పుకార్లను నమ్మి పరుగులు తీయొద్దు : ఎస్పీ(నల్గొండ జిల్లా)

భక్తులు పుకార్లను నమ్మి ఘాట్ల వద్ద పరుగులు తీయవద్దని, ఎలాం టి పుకార్లు వచ్చినా ఘాట్ సమీపంలో ఉన్న పోలీస్ కంట్రోల్‌రూమ్‌కు తెలియజేయాలని జిల్లా ఎస్పీ ప్రకాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలోని పుష్కరఘాట్లతో పాటు పానగల్ ఘాట్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తొలిసారిగా కృష్ణాపుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. కృష్ణా పుష్కరాల నిర్వహణకు జిల్లాను 7 సెక్టార్లుగా విభజించి 6,754 మంది పోలీస్ సిబ్బంది, 2088 మంది స్వచ్ఛంద కార్యకర్తలతో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించామన్నారు. మొదటి రోజు పుష్కర స్నానాలకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు నిర్వహించినట్లు వెల్లడించారు. శనివారం నుంచి పుష్కరాలకు వచ్చే భక్తుల సంఖ్య లక్షలకు పైగా పెరుగుతుందని భావిస్తున్నామని, అయినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

జిల్లాలో ఉన్న 28ఘాట్లలో సుమారు 79 వేల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారన్నారు. జిల్లాలో 9 ట్రాఫిక్ రీడింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి జిల్లాలోకి వచ్చి పోయే వాహనాలు లెక్కిస్తు ముందస్తుగా ట్రాఫిక్ అంచనాలు వేస్తున్నామన్నారు. జిల్లాలో ఉన్న 33 పార్కింగ్ పాయింట్లలో శుక్రవారం 1800 బైక్‌లు, 450 మూడు చక్రాల వాహనాలు, 1500 నాలుగు చక్రాల వాహనాలు , 190 బస్‌లు, 25 లారీలు, 23 హోర్డింగ్ పాయింట్ల నందు 300 భారీ వాహనాలను నిలిపివేయడం జరిగిందన్నారు. హైదారాబాద్ నుంచి నాగార్జునసాగర్ మీదుగా మాచర్ల వెళ్లే వాహనాలు, గూడ్స్ వాహనాలను హోర్డింగ్ ప్రాంతాలలో నిలిపివేయడం జరుగుతుందన్నారు. వాహన డ్రైవర్లు, రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు జిల్లా సరిహద్దు దాటిపోవాలని, ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించాలన్నారు.

Source:
http://www.namasthetelangaana.com/Districts/Nalgonda/%E0%B0%AA%E0%B1%81%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%A8%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BF-%E0%B0%AA%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%A4%E0%B1%80%E0%B0%AF%E0%B1%8A%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B1%81-%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AA%E0%B1%80-22-597178.aspx