పుష్కర భక్తులకు వైద్యసేవలు

-వైద్య ఆరోగ్యశాఖ, జాగృతి ఆధ్వర్యంలో28ఘాట్లలో క్లినిక్‌లు
-సేవలందించడంలో 2145మంది సిబ్బంది
నల్లగొండ, నమస్తే తెలంగాణ : పుష్కర స్నానాలు చేయడానికి వచ్చే భక్తులకు వైద్య, ఆరోగ్య శాఖతో పాటు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వైద్య సేవలందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 28ఘాట్లలో పూర్తి స్థాయిలో మెడిసిన్స్ అందుబాటులో ఉంచిన అధికారులు ఎప్పటికప్పుడు ఆయా శిబిరాలకు వచ్చి రోగులకు ప్రథమ చికిత్స నిర్వహిస్తున్నారు. 12నుంచి 23వరకు పుష్కరాలు కొనసాగనుండగా తొలిరోజు 2072మంది రోగులకు వైద్య సేవలందించగా మరుసటి రోజు మధ్యాహ్ననానికిమరో 1241మందికి ప్రాథమిక చికిత్స చేయడంతో పాటు ఉచితంగా కావాల్సిన మందులను సరఫరా చేశారు.

అయితే వైద్యాధికారులు ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు రోగులకు అందించే సేవల వివరాలు తెలుసుకోవడంతో పాటు మందుల కొతర ఉంటే వెంటనే సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. ప్రతి ఘాట్‌లో ఒక హెల్త్ క్లినిక్‌ను నిర్వహించడానికి ఓ వైద్యాధికారి సహా 13మంది సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ఇక్కడ ప్రాథమిక చికిత్స చేయనుండగా యాత్రికుల ఆరోగ్య పరిస్థితి ఏకారణం చేతనైనా విషమిస్తే ఆయా అంబులెన్సులతో వెంటనే తరలించి సత్వర చికిత్స చేసేందుకు ఆరు అత్యవసర కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఆ క్లినిక్‌లో మెడికల్ ఆఫీసర్‌తో పాటు ఫార్మాసిస్టు, స్టాఫ్‌నర్స్, ల్యాబ్ టెక్నిషియన్, ఇద్దరు సూపర్‌వైజర్లు (మహిళ, పురుష) హెల్త్ అసిస్టెంట్, పబ్లిక్ హెల్త్‌నర్సు, స్వీపర్, అటెండర్, డ్రైవర్, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్, డైలీ వెజ్ వర్కర్లు ఉన్నారు. ఈ 13మంది సిబ్బంది తొలిషిప్ట్‌లో 8గంటల పాటు విధులు నిర్వహించగా మరో రెండు షిప్ట్‌ల్లో 13మంది చొప్పున మొత్తంగా 39మంది ప్రతిరోజుసేవలు అందిస్తున్నారు. 28ఘాట్లలో 2145మంది వైద్య సిబ్బంది యాత్రికుల ఆరోగ్య పరీరక్షణకై సేవలందించడంలో నిమగ్నమయ్యారు. ప్రతిఘాట్‌లో ప్రథమ చికిత్స కేంద్రాలు ఉండగా అత్యవసరాన్ని దృష్టిలో పెట్టుకుని దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హూజుర్‌నగర్, నల్లగొండతోపాటు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రిలో 20బెడ్ల చొప్పున ఏర్పాటు చేసి ఎమర్జెన్సీ కేంద్రాలను అందుబాటులో ఉంచారు.

ఆయా ఘాట్లలో ఏడుగురు ఎస్పీహెచ్‌ఓలు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తూ కిందిస్థాయి వైద్యాధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మట్టపల్లిలో మూడుఘాట్లు, వాడపల్లిలో 8ఘాట్లు ఉండడంతో ఇక్కడికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ఆలోచించిన తెలంగాణ జాగృతి ఆసంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు ఆ రెండు ప్రాంతాల్లో జాగృతి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసింది. అక్కడకొచ్చిన భక్తులకు ఈ సంస్థ స్వచ్ఛందంగా ప్రథమ చికిత్స అవసరమైన రోగులకు చేస్తూ ఉచితంగా మందులు సరఫరా చేస్తోంది.

Source:
http://www.namasthetelangaana.com/Districts/Nalgonda/%E0%B0%AA%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0-%E0%B0%AD%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%B5%E0%B1%88%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B8%E0%B1%87%E0%B0%B5%E0%B0%B2%E0%B1%81-22-597452.aspx