పుణ్యస్నానం.. పునీతం

krishna
పుష్కరాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలో 14 లక్షలు, నల్లగొండ జిల్లాలో ఆరు లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పుష్కరాలు పూర్తయ్యేందుకు మరో నాలుగు రోజులే గడువు ఉండటంతో శనివారం నుంచి వరుసగా నాలుగురోజులపాటు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నది. మహబూబ్‌నగర్ జిల్లాలోని రంగాపూర్, బీచుపల్లి, సోమశిల, జోగుళాంబ, నదీఅగ్రహారం, పస్పుల, కృష్ణా(మాగనూరు), నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్, వాడపల్లి, మట్టపల్లి ఘాట్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని జోగుళాంబ పుష్కరఘాట్‌లో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్, సీఎంవో కార్యదర్శి నర్సింగరావు పుష్కరస్నానమాచరించి జోగుళాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. రంగాపూర్‌ఘాట్‌లో టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కే కేశవరావు, కొల్లాపూర్ పుష్కరఘాట్‌లో జేఏసీ చైర్మన్ కోదండరాం, బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి పుణ్యస్నానమాచరించారు. కలెక్టర్ శ్రీదేవి, డీఐజీ అకున్ సబర్వాల్ పుష్కర ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Source:
http://www.namasthetelangaana.com/LatestNews-in-Telugu/huge-devotees-to-krishna-pushkaralu-1-1-501963.html