంభమయ్యే పుష్కరాలకు వచ్చే భక్తజనానికి అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏ ర్పాట్లు చేసింది. పుష్కరాలకు మన రాష్ర్టానికి చెందినవారితోపా టు పొరుగునగల మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన దాదాపు 3కోట్లమంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 44వ నెంబరు జాతీ య రహదారితోపాటు అంతరాష్ట్ర రహదారులు, దక్షిమధ్య రైలుమా ర్గం ఉండటంతో పాలమూరుజిల్లాలోని ఘాట్లకు భక్తులు పోటెత్తే అవకాశం ఉంది.

పుష్కరాలకు సర్వం సిద్ధం..
జిల్లాలోని 11మండలాల పరిధిలో కృష్ణాపరివాహక ప్రదేశానికి ఇరువైపులా మొత్తం 52 ఘాట్లు నిర్మించారు. వాటిలో 25 లోకల్‌ఘాట్లు కాగా, మరో 17 ఘాట్లను మైనర్ ఘాట్లుగా గుర్తించారు. ఈ మొత్తంలో 10 పుష్కరఘాట్లను ప్రధాన ఘా ట్లుగా అధికారులు గుర్తించారు. జిల్లాలోని మాగనూరు, మక్తల్, ధరూర్, ఆత్మకూరు, గద్వాల, ఇటిక్యాల, అలంపూర్, పెబ్బేరు, వీపనగండ్ల, కొల్లాపూర్, అచ్చంపేట్, అమ్రాబాద్ మండలాల పరిధిలో పుష్కర సంబురాలు వైభవంగా భక్రిశ్రద్ధలతో జరగనున్నాయి. ప్రధాన ఘాట్లుగా గుర్తించిన వాటిలో ఇటిక్యాల మం డలం బీచ్‌పల్లి, పెబ్బేరు మండలం రంగాపురం, కొల్లాపూర్ మండలం సోమశిల, సోమశిల వీఐపీ ఘాట్, మాగనూరు మం డలం క్రిష్ణ, మక్తల్ మండలం పస్పుల, ఆత్మకూరు మండలం నందిమళ్ల, అమ్రాబాద్ మండలం పాతాళగంగ, ధరూర్ మం డలం పెద్ద చింతరేవుల, గద్వాల మండలం నదీఅగ్రహారం పుష్కర ఘాట్లు ఉన్నాయి. వీటితోపాటు అలంపూర్ మండలం గొందిమళ్లలో సీఎం కేసీఆర్ పుష్కర సంబురాలను ప్రారంభం చేసేందుకు వస్తున్నందున గొందిమళ్ల ఘాట్‌ను ప్రత్యేక ఘాట్‌గా గుర్తించి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

లక్షలాదిగా తరలివ చ్చే భక్తజన సందోహానికి ఉచిత సేవలు అందించేందుకు కోసం ప్రభుత్వ యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. ప్రధాన ఘాట్లకు భారీగా వచ్చే భక్తులను కంట్రోలింగ్ చేస్తూనే వారికి అవసరమైన సేవలు అందించేందుకు సెట్మా ఆధ్వర్యంలో ఉచిత సేవల ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు తగిన సహాయ సహకారాలు అందించేందుకు 14 వేల మంది వలంటీర్స్ కార్యచరణకు సిద్ధమయ్యారు. జిల్లా ఉన్నతాధికారులతోపాటు రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్, రవాణా, పంచాయత్‌రాజ్, ఫిషరీస్, అగ్నిమాపక, విద్యుత్, వైద్య, సమాచార, సాంస్కృతికశాఖ తదితర అన్ని శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ విద్యార్థులతోపాటు వివిధ సంఘాలు, సంస్థలకు చెందిన 14వేల మంది వలంటీర్లు త మ సేవలను అందించడానికి సిద్ధమయ్యారు.

70 యూనిట్ల ఎన్‌ఎస్‌ఎస్‌కు చెందిన 5వేల మంది వలంటీర్లు, ఎన్‌సీసీ ద్వా రా మరో వెయ్యి మంది విద్యార్థులు భక్తుల సేవల్లో పాల్గొంటున్నారు. యూత్ ఆర్గజైజేషన్ ద్వా రా మరో 2 వేలు, ఎన్‌జీవోస్ ద్వారా వెయ్యి మంది, విశ్వహిందూ పరిషత్ ద్వారా 1300 మంది సేవలు చేసేందుకు సిద్ధంగా ఉ న్నారు. రెడ్‌క్రాస్ సంస్థ ద్వారా 450 మంది, విద్యాశాఖకు చెం దిన 200 మంది పీఈటీలు, పీడీలతో వలంటీర్ల ద్వారా సేవలను అందించే బాధ్యతలను నిర్వహించనున్నారు. సత్యసాయి సేవాసంస్థ ద్వారా 2వేలమంది, వాసవీ సేవా సంస్థ ద్వారా మ రో వెయ్యి మంది వలంటరీగా పుష్కరసేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భక్తు ల రాకపోకలకు వీలుగా జిల్లా లో ఉన్న బస్సులకు అదనంగా 900 బస్సులు, 8 ప్ర త్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నారు. 10ఘాట్లలో కంట్రోల్ రూంలు, మీడియా కేంద్రా లు ఏర్పా టు చేశారు.

గొందిమళ్ల ఘాట్ వద్ద సీఎం కేసీఆర్ పుష్కర స్నానం
కృష్ణా పుష్కరాల్లో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈనెల 11న అలంపూర్‌లోని జోగుళాంబ సన్నిధిలోనే బసచేస్తారని , 12న తెలవారుజామున జోగుళాంబ సన్నిధిలో పూజలు నిర్వహిస్తారని సమాచారం. ఈమేరకు సీఎం షెడ్యూల్ ఖరారు కావలసి ఉంది. ఈనెల 12న జోగుళాంబ క్షేత్రానికి 10 కిలోమీటర్ల చేరువలో ఉన్న గొందిమళ్ల పుష్కరఘాట్‌వద్ద ముఖ్యమంత్రి పుష్కర స్నానం ఆచరించి ప్రత్యేక పూజలతో పుష్కరాలను ప్రారంభిస్తారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా జోగుళాంబ క్షేత్రానికి వచ్చి పుష్కరాలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రికి పాలమూరు జిల్లావాసులు ఘనస్వాగతం పలుకనున్నారు.

ప్రధాన ఘాట్లలో స్వచ్ఛంద సేవకులు..
ప్రధానఘాట్లలోనే ఎక్కువ మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున అయా ప్రాంతాల్లోనే వలంటీర్స్ ద్వారా సేవలు అం దించబోతున్నారు. ప్రధానంగా బీచ్‌పల్లి, రంగాపూర్, సోమశిల, కృష్ణ, పస్పుల, నందిమళ్లడ్యాం, నదీఅగ్రహారం, పెద్దచింతరేవు ల, పాతాళగంగ పుష్కరఘాట్లలో ఎక్కువ మంది భక్తులు పా ల్గొంటారని భావిస్తున్న క్రమంలో వలంటీర్లను ఎక్కువగా ఈ కేంద్రాల్లోనే ఏర్పాటు చేయబోతున్నారు. ఒక్కొక్క ప్రధాన కేం ద్రాల్లో దాదాపు వెయ్యి మంది వలంటీర్లు ఉండి సేవలు అం దించేలా కార్యాచరణ తీసుకుంటున్నారు. మిగిలిన ఘాట్లలోను వలంటీర్స్ సేవల అవసరాన్ని బట్టి సమారు 50 మందితో కూడిన బృందాలను ఆయా ఘాట్లలో భక్తుల సేవలకు సిద్ధమయ్యారు.
Source:http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%AA%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B1%87%E0%B0%82%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%B8%E0%B0%82%E0%B0%AC%E0%B1%81%E0%B0%B0-20-596530.aspx