పుష్కర సేవకు.. ప్రగతిరథ చక్రం

-జిల్లావ్యాప్తంగా 527 బస్సు సర్వీసులు
-నాగార్జునసాగర్, వాడపల్లి, మట్టపల్లి ప్రాంతాలకు షటిల్ బస్సులు
-హైదరాబాద్ నుంచి 20 రాజధాని(ఏసీ) బస్సుల సేవలు
-ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు అందుబాటులో…
నల్లగొండ, నమస్తే తెలంగాణ : నేటి నుంచి ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాల్లో ఆర్టీసీ సేవలు అందించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ఘాట్ల వద్దకు ప్రయాణికులను చేర్చేందుకు బస్సులను కేటాయించారు. జిల్లాలోని 7 డిపోలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రానున్నందున ఆర్టీసీ సేవలను విస్తరించి ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా ఈ 12 రోజుల్లో ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 527 బస్సులను ఆయా ప్రాంతాల నుంచి ఘాట్లకు నడుపనున్నారు. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి వివరాలను సైతం గురువారం ఆ శాఖ రీజనల్ మేనేజర్ కృష్ణహరి తెలియజేశారు. ఆయా రూట్లలో కేటాయించిన బస్సులు రాత్రి అక్కడే బస చేసి మరునాడు తెల్లవారుజాము నుంచే ప్రయాణికులను అనుకున్న స్థలానికి తీసుకెళ్లనున్నాయి.

ఆయా ఘాట్లలో 527 సర్వీసులు….
జిల్లాలో 29ఘాట్లు ఉండగా, 24 ఘాట్లలో ఆర్టీసీ బస్సులు సేవలు అందించనున్నాయి. జిల్లాలో ఉన్నటువంటి ఏడు బస్ డిపోల ద్వారా 307 బస్సులను, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డిపోల నుంచి 150 బస్సులను నడుపనుండగా, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాల నుంచి మరో 70 బస్సులను నడుపనున్నారు. అయితే ప్రధానంగా నాగార్జునసాగర్‌లో మూడు ఘాట్లు ఉండడంతో అక్కడ జిల్లాకు చెందిన బస్సులతో పాటు ఇతర జిల్లాల నుంచి మొత్తంగా 295, వాడపల్లికి 107, మట్టపల్లికి 100 బస్సులను నడుపనున్నారు. ఇందులో 105 షటిల్ పేరుతో ఉచిత సర్వీస్‌లు మూడు ప్రాంతాల నుంచి ఆయా ఘాట్లకు ప్రయాణికులను తీసుకెళ్లనున్నాయి. వీటిలో మట్టపల్లి ఘాట్ల వద్ద 20, సాగర్ ఘాట్ల వద్ద 60, వాడపల్లి ఘాట్ల వద్ద 25 షటిల్ బస్సులు తిరగనున్నాయి.

మిగిలిన ఘాట్లకూ నడువనున్న బస్సులు…
జిల్లావ్యాప్తంగా 24 ఘాట్లకు బస్సులు నేటి నుంచి ఈ నెల 23 వరకు నడువనున్నాయి. అయితే ప్రధాన ప్రాంతాలైన నాగార్జునసాగర్‌లో-3, మట్టపల్లిలో-3, వాడపల్లిలో-8 ఘాట్లు ఉండగా వీటికి ఎక్కువ స్థాయిలో సర్వీస్‌లు అందుబాటులో పెట్టారు. అయితే కాచరాజుపల్లి ఘాట్‌కు-2 సర్వీసులను ఏర్పాటు చేసిన అధికారులు అజ్మాపురం ఘాట్‌కు-2, పెద్దమునిగాల్‌కు-4, ఉట్లపల్లికి-4, కిష్టాపురం-2, వజినేపల్లి-2, ఇర్కిగూడెం-2, ముదిమాణిక్యం-2, మహంకాళిగూడెం-5 సర్వీసుల చొప్పున ఏర్పాటు చేశారు. ఇవి ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిత్యం తిరగనున్నాయి. జిల్లాలో 29 పుష్కర ఘాట్లుండగా జిల్లా కేంద్రంలోని పానగల్ సమీపంలో ఉన్నటువంటి ఛాయసోమేశ్వర ఆలయం, కనగల్ మండల కేంద్రంలోని పుష్కర ఘాట్‌తో పాటు అదే మండల పరిధిలోని దర్వేశిపురం పుష్కరఘాట్ నిత్యం బస్సులు తిరుగుతుండడంతో సర్వీసులు ఏర్పాటు చేయలేదు. ఇక దామరచర్ల మండలంలోని అడవిదేవులపల్లి, మేళ్లచెరువు మండలంలోని బుగ్గమాదారం ఘాట్లకు వెళ్లే అవకాశం ఉండడంతో బస్సు సౌకర్యం కల్పించలేదు.

Source:
http://www.namasthetelangaana.com/Districts/Nalgonda/%E0%B0%AA%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0-%E0%B0%B8%E0%B1%87%E0%B0%B5%E0%B0%95%E0%B1%81-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%97%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B0%E0%B0%A5-%E0%B0%9A%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82-22-596874.aspx