పుష్కరాలకు 5 నిమిషాలకో బస్సు, గంటకో రైలు

BUDTRAINPUSHKARAకృష్ణా పుష్కరాల కోసం నగరం నుంచి వెళ్లేందుకు ఇటు ఆర్టీసీ అటు దక్షిణమధ్య రైల్వే.. సాధారణ సర్వీసులతోపాటు ప్రత్యేక బస్సులు, రైళ్లను నడిపిస్తున్నాయి. మొత్తం 665 బస్సు సర్వీసులను పుష్కరాల కోసం నడుపుతున్నప్పటికీ తెలంగాణ నుంచే 422 సర్వీసులను ఆపరేట్ చేస్తోంది. కృష్ణానది పరివాహక ప్రాంతం మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఉండడంతో అక్కడి వరకు ప్రయాణికులను చేరవేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. గోదావరి పుష్కరాల్లో విజయవంతంగా సేవలు అందించిన టీఎస్‌ఆర్టీసీ అదే ఉత్సాహంతో సేవలందించేందుకు సిద్ధమైంది. కేవలం టీఎస్‌ఆర్టీసీ బస్సులను మాత్రమే పుష్కర ఘాట్ల వద్దకు వెళ్లేలా అనుమతులు తీసుకున్నారు. అలాగే, హైదరాబాద్, కాచిగూడ, సికింద్రాబాద్ నుంచి 52 రైళ్లు 422 సర్వీసులుగా నడుస్తాయి. నగరం నుంచి గంటకో రైలు, ఐదు నిమిషాలకో బస్సు అందుబాటులో ఉంటాయి.

12 నుంచి 20వ తేదీ వరకు రైళ్ల సమయాలు
సికింద్రాబాద్-గద్వాల ఉ. 11.45, మ. 3.30, గద్వాల-సికింద్రాబాద్ సా. 4.30, రాత్రి 9.00, బొల్లారం-గద్వాల ఉ.7 గంటలకు, మ. 1.00, గద్వాల-బొల్లారం 2.30, రాత్రి 7.45, గద్వాల-కర్నూలు మ. 3.00, రాత్రి 4.45, కర్నూలు-గద్వాల మ. 12.45, మ. 1.50.

కోరితే.. యాత్రికుల ఇంటి వద్ద నుంచే ప్రయాణం
యాత్రికుల ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సులు రానున్నాయి. 30 నుంచి 40 మంది రిజర్వేషన్ చేసుకుంటే ప్రయాణికులు కోరిన ప్రదేశం నుంచే బస్సులు ఎక్కించుకుంటారు. నేరుగా పుష్కర ఘాట్ల వద్ద దించుతారు. మళ్లీ పుష్కర ఘాట్ల వద్ద ఎక్కించుకుని ఇంటి వద్ద దించే సౌకర్యాన్ని టీఎస్‌ఆర్టీసీ కల్పిస్తోంది. అంతేగాకుండా ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్, కేపీహెచ్‌బీ, ఎస్‌ఆర్‌నగర్, కూకట్‌పల్లి, టెలిఫోన్ భవన్, ఉప్పల్ క్రాస్‌రోడ్స్, ఐఎస్ సదన్, ఈసీఐఎల్, లింగంపల్లి, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి బస్సులు నడిపిస్తోంది. నాగార్జునసాగర్, బీచుపల్లి, శ్రీశైలం, సోమశిల, మట్టపల్లి, వాడపల్లి విజయవాడకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఈ బస్సులను 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నడపనున్నారు. పుష్కరాల కోసం 1365 బస్సులను సిద్ధం చేశారు.

Source:
http://www.namasthetelangaana.com/LatestNews-in-Telugu/pushkaralu-5-minute-bus-every-one-hour-train-1-1-500918.html