పుష్కర ఏర్పాట్లు సూపర్

-కేసీఆర్ బాగ చేస్తుండు..
-పుష్కర ఏర్పాట్లపై భక్తుల సంతృప్తి
-ట్రాఫిక్ క్రమబద్దీకరణ భేష్…
-ప్రభుత్వానికి వీఐపీల ప్రశంసలు..
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : హలో..పుష్కరాలకొచ్చినం…నదిలో నీళ్లూ బాగున్నయ్, స్నానాలు చేసినం, ఇగో గిప్పుడే దేవుళ్ల దర్శనం కూడా అయ్యింది.. సత్రంలో భోజనానికి వెళుతున్నం.. బస్సులు గూడ వెంట వెంటనే వస్తున్నయ్, భక్తులు మస్తుగనే ఉన్నరు గానీ ఎలాంటి ఇబ్బందులు లేవు. కేసీఆర్ బాగచేసిండు, పాలమూరు జిల్లాల ఏర్పాట్లు చాలా బాగున్నయ్, మీరెప్పుడొస్తరు, రండి… పన్నెండేండ్లకోసారి వచ్చి చూసిపోవచ్చుకదా..? ఇవీ వివిధ ప్రదేశాల నుంచి పాలమూరు జిల్లాలోని పుష్కరఘాట్లకు వచ్చిన భక్తులు వారి సమీప బంధువులతో ఫోన్‌లో చేసిన సంభాషణలు.

నిజమే..సమైక్య రాష్ట్రంలో 2004లో జరిగిన కృష్ణా పుష్కరాలకు, తెలంగాణ రా ష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి జరుగుతున్న కృష్ణా పుష్కరాలకు ఉన్న తేడాలేమిటో భక్తులు గమనిస్తున్నారనడానికి ఫోన్ సంభాషణలే చక్కని నిదర్శనంగా చెప్పవచ్చు. కేవలం తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన భక్తులమాటలే కావు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులు సైతం పుష్కర ఏర్పాట్లను చూసి ప్రభుత్వాన్ని, అధికారులను ఈ తీరును అభినందిస్తున్నారు. పాలమూరు జిల్లాలోని మొత్తం 52 పుష్కర ఘాట్లవద్ద ఆయా శాఖల అధికారులు చేసిన ఏర్పాట్లపై భక్తులతోపాటు వీఐపీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా హీరో శ్రీకాంత్ రంగాపూర్ వీఐపీ ఘాట్ వద్ద పుష్కరస్నానం చేశాక మీడియాతోపాటు మాట్లాడుతూ తాను హైదరాబాద్‌నుంచి రంగాపూర్ ఘాట్ వరకు రోడ్డుపై ఎలాంటి ఆటంకాలు లేకుం డా ప్రయాణించానని, అధికారులు చక్కటి ఏర్పాట్లు చేశారన్నారు. పుష్కర భక్తులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన అభినందనలు తెలిపారు.

ఖర్చు ఎంతయితేనేం..ఏర్పాట్లు అదుర్స్..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత సంవత్సరం జరిగిన గోదావరి పుష్కరాలలో భక్తుల సౌకర్యం కోసం తెలంగాణ రాష్ట్ర ప్ర భుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసిందో అంతకు మించిన ఏర్పాట్లను ప్రస్తుత కృష్ణా పుష్కరాలలో ప్రభుత్వం నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఏ నదికి పుష్కరమొచ్చినా భక్తులకు తగిన సౌకర్యాలు క ల్పించడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుకు వెనకాడిన సం దర్భాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు, న ల్గొండ జిల్లాల్లో మాత్ర మే కృష్ణా పరీవాహక ప్రదేశం ఉండగా ప్రభుత్వం రూ.212 కోట్లతో పాలమూరులో 52, నల్గొండలో 29 చొప్పున పుష్కరఘాట్లను నిర్మించింది.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలనుంచి వచ్చే భక్తులతోపాటు పొరుగు రాష్ర్టాలనుం చి వచ్చే భక్తుల సంఖ్యను అంచనా వేసి తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసింది. జాతీయ రహదారితోపాటు అంతరాష్ట్ర రహదారులకు అవసరమైన ప్యాచ్‌వర్క్‌లు నిర్వహించడం, పుష్కరాలకు 6నెలల ముందునుంచే హైవేకు, అంతరాష్ట్ర రహదారులకు అనుసంధానం చేస్తూ పుష్కర ఘాట్ల వరకు కొత్తరోడ్లు వేయడం, మరమ్మతులు నిర్వహించడంతో భక్తులు వివిధ క్షేత్రాలను దర్శించుకునేందుకు సానుకూల పరిస్థితి ఏర్పడింది. పుష్కరాలకు దూర ప్రదేశాల నుంచి పుష్కరాలకు బయలు దేరిన భక్తుల వాహనాల రాకపోకలకు ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా పోలీసులు చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులు ఏర్పా టు చే యడం, అల్లరి చేష్టలకు ఆ స్కారం లేకుండా షీటీంలు బందోబస్తు నిర్వహించడంతో భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో పుష్కరస్నానం చేసి దైవదర్శనం చేసుకుంటున్నారు. జిల్లాలోని వివిధ ఘాట్లకు కొద్దిదూరంలోనే విశాల స్థలంలో పార్కింగ్ ఏర్పా టు చేయడం, పెద్ద వాహనాలకు ఒక వైపు, చిన్న వాహనాలకు మరో వైపు ఇలా క్రమపద్ధతిలో పార్కింగ్‌కోసం ఏర్పాట్లు చేయడంవల్ల వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడటంలేదు. అదేవిధంగా పుష్కరఘాట్ల వద్ద ప్రమాదాలు జరుగకుండా పవర్‌బోట్ల ఏర్పాటు, అందుబాటులో గజ ఈతగాళ్లు, పోలీసు బందోబస్తు కారణంగా భక్తులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. నదీజలాల్లో స్నానం చేయడానికి భయపడేవారి కొందరు భక్తుల కోసం అధికారులు ప్రత్యేకంగా ఘాట్లవద్దే షవర్‌బాత్ పద్ధతి ఏర్పాటు చేశారు.

మరో వైపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ, టీఆర్‌ఎస్ నాయకులు తదితర స్థానిక ప్రజాప్రతినిధులు పుష్కరఘాట్లను తరచూ సందర్శిస్తూ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. డీజీపీ, డీఐజీ, కమిషనర్, అడిషనల్ డీజీ తదితర పోలీసు ఉన్నతాధికారులతోపాటు కలెక్టర్, ఎస్పీ, డీఎస్‌పీ తదితర పోలీసు అధికారులు ఘాట్లను పరిశీలిస్తూ భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
అలంపూర్‌లోని జోగుళాంబ, సోమశిల, బీచుపల్లి, రంగాపూర్, నదీ అగ్రహారం, పస్పుల ఘాట్లను భక్తులు అధిక సంఖ్య లో దర్శించుకొని పుణ్యస్నానాలు ఆచరించారు.

భక్తులు పుష్కర స్నానాలు చేసి ఆలయాల్లో పూజలు చేయడంతోపాటు పితృదేవతలకు పిండప్రదానం చేసి తర్పణాలు వదులుతున్నారు. బీచుపల్లి, రంగాపూర్, సోమశిల తదితర ఘాట్‌ల వద్ద టీఎస్‌ఆర్టీసీ బస్‌స్టేషన్‌ల ఏర్పాటు, భక్తుల రద్దీకి తగినట్లుగా బస్సుసర్వీసుల నిర్వహణ, అందుబాటులో రైళ్లు, ఘాట్ల వద్ద, దేవాలయాల వద్ద అపరిశుభ్ర వాతావరణం లేకుండా వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ పారిశుధ్య నిర్వహణ, పోలీసు భద్రత, మంచినీటి వసతి, టాయ్‌లెట్లు తదితర ఏర్పాట్లు, వాటి నిర్వహణను వివిధ శాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఆలయాలవద్ద భక్తులు క్రమపద్ధతిలో దర్శించుకునేందుకు వీలుగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక శాఖ, జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో వివిధ ఘాట్ల వద్ద శాస్త్రీయ, జానపద నృత్యాలు, నాటకాలు తదితర కళాకారుల ప్రదర్శనలు భక్తులను అలరిస్తున్నాయి. వివిధ ఘాట్ల వద్ద ప్రతినిత్యం కృష్ణమ్మకు ఇచ్చే హారతి ప్రక్రియ భక్తులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది.

Source:http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%AA%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0-%E0%B0%8F%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B8%E0%B1%82%E0%B0%AA%E0%B0%B0%E0%B1%8D-20-598067.aspx