పుష్కర పులకింత

కృష్ణవేణి పుష్కరాల సందర్భంగా భక్తులు నదీస్నానం ఆచరించి పులకించిపోయారు. 11వ రోజైన సోమవారం మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో మొత్తం 31 లక్షల మంది భక్తులు పుణ్యస్నానమాచరించారు. మంగళవారం పుష్కరాలకు చివరి రోజు కావడంతో భక్తులు భారీగా లివచ్చే అవకాశం ఉన్నది. అధికార యంత్రాంగం కూడా తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక్కరోజే 21 లక్షల మంది భక్తులు నదీస్నానమాచరించారు. బీచుపల్లికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు మరికొన్ని షవర్స్‌ను ఏర్పాటు చేశారు. అలంపూర్ మండలం మారమునగాల ఘాట్‌లో భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తల్లిదండ్రులు సత్యనారాయణరావు, లక్ష్మీదేవిలు నదీస్నానమాచరించి జోగుళాంబ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు.

జోగుళాంబ ఘాట్‌లో మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి దంపతులు, బీచుపల్లిలో రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామ్మోహన్‌రావు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మూలమళ్లలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పుష్కరస్నానమాచరించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, లకా్ష్మరెడ్డిలు బీచుపల్లి, రంగాపూర్, చెల్లెపాడు, పెద్దమారూర్, సోమశిల ఘాట్లలో భక్తుల అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. డీఐజీ అకున్ సబర్వాల్, ఎస్పీ రెమారాజేశ్వరి బీచుపల్లి, రంగాపూర్ ఘాట్లను పర్యవేక్షించారు. నల్లగొండ జిల్లాలో సుమారు 10 లక్షల మంది పుష్కర స్నానాలు చేశారు. సాగర్ శివాలయం ఘాట్‌లో మాజీ డీజీపీ, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు, మట్టపల్లిలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇల్లందు, పినపాక ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ సహా పలువురు ప్రముఖులు పుష్కర స్నానాలు ఆచరించారు. సీఎల్పీ నేత జానారెడ్డి వాడపల్లి వద్ద కృష్ణానదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Source:

http://www.namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/krishna-pushkaralu-reaches-11th-day-1-2-520821.html