ఫోన్ చేస్తే మీ ఇంటికి ఆర్టీసీ బస్సు

కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి కృష్ణా పుష్కరాలకు వెళ్లాలనుకుంటున్నారా..! ప్రైవేట్ బస్సుల్లో భద్రత గురించి ఆలోచిస్తున్నారా..! ప్రయాణ ఖర్చు కూడా భారీగా అవుతోందా! ఇప్పుడు ఆ టెన్షన్ అవసరం లేదు.. ఒక్క ఫోన్ కొడితే చాలు ఆర్టీసీ బస్సు మీ ఇంటికే వస్తుంది. ఇంకేముందు హాయిగా విహార యాత్రకు వెళ్లినట్లు పుష్కరాలకు వెళ్లొచ్చు. రేపటి నుంచి నిర్వహించే కృష్ణా పుష్కరాలకు సురక్షితంగా వెళ్లేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. జిల్లాలోని ఏ మారుమూల గ్రామం అయినాసరే 30 మంది దాటితే ఆర్టీసీ బస్సును ప్రత్యేకంగా పంపించనున్నారు.

ఆన్‌లైన్‌లో టికెట్లు
కృష్ణా పుష్కరాలకు వెళ్లే వారు ఆర్టీసీ ప్రయాణించాలనుకుంటే ఆన్‌లైన్‌లో టికెట్లను పొందవచ్చును. WWW.TSRTCONLINE.IN వెబ్‌సైట్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చను. లేదా దగ్గరలోని ఏటీబీ ఏజెంట్ ద్వారా రిజర్వ్ చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. జిల్లాలోని ఏదేని గ్రామం నుంచి 30 మంది వెళ్లాలనుకుంటే.. ఫొన్ చేయాలని, లేదా దగ్గరలోని డిపోలో సంప్రదిస్తే ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. నమోదు చేసుకున్న తేదీ, సమయానికి బస్సును నేరుగా కోరుకున్న చోటుకు పంపిస్తామని చెప్పారు.

ప్రైవేటు వద్దు.. ఆర్టీసీనే ముద్దు
కృష్ణా పుష్కరాలకు వెళ్లాలనుకునే భక్తులు ప్రైవేటు వాహనాల కంటే ఆర్టీసీ బస్సులను వినియోగిస్తేనే అన్ని రకాలుగా క్షేమదాయకంగా ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ సార్లు తిప్పాలనుకునే ప్రైవేటు వాహనాల కంటే సమాయానుకూలంగా ప్రయాణించే ఆర్టీసీనే మేలని ప్రయాణికులు భావిస్తున్నారు. ప్రైవేటులో ఎక్కువ మొత్తంలో చార్జీలను వసూలు చేయడంమే కాకుండా.. అక్కడక్కడ వాహనాలను మార్చాల్సి వస్తుందనే మిమర్శలు కూడా ఉన్నాయి. కాగా ఆయా డిపోలు, బస్సు స్టేషన్‌ల నుంచి వివిధ ప్రాంతాల్లోని పుష్కర ఘట్టాల వరకు ప్రయాణించే దూరాన్ని బట్టి ఆర్టీసీ ఇప్పటికే చార్జీలను ఖరారు చేసింది. బీచుపల్లి, వడపల్లి, నాగార్జునసాగర్, శ్రీశైలంలకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసింది.
Source:http://www.namasthetelangaana.com/LatestNews-in-Telugu/tsrtc-bus-for-krishna-pushkaralu-1-1-500777.html