పుష్కరాలతో ప్రజలకు మరింత చేరువ

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కృష్ణా పుష్కరాలు ప్రజలను ప్రభుత్వానికి మరింత దగ్గర చేశాయని హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి పేర్కొన్నారు. 60 ఏళ్ల పాలనలో తెలంగాణ తీవ్ర అణిచివేతకు గురైందని, నూతన రాష్ట్ర ఏర్పాటుతో నేడు దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తున్నదని నాయిని పేర్కొన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్ జోగులాంబ పుష్కరఘాట్‌లో కుటుంబసమేతంగా ఆయన నదీస్నానమాచరించారు. అనంతరం ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్‌లతో కలసి అక్కడే విలేకరులతో మాట్లాడారు. గతంలో కృష్ణా పుష్కరాలకు ఇక్కడ వసతులు లేవన్న కుంటిసాకులతో సమైక్యపాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు.

నేడు జరుగుతున్న పుష్కరాలకు ప్రభుత్వం పెద్దఎత్తున ఏర్పాట్లు చేసిందన్నారు. కనీవిని ఎరుగని రీతిలో తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను చూసిన ఆంధ్రా ప్రజలు మెచ్చుకుంటున్నారన్నారు. లక్షలాది మంది ఆంధ్రాప్రాంతానికి చెందిన ప్రజలు తెలంగాణలో పుణ్యస్నానాలు చేస్తున్నారని నాయిని చెప్పారు. గతంలో కృష్ణా పుష్కరాలకు విజయవాడ, గోదావరికి రాజమండ్రిలను కేంద్రాలుగా చూపి సమైక్య పాలకులు తెలంగాణకు మొండిచెయ్యి చూపారని దుయ్యబట్టారు. పాలమూరు జిల్లాలో పుష్కరఘాట్లలో ఏర్పాట్లు బేషుగ్గా ఉన్నాయని, ఇందుకు జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు నాయిని అభినంధనలు తెలిపారు.

ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారన్నారు. ఇప్పటికే అనేక ఆలయాలకు ప్రాధాన్యతా క్రమంలో మార్పులు చేస్తూ అభివృద్ధికి నాంది పలుకుతున్నారన్నారు. నూతన రాష్ట్రంలో మిషన్‌కాకతీయ, మిషన్ భగీరథలాంటి పథకాలను అమలు చేస్తూ అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రంలో, వచ్చే రెండేళ్లలో రాష్ర్టాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లి దేశంలోనే నెంబర్ వన్ సీఎంగా కేసీఆర్ చరిత్ర సృష్టిస్తారని నాయిని పేర్కొన్నారు. అభివృద్ధిని ఓర్వలేని కాంగ్రెస్, టీడీపీలు కుతంత్రాలతో ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.

ప్రాజెక్టుల నిర్మాణాలపై రాద్దాంతం చేస్తూ రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని నాయిని విమర్శించారు. పోలీస్‌శాఖ పరంగా ప్రజలకు మెరుగైన సేవ అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో దుష్టశక్తులు, దేశద్రోహులు, అరాచకాలు చేసే రౌడీలను తెలంగాణ పోలీసులు సమర్థవంతంగా పనిచేసి కట్టడి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ప్రశాంత వాతావరణాన్ని అందించడం పోలీసులు మరింత సేవాభావంతో విధులు నిర్వహిస్తారని హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి చెప్పారు.

Source:
http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%AA%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%9C%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%A4-%E0%B0%9A%E0%B1%87%E0%B0%B0%E0%B1%81%E0%B0%B5-20-598841.aspx