పుష్కర సాంస్కృతిక సంబురాలు

కృష్ణా పరివాహక ప్రాంతాల్లో 9 వేదికలపై.. నేటినుంచి 12వేల మంది కళాకారులతో 12 రోజులు కార్యక్రమాలు

కృష్ణా పుష్కరాల సందర్భంగా భారతీయ వారసత్వం, తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా.. దాదాపు పన్నెండు వేలమంది కళాకారులతో సంబురాలను నిర్వహిస్తున్నామని రాష్ట్ర గిరిజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. తొమ్మిది వేదికల్లో ఈ నెల 23 వరకు జరిగే కార్యక్రమాల వివరాలను మంత్రి గురువారం సచివాలయంలో మీడియాకు వెల్లడించారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతాలైన మహబూబ్‌నగర్ జిల్లాలోని బీచ్‌పల్లి, రంగాపూర్, సోమశిల, కృష్ణా బ్రిడ్జి జంక్షన్, పసుపుల, ఆలంపూర్.. నల్లగొండ జిల్లాలోని వాడపల్లి, మట్టపల్లి, నాగార్జునసాగర్ వద్ద వేదికలను ఏర్పాటు చేసి సాంస్కృతిక సంబురాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆధ్యాత్మికతకు సాంస్కృతికతను జోడించి.. తెలంగాణ కళాకారులకు గౌరవం కలిగే విధంగా.. ఉత్సవాలకు వచ్చే ప్రజానీకం భక్తిపారవశ్యంలో మునిగిపోయే విధంగా పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశామన్నారు. ఇందులో భాగంగా భజనలు, ధార్మిక ప్రవచనాలు, చిందు యక్షగానం, ఒగ్గు కథ, శాస్త్రీయ సంగీతం, పద్య పౌరాణిక నాటకాలను ప్రదర్శిస్తామని మంత్రి వివరించారు.

ఈ మొత్తం కార్యక్రమాల కోసం సుమారు కోటి రూపాయలు వెచ్చిస్తున్నామని తెలిపారు. దేశ, విదేశీ భక్తులు కూర్చునే విధంగా సకల సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించడానికి సాంస్కృతిక శాఖ ప్రత్యేకంగా కృషి చేసిందని మంత్రి అజ్మీరా చందులాల్ పేర్కొన్నారు. తెలుగుకు ప్రాచీన హోదా దక్కినందున తెలుగు భాషాభివృద్ధికి కేంద్రం నుంచి భారీ స్థాయిలో నిధులు విడుదలవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సీఎంవోలో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Source:
http://www.namasthetelangaana.com/LatestNews-in-Telugu/cultural-krishna-pushkarni-celebrations-1-1-500866.html