వీపనగండ్ల 2,35,105మంది పుణ్యస్నానం

పన్నెండేళ్ల తర్వాత వచ్చిన కృష్ణా పుష్కరాలు మంగళవారంతో ముగిశాయి. చివరిరోజు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీపనగండ్ల మండలంలోని జటప్రోలు, చెల్లెపాడు, పెద్దమారూర్ పుష్కరఘాట్లకు అధికసంఖ్యలో తరలివచ్చారు. జటప్రోలులో పాన్‌గల్ జడ్పీటీసీ రవికుమార్ దంపతులు పుష్కరస్నానం చేశారు. చెల్లెపాడు పుష్కరఘాట్‌లో సర్పంచ్ నరసింహ్మ ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

విజయవంతంగా సాగిన పుష్కరాలు
ఈనెల 12న ప్రారంభమైన కృష్ణా పుష్కరాలు 12రోజులపాటు విజయవంతంగా సాగాయి. మండలంలో మొత్తం తొమ్మిది ఘాట్లను ఏర్పాటు చేయగా, జటప్రోలు, పెద్దమారూర్, చెల్లెపాడు ఘాట్లకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలను ఆచరించారు. మొత్తం దాదాపు 2,35,105మంది పుష్కరస్నానం చేశారు.

మదనగోపాలస్వామికి రూ.71,499 ఆదాయం
కృష్ణా పుష్కరాలతో జటప్రోలు మదనగోపాలస్వామి ఆలయానికి రూ.71,499 ఆదాయం వచ్చింది. పుష్కరాల ముగింపుతో హుండీల్లో భక్తులు వేసిన డబ్బులను మంగళవారం ఆలయ నిర్వాహకులు లెక్కించారు. ఆలయంలో ఉన్న మూడు హుండీలలో భక్తులు రూ.71,499లను వేశారు.

అన్నదానం మరువలేనిది
కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకోసం చిన్నంబావిచౌరస్తాలో మారం సంజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం మరవలేనిదని కొల్లాపూర్ మార్కెట్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, తహసీల్దార్ ప్రభాకర్‌రావులు అన్నారు. ఫౌండేషన్ నిర్వాహకులు మారం సతీష్, మారం బాలకృష్ణ తదితరులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. రూ.లక్షా 20వేలను ఖర్చుచేసి అన్నదానం దాతృత్వాన్ని చాటుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో ప్రవీణ్, విజయ్‌కుమార్, గోపినాయుడు, సింగయ్యశెట్టి, తిరుపాల్, శేషువాణి, కృష్ణమూర్తి, రవికుమార్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

Source:http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%B5%E0%B1%80%E0%B0%AA%E0%B0%A8%E0%B0%97%E0%B0%82%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B2-235105%E0%B0%AE%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%81%E0%B0%A3%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82-20-599861.aspx