భక్త జన మురిపెం

-కన్నులపండువగా పుష్కరాలు..
-జోగుళాంబ ఘాట్‌లో పుష్కరస్నానం చేసిన మంత్రులు, రాజ్యసభ సభ్యులు..
-భారీగా తరలివస్తున్న జనం..
-ఏర్పాట్లు అద్భుతమంటున్న భక్తులు..
-అమరవీరులకు పిండప్రదానం..
-మహాద్భతంగా కృష్ణమ్మకు హారతి..
పుష్కర మహోత్సవం కన్నులపండువగా కొనసాగుతున్నది. రోజు రోజుకూ భక్తుల రాక పెరుగుతుండటంతో కృష్ణా తీరం మానవహారంలా మారుతున్నది.. ఒకవైపు నల్లమల కొండలు.. మరోవైపు జలతరంగంలా కృష్ణమ్మ పరుగులు భక్తులను మైమరిచిపోయేలా చేస్తున్నాయి.. తీరంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మికత పరిమళాలను పంచుతున్నాయి. రంగాపూర్, బీచుపల్లి, సోమశిల, జోగుళాంబ, నదీఅగ్రహారం, పస్పుల, క్రిష్ణా(మాగనూరు) ఘాట్లన్నీ జనంతో కిక్కిరిసోతున్నాయి.

శుక్రవారం 14లక్షల మంది పుణ్యస్నానమాచరించినట్లు అధికారుల అంచనా. జోగుళాంబ పుష్కరఘాట్‌లో మంత్రులు నాయిని, పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సమేతంగా పుష్కరస్నానమాచరించి, జోగుళాంబను దర్శించుకున్నారు. సీఎం వ్యక్తిగత కార్యదర్శి నర్సింగరావ్, రాజ్యసభ సభ్యుడు డీఎస్ గొందిమల్లలో పుష్కరస్నానం చేసి, అమ్మవారిని దర్శించుకున్నారు.

రంగాపూర్ ఘాట్‌లో టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కేశవరావ్ కుటుంబ సభ్యులతో నదీస్నానమాచరించారు. కొల్లాపూర్ పుష్కరఘాట్‌లో జేఏసీ చైర్మన్ కోదండరాం, పస్పులలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్‌లు పుణ్యస్నానమాచరించారు. కలెక్టర్ శ్రీదేవి, డీఐజీ అకున్ సబర్వాల్ పుష్కర ఏర్పాట్లపై అలంపూర్, రంగాపూర్‌లలో పర్యవేక్షణ చేశారు. రంగాపూర్ ఘాట్‌లో కృష్ణమ్మకు సంధ్యా హారతి మహాద్భుతంగా జరిగింది.