పుష్కర భక్తులతో కిక్కిరిసిన జాతీయ రహదారులు

పుష్కర కాలం ముగింపు దగ్గర పడుతుండడంతో జాతీయ రహదారులు పూర్తిగా పుష్కర భక్తుల వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో జడ్చర్ల జాతీయ రహదారిపై దాదాపు కిలో మీటర్ల మెర వాహనాలు బారులు తీరాయి. దీంతో పోలీసులు ఎక్కడిక్కడ వాహనాలను అదుపు చేస్తూ వారికి సంబందించిన ఘాటులకు పంపేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, నారాయణఖేడ్, మహరాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు కృష్ణమ్మ ఒడిలో స్నానాలు ఆచరించేందుకు వస్తున్నారు. ఆదివారం ఒక్కరోజే దాదాపు 50లక్షల వరకు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చినట్లు జడ్చర్లలో పలువురు అధికారులు అంచనాలు వేశారు. వాహనాల రద్ది అధికంగా ఉండడంతో పోలీసులు భారి వాహనాలను, ట్రక్కులను,లారీలను జడ్చర్ల మండలం మాచారం దగ్గర హల్ట్ పాయింట్‌లో ఆపారు.

దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాదారులతో పాటు పాలమూరు జిల్లాలో పలు ప్రాంతాలకు వెళ్లే వాహనాల డ్రైవర్లు కొంత ఇబ్బందులను ఎదుర్కొన్న పుష్కర భక్తులకు సహకారం అందించేందుకు తమ వాహనాలను ఆపి పోలీసులకు సహకరించారు. తెల్లవారు జామునే బయలు దేరిన భక్తులు జాతీయ రహదారి పై ఉన్న బస్సు షెడ్లలోనే తమ తమ వెంట తీసుకువచ్చిన టిఫిన్‌లు చేసి జీఎంఆర్ వారు ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాంకుల దగ్గర దాహం తీర్చుకున్నారు. మొత్తానికి పుష్కర స్నానాలకు జిల్లాకు వస్తున్న భక్తులు అధికారుల ఏర్పాట్ల విషయంలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Source:
http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%AA%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0-%E0%B0%AD%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%95%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A4%E0%B1%80%E0%B0%AF-%E0%B0%B0%E0%B0%B9%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-20-599368.aspx