భక్తజన పరవశం

పాలమూరు జిల్లాలో కృష్ణా పుష్కర వేడుకలు ఆనందమానందమాయే.. అన్నట్టుగా సాగుతున్నాయి. పుష్కరాలకు వచ్చిన ప్రజలకు మహానందం కలిగించేలా వాతావరణం ఉండటం అదృష్టంగా భావిస్తున్నారు. మధ్యాహ్నం వేళ షవర్‌తో వర్షం కురిపించినట్లుగా ఆకాశం నుంచి జాలువారుతున్న చినుకుల సవ్వడితో భక్తజనులు మరింత పరవశించిపోతున్నారు. జిల్లాలోని ప్రధాన ఘాట్లన్నిటిల్లో భక్తులు అత్యధిక సంఖ్యలో పుష్కరస్నానమాచరించారు. వరుస సెలవులు రావడంతో అధిక రద్దీతో పుష్కరఘాట్లు కిక్కిరిసి, కళకళలాడాయి. పండితుల వేదమంత్రాల ఘోషతో కృష్ణాతీరం మార్మోగుతున్నది. కృష్ణమ్మ భక్తిపారవశ్యంతో పుష్కరప్రాంతాలన్నీ పులికించిపోయాయి. మూడో రోజు పుష్కర సంబురం లక్షలాది మంది భక్తజనులతో కనులవిందుగా సాగిపోయింది. ఆదివారం జిల్లా వ్యాప్తంగా 12లక్షల మంది భక్తజనం పుష్కర వేడుకల్లో పాల్గొన్నట్లు అంచనా.

Source:
http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%AD%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B0%9C%E0%B0%A8-%E0%B0%AA%E0%B0%B0%E0%B0%B5%E0%B0%B6%E0%B0%82-20-597642.aspx