పుష్కరాలు ప్రతిష్ఠాత్మకం

కృష్ణా పుష్కరాలను తమ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధ్ది శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. స్వరాష్ట్రంలో తొలి కృష్ణాపుష్కరాలకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం రాత్రింబవళ్లు శ్రమించిందన్నారు. నల్లగొండ జిల్లాలో 28 ఘాట్లను పూర్తిస్థాయిలో సిద్ధ్దం చేశామని చెప్పారు. 12 ఏండ్లకోసారి వచ్చే ఈ పవిత్ర అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకోవాలని కోరారు. ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పకడ్బందీగా చేశామని మంత్రి తెలిపారు. శుక్రవారం ఉదయం 5.58గంటలకు మఠంపల్లి మండలంలోని మట్టపల్లిలోని ప్రహ్లాద ఘాట్‌లో ఆయన కుటుంబసమేతంగా పుష్కర స్నానం చేసి కృష్ణా పుష్కరాలను ప్రారంభించారు. మంత్రితోపాటు కలెక్టర్ సత్యనారాయణరెడ్డి దంపతులు, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సహా పలువురు ప్రముఖులు పుణ్య స్నానాలు చేశారు. అనంతరం మంత్రి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. జిల్లాలోని నాగార్జునసాగర్ శివాలయం ఘాట్‌లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ పుష్కర స్నానం ఆచరించారు.

జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలూనాయక్, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, చందంపేట మండలం పెద్దమునిగల్‌లోని పుష్కర ఘాట్‌లో స్నానం చేయగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుటుంబ సమేతంగా పానగల్ ఛాయాసోమేశ్వర ఆలయం వద్ద పుష్కర స్నానం ఆచరించారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు వాడపల్లిలోని శివాలయం ఘాట్‌లో పుష్కర స్నానం చేసి దైవదర్శనం చేసుకున్నారు.

జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 28ఘాట్లలోనూ తొలిరోజు భక్తుల రద్దీ కొనసాగింది. సాగర్ శివాలయం ఘాట్, వాడపల్లి శివాలయం ఘాట్, మహంకాళిగూడెంఘాట్, మట్టపల్లిలోని 3 ఘాట్లలో ఎక్కువ సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు, పిండ ప్రదానాలు చేశారు. మేళ్లచెర్వు మండలంలోని వజినేపల్లి, బుగ్గమాదారం, ఇస్కాపురం, దామరచర్ల మండలంలోని అడవిదేవులపల్లి, ఇర్కిగూడెం, ముదిమాణిక్యం, నల్లగొండ ఛాయాసోమేశ్వర ఆలయం, దేవరకొండ కాచరాజుపల్లి, పెద్దమునిగల్, అజ్మాపురం, పెద్దవూర, ఉట్లపల్లి ఘాట్లకు భక్తులు తరలివచ్చారు.

Source:
http://www.namasthetelangaana.com/LatestNews-in-Telugu/krishna-pushkaralu-ambitious-1-1-501006.html