భక్త జన సునామీ

-పదో రోజు పుష్కర ఘాట్లకు పోటెత్తిన భక్త జనం
-5లక్షల మందితో కిక్కిరిసిన నాగార్జున సాగరం
-దర్వేశిపురం, వాడపల్లి, మట్టపల్లిలో 2 లక్షలు
-వాహనాల రద్దీతో కిటకిటలాడిన రహదారులు
-అనుక్షణం పరిస్థితిని సమీక్షించిన అధికారులు
-నేడు, రేపు భక్తుల రద్దీ కొనసాగే అవకాశం
నేల ఈనిందా అన్నట్లు పుష్కర వేడుకకు భక్త జనం భారీగా కదిలింది. జిల్లాలోని కృష్ణా తీర పుష్కర ఘాట్లన్నీ ఇసుకేస్తే రాలనంత అన్నట్లుగా తలపించాయి. పుష్కర వేడుకల్లో పదో రోజు ఆదివారం ఒక్కనాడే జిల్లా వ్యాప్తంగా 15లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు చేయడం విశేషం. గడిచిన మూడ్రోజులుగా పెరుగుతున్న భక్తుల సంఖ్య.. ఆదివారం అనూహ్యంగా మూడింతలైంది. ఒక్క నాగార్జున సాగర్‌లోనే అత్యధికంగా 5లక్షల మంది పాల్గొనగా.. దర్వేశిపురం, వాడపల్లి, మట్టపల్లిలోనూ 2లక్షల చొప్పున భక్త జనులు పుష్కర స్నానం ఆచరించారు.

పోటెత్తిన భక్తులతో ఘాట్లన్నీ కిక్కిరిసిపోగా.. వాహనాల రద్దీతో రహదారులు కిటకిటలాడాయి.భారీ సంఖ్యలో భక్తులు రావడంతో కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్పీ ప్రకాష్‌రెడ్డి సహా జిల్లా ముఖ్య అధికారులంతా ఘాట్ల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. చందంపేట మండలం వైజాగ్ కాలనీ సమీపంలో సాగర్ బ్యాక్‌వాటర్‌లో మునిగి ఒక బాలుడు చనిపోగా.. జేసీ సత్యనారాయణ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘాట్లలోనే స్నానాలు చేయాలని సూచించారు.

నేల ఈనిందా అన్నట్లు పుష్కర వేడుకకు భక్త జనం భారీగా కదిలింది. జిల్లాలోని కృష్ణాతీర పుష్కర ఘాట్లన్నీ ఇసుకేస్తే రాలని చందాన్ని తలపించాయి. పుష్కర వేడుకల్లో పదో రోజు అయిన ఆదివారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 15 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు చేయడం విశేషం. గడిచిన మూడ్రోజుల నుంచి క్రమంగా పెరుగుతున్న భక్తుల సంఖ్య.. ఆదివారం అనూహ్యంగా మూడింతలు పెరిగింది. ఒక్క నాగార్జున సాగర్‌లోనే అత్యధికంగా 5 లక్షల మంది పుష్కర భక్తులు పాల్గొనగా.. దర్వేశిపురం, వాడపల్లి, మట్టపల్లిలోనూ 2 లక్షల చొప్పున భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. పోటెత్తిన భక్తులతో ఘాట్లన్నీ కిక్కిరిసిపోగా.. వాహనాల రద్దీతో రహదారులు కిటకిటలాడాయి.

అక్కడక్కడా స్వల్ప ట్రాఫిక్ సమస్యలు తలెత్తినా పోలీసు శాఖ వెంటనే సరి చేసింది. భారీ సంఖ్యలో భక్తులు రావడంతో కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ఎస్పీ ప్రకాష్ రెడ్డి సహా జిల్లా ముఖ్య అధికారులంతా ఘాట్ల వెంటనే పర్యటిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. చందంపేట మండలం వైజాగ్ కాలనీ సమీపంలో సాగర్ బ్యాక్‌వాటర్‌లో మునిగి ఒక బాలుడు చనిపోగా.. జేసీ సత్యనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘాట్లలోనే స్నానాలు చేయాలని సూచించారు.

కృష్ణా పుష్కరాల పదో రోజు భక్తుల రాక భారీగా పెరిగింది. జిల్లాలోని 28 ఘాట్లలో ప్రతీ ఘాట్ ఆదివారం భక్తుల రద్దీతో కిక్కిరిసి కనిపించింది. శుక్రవారం 6 లక్షల మంది.. శనివారం నాడు 7 లక్షల మంది జిల్లా వ్యాప్తంగా పుష్కర స్నానాలు చేయగా.. ఆదివారం ఒక్కరోజే 15 లక్షల మంది భక్తులు పుష్కరాల కోసం బారులు తీరారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉదయం నుంచే అన్ని ఘాట్ల వద్ద పుష్కర భక్తుల బారులతోపాటు.. తెల్లవారుజాము నుంచే జిల్లాలోని ప్రధాన రహదారుల పై వాహనాలు సైతం కిటకిటలాడాయి.

మధ్యాహ్నం 3 గంటల వరకే 11 లక్షల మంది
తెల్లవారు జాము నుంచే పదో రోజు పుష్కరాలకు భక్తుల రాక ప్రారంభం కాగా.. ఉదయం 9 గంటల వరకే జిల్లాలోని వివిధ ఘాట్లలో సుమారు 2 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ సంఖ్య 11 లక్షలకు పెరిగింది. పుష్కరాల ద్వితీయార్థంలో భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుందనే అంచనా ముందు నుంచి ఉన్నప్పటికీ.. ఆదివారం అనూహ్యంగా పెరగడంతో అధికార యం త్రాంగం సైతం ఆశ్చర్యానికి లోనైంది. అయితే ముందుగానే భారీ సంఖ్యలో వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టిన ఏర్పాట్లు లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూశాయి. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం జిల్లాలోని 28 ఘాట్లలో 14,08,000 మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారు. వీరుగాకుండా ఆ తర్వాత కూడా భక్తుల రాక రాత్రి వరకూ కొనసాగింది. మొత్తంగా ఆదివారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 15 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు చేయడం విశేషం.

జన సంద్రం తలపించిన సాగర్..
పదో రోజు భక్తుల సంఖ్య అధికంగా నాగార్జునసాగర్‌కు కొనసాగింది. హైదరాబాద్ నుంచే ఎక్కువ మంది భక్తులు సాగర్‌కు దారులు కట్టగా.. జిల్లాలోని వివిధ ప్రాంతాలు, వివిధ జిల్లా ల నుంచి కూడా భక్తులు వచ్చా రు. ఒక దశలో సాగర్‌లోని పైలాన్ నుంచి హిల్‌కాలనీ వర కు వాహనాల రాకపోకలు స్తం భించాయి. ఆదివారం సాగర్ శివాలయం ఘాట్‌లోనే 3,70, 000 మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారు. మొత్తంగా సాగర్‌లోని అన్ని ఘాట్లలో కలుపుకుని 5 లక్షల మంది భక్తులు పుష్కరాల్లో పాల్గొన్నారు. సాగర్ తర్వాత అత్యధిక భక్తుల రద్దీ దర్వేశిపురం, వాడపల్లి ఘాట్లకు కొనసాగింది. ఆదివారం ఒక్కరోజే దర్వేశిపురంలో 2,20,000 మంది భక్తు లు పుష్కర స్నానాలు చేశారు.

వాడపల్లిలోని 8 ఘాట్లలో 2,30,000 మంది భక్తు లు హాజరయ్యారు. దా మరచర్ల మండలంలోని అడవిదేవులపల్లిలో 50వేల మంది.. ఇర్కిగూడెం, ముదిమాణిక్యం ఘాట్‌లలో 30వేల మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారు. మట్టపల్లిలోని ఘాట్లలో 2,00,000 మందికి పైగా భక్తులు పాల్గొనగా.. నేరేడుచర్ల మండలం మహంకాళిగూడెంలో 50 వేల మంది పాల్గొన్నారు. మేళ్లచెర్వు మండలంలోని వివిధ ఘాట్లు, ఉట్లపల్లి, కాచరాజుపల్లి ఘాట్లు సైతం భక్తుల రద్దీతో కిక్కిరిసి కనిపించాయి. కాచరాజుపల్లిలో 70 వేల మంది భక్తులు ఆదివారం పుష్కరాల్లో పుణ్య స్నానం చేశారు.

పుష్కర స్నానాలు చేసిన ప్రముఖులు
ఆదివారం భారీ సంఖ్యలో లక్షలాదిగా పోటెత్తిన భక్త జనంతోపాటు.. పెద్ద సంఖ్యలో ప్రముఖులు కూడా పుష్కర స్నానాలు చేశారు. నాగార్జున సాగర్ శివాలయం ఘాట్‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి కుటుంబ సమేతంగా పుష్కర స్నానం చేసి.. నదీ జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహంకాళి ఘాట్‌లో గచ్చిబౌలి ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి, వరంగల్ జిల్లా న్యాయమూర్తి తాటికొండ నర్సిరెడ్డి హాజరుకాగా.. మట్టపల్లిలో రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంజీ గోపాల్, మెదక్ జిల్లా సిద్దిపేట సెషన్స్ కోర్టు జడ్జి శాంతారాజు, ఖమ్మం డిప్యూటీ మేయర్ బత్తుల మురళి పుష్కర స్నానాలు చేశారు.

మేళ్లచెర్వు మండలం బుగ్గ మాదారం ఘాట్‌లో సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వర్ రావు, వజినేపల్లి ఘాట్‌లో రంగారెడ్డి జిల్లా జడ్జి నిరంజన్ రావు, పరకాల న్యాయమూర్తి సుజాత, హన్మకొండ జడ్జి రత్నమాల సహా పలువురు ప్రముఖులు పుష్కరాలకు హాజరయ్యారు. కనగల్ మండలం దర్వేశిపురం ఘాట్‌లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పుష్కరస్నానం చేయగా.. హైకోర్టు రిజిస్ట్రార్ ఎస్‌వీ భట్ వాడపల్లి వద్ద పుష్కర వేడుకల్లో పాల్గొన్నారు.

పక్కాగా పర్యవేక్షించిన యంత్రాంగం..
ఆదివారం పెద్ద సంఖ్యలో 15 లక్షల మంది భక్తులు పోటెత్తినా.. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు, రెవెన్యూ యంత్రాంగాలు సమన్వయం తో పని చేశాయి. ఎక్కడా రహదారులపై ఎక్కువ సేపు వాహనాలు జమ కాకుండా చూడడంతోపాటు.. భక్తులను సైతం వివిధ ఘాట్లకు పంపిణీ చేసి తోపులాటలు జరగకుండా చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్పీ ప్రకాష్ రెడ్డితోపాటు ముఖ్య అధికారులు, ఘాట్ ఇన్‌చార్జులు, పోలీసు అధికారులు అనునిత్యం అప్రమత్తంగా ఉండి వచ్చిన భక్తులను పుష్కర స్నానాల అనంతరం తిరిగి క్షేమంగా పంపించారు.

Source:
http://www.namasthetelangaana.com/Districts/Nalgonda/%E0%B0%AD%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%9C%E0%B0%A8-%E0%B0%B8%E0%B1%81%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AE%E0%B1%80-22-599389.aspx