సోమశిల ఘాట్లలో 2.8 లక్షల మంది భక్తుల పుణ్యస్నానాలు

కృష్ణా పుష్కరాల్లో భాగంగా 11వ రోజు సోమవారం పుష్కర స్నానాలు చేసేందు కోసం తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు సోమశిలకు బారులు కట్టారు. మంగళవారం భక్తులు వాహనాలు 45 ఎకరాల్లో నిండి పోయాయి. సోమవారం ఉదయం సీఐ రాఘవరావు, ఎస్సై మనోజ్‌కుమార్, ప్రొబేషనరీ ఎస్సై నర్సింహారావు, పోలీస్ సిబ్బంది కొల్లాపూర్ – సోమశిల మధ్య రాళ్లను ఏర్పాటు చేశారు. సోమశిల జనరల్ ఘాట్‌లో భక్తులతో నిండి పోవడంతో భక్తులు వీఐపీ ఘాట్‌కు వెళ్లి సప్తనదుల సంగమ ప్రదేశంలో కృష్ణానదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. సోమశిల వీఐపీ ఘాట్‌లో ఆ ఘాట్ ఇన్‌చార్జి ఏపీడీ పాపయ్య, పెద్దకొత్తపల్లి తహసీల్దార్ అశోక్, హౌసింగ్ ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డిలు పర్యవేక్షిస్తూ పుష్కరఘాట్ల వద్ద భక్తుల రద్దీని గమనిస్తూ ఎప్పటికప్పుడు మైక్‌లో ప్రకటనలు చేస్తూ ప్రయాణికుల రద్దీని క్రమ బద్దీకరించారు.

సోమశిల జనరల్‌ఘాట్‌లో ఆర్డీవో దేవేందర్‌రెడ్డి, తహసీల్దార్ పార్థసారధి, వీఆర్‌వో గోవింద్‌రెడ్డి, రెవెన్యూ కంట్రోల్ పాయింట్ నుంచి ఎప్పటికప్పుడు మైక్ ద్వారా ప్రకటనలను చేస్తూ సూచనలు చేశారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకే వీఐపీ ఘాట్‌లో 86వేల మంది భక్తులు, సోమశిల జనరల్ గాట్‌లో లక్షా 95 వేల మంది భక్తులు పుణ్య స్ననాలు చేసినట్లు తహసీల్దార్ పార్థసారధి తెలిపారు. స్థానిక జెడ్పీటీసీ హన్మంత్‌నాయక్, ఎంపీపీ నిరంజన్‌రావు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాజేష్, నాయకులు బాలస్వామిలు పర్యవేక్షించారు.

Source:http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%B8%E0%B1%8B%E0%B0%AE%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B2-%E0%B0%98%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B2%E0%B1%8B-2-8-%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%B2-%E0%B0%AE%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%AD%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2-%E0%B0%AA%E0%B1%81%E0%B0%A3%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-20-599515.aspx