మక్తల్ నియోజకవర్గంలో 2.5లక్షల మంది పుష్కరస్నానం

కృష్ణా పుష్కరాల ముగింపు దగ్గర పడడంతో నియోజకవర్గంలోని ప్రధాన పుష్కరఘాట్లకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. నేటితో పుష్కరాలు ముగుస్తుండడంతో నేడు మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది. నియోజకవర్గంలోని అన్ని ఘాట్లలో 11వ రోజైన సోమవారం దాదాపు 2.5లక్షల మంది భక్తులు పుష్కరస్నానాలు చేసినట్లు అంచనా. అత్యధికంగా మక్తల్ మండలం పస్పుల ఘాట్‌లో 1లక్ష 10వేల మంది, కృష్ణా ఘాట్‌లో 60వేల మంది భక్తులు పుష్కరస్నానాలకు తరలివచ్చారు. భక్తులు భారీగా తరలిరావడంతో అధికారులు, పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నారు. కృష్ణా పుష్కరఘాట్‌లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి, మూలమళ్ల ఘాట్‌లో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డిలు పుణ్యస్నానాలు ఆచరించారు.

Source:http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%AE%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-2-5%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%B2-%E0%B0%AE%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82-20-599516.aspx