73లక్షలు

-12 రోజులు పుష్కలంగా భక్తులు
-సగటున రోజుకు 6లక్షల మంది పుష్కర స్నానం
-నాగార్జునసాగర్‌కు అత్యధికంగా 26లక్షల మంది రాక
జిల్లాలోని రహదారులన్నీ పుష్కర వాహనాల మయం.. కృష్ణా తీరంలోని పుష్కర ఘాట్లన్నీ భక్తజన పూరితం.. పన్నెండు రోజుల కృష్ణా పుష్కర వేడుక ఆద్యంతం కొనసాగిన తీరిది. రోజూ సగటున 6.1 లక్షలు.. 12 రోజుల్లో 73.14 లక్షలు.. వెల్లువలా జిల్లాకు పోటెత్తిన పుష్కర భక్తులు కృష్ణా నదిలో స్నానాలతో పుణ్యం పొందారు. అత్యధికంగా ఒకేరోజు గత ఆదివారం 15లక్షల మంది భక్తులు జిల్లాకు రాగా.. అత్యధికంగా సాగర్ శివాలయం ఘాట్‌లో 20లక్షల మంది పుష్కర స్నానం చేశారు.
నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సాగిన దారులన్నీ కృష్ణ చెంతకే.. కదిలిన జనమంతా పుష్కర స్నానానికే.. 12 రోజుల పాటు జిల్లాలో నెలకొన్న పరిస్థితి ఇది. వివిధ జిల్లాలే కాదు.. పలు రాష్ర్టాలు, విదేశాల నుంచి సైతం భక్తజనం లక్షల సంఖ్య పుష్కర కృష్ణ చెంతకు బారులు తీరింది. ఫలితంగా రాష్ట్రంలోనే తొలి కృష్ణా పుష్కరాల 12 రోజుల వేడుకలో జిల్లా వ్యాప్తంగా 73.14 లక్షల పుష్కర స్నానాలు చేయించింది. ఆది నుంచీ భక్తుల తాకిడి అధికంగానే ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో రద్దీ అనూహ్యంగా పెరిగింది. 12 రోజుల్లో ప్రతిరోజూ జిల్లాకు సగటున 6.10 లక్షల మంది భక్తులు హాజరయ్యారు. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో వాహనాలు జిల్లాకు వచ్చి వెళ్లాయి. జిల్లాలోని ప్రజల్లో సగం కంటే ఎక్కువ మంది పుష్కర స్నానాల్లో పాల్గొన్నారు.

చివరి మూడు రోజుల్లోనే 36 లక్షల మంది
కిక్కిరిసిన రహదారులు.. కిటకిటలాడిన పుష్కరఘాట్లు 12 రోజుల పాటు జల జాతరను తలపించాయి. జన జాతరను మురిపించాయి. 12 రోజుల కృష్ణా పుష్కర తొలి వేడుకలో జిల్లా అంతటా మొత్తం 73.14 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించగా.. అత్యధికంగా నాగార్జున సాగర్‌లోనే 25 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. సాగర్‌లోని ఒక్క శివాలయం ఘాట్‌లోనే 19 లక్షల మంది భక్తులు హాజరుకాగా.. జిల్లాలోని ఏ ఊరిలోనూ అన్ని ఘాట్లను కలుపుకున్నా ఈ సంఖ్యను దాటకపోవడం గమనార్హం. రెండోస్థానంలో 16 లక్షల మంది భక్తుల రాకతో వాడపల్లి నిలవగా.. దర్వేశీపురం, మట్టపల్లి పుష్కరఘాట్లలో 10 లక్షల మంది చొప్పున భక్తులు హాజరయ్యారు.

చివరి మూడు రోజుల్లోనే 36 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు చేయడం విశేషం. ముఖ్యంగా పుష్కరాల పదో రోజు అయిన గత ఆదివారం నాడు ఒకేరోజు 15 లక్షల మంది భక్తులు పుష్కరాల కోసం తరలివచ్చారు. ఆ తర్వాత సోమవారం 11 లక్షలు.. చివరిరోజు మంగళవారం 10 లక్షల మందికి పైగా భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. తొలి తొమ్మిదిరోజుల్లో వచ్చిన భక్తుల సంఖ్యకు.. చివరి మూడు రోజుల్లో వచ్చిన భక్తుల సంఖ్య సమానంగా ఉండడం విశేషం.

పుష్కర వేడుకను అత్యద్భుతంగా నిర్వహించిన యంత్రాంగం
ఆది నుంచీ ప్రభుత్వ తోడ్పాటుతో భారీగా నిధులు సంపాధించడమే కాదు.. పక్కాగా ఏర్పాట్లు చేపట్టిన జిల్లా యంత్రాంగం.. 12 రోజుల కృష్ణా పుష్కర వేడుకను సైతం ఎక్కడా ఎలాంటి పొరపాట్లు, ఇబ్బందులు తలెత్తకుండా ఘనంగా నిర్వహించింది. మంత్రులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పుష్కర పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడమే కాకుండా.. స్వయంగా నిర్వహణను కూడా పరిశీలించిన సంగతి తెలిసిందే. జిల్లా మంత్రి ప్రతిరోజూ ఉన్నతాధికారులతో ఉదయం, సాయంత్రం వివరాలు ఆరా తీసి పక్కా నిర్వహణకు ప్రోత్సహించారు. ప్రభుత్వం కేటాయించిన భారీ నిధులతో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఘనంగా నిర్వహించడంలో విజయం సాధించారు.

ముఖ్యంగా అన్ని ప్రభుత్వ శాఖలను అత్యద్భుతంగా సమన్వయం చేస్తూ అతిపెద్ద వేడుకను విజయవంతంగా ముగించారు. అద్దంలా మెరిసిన అన్ని పుష్కర ఘాట్లు పరిశుభ్రతకు కొత్త అర్థాన్నిచ్చే విధంగా జేసీ సత్యనారాయణ ఆధ్వర్యంలో శానిటేషన్ కార్యక్రమం విజయంవంతంగా కొనసాగింది. పిన్ పాయింట్ శానిటేషన్ విధానంలో 73 లక్షల మంది భక్తులు వచ్చినా అపరిశుభ్రత నెలకొనకుండా చర్యలు చేపట్టడంలో ప్లాన్ పక్కాగా అమలయ్యింది. జిల్లాకు 12 రోజుల్లో లక్షల సంఖ్యలో వాహనాలు తరలి వచ్చినా ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎస్పీ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం పక్కాగా తమ వంతు బాధ్యతను నిర్వర్తించింది.

ఘాట్ల దగ్గర కూడా ఎలాంటి భద్రతా సమస్యలు తలెత్తకపోవడం పోలీసుల పనితీరుకు అద్దం పడుతోంది. దొంగతనాలు జరగకుండా.. మహిళా భక్తులకు ఇబ్బందులు కలగకుండా సీసీ కెమెరాలు, షీ టీమ్‌లు, వాచ్ టవర్లు, డ్రోన్ కెమెరాల ఆద్వర్యంలో అన్ని చర్యలనూ పోలీసు శాఖ విజయవంతంగా నిర్వహించింది. ఘాట్ ఇంచార్జీ అధికారులు, ప్రభుత్వ శాఖల సిబ్బంది, సేవా సంస్థలు తమ వంతు బాధ్యతను పక్కాగా.. బాధ్యతగా కాకుండా సేవా కార్యక్రమంలా నిర్వహించాయి. పుష్కరాలను విజయవంతం చేశాయి. జిల్లా ప్రజల, పుష్కరఘాట్ల సమీప ప్రాంత వాసుల సహకారం కూడా ఎంతో ఉంది.

సమష్టి కృషితో విజయవంతం
– సత్యనారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్
75 లక్షల మంది భక్తులు వచ్చినా అందరి సహాయ సహకారాలతో పుష్కర వేడుకను విజయవంతంగా నిర్వహించుకున్నాం. మొత్తం 15వేల మంది సిబ్బంది, పోలీసులు, 2వేల మంది వాలంటీర్లు 12 రోజుల పాటు తీవ్రంగా శ్రమించారు. ఇంజినీరింగ్ విభాగాల్లో ఎస్‌ఈల నుంచి ఏఈల వరకు ముందు నుంచే పని చేశారు. ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్లూఎస్, డీపీఓ, వైద్యశాఖ, ఆర్టీసీ, విద్యుత్, దేవాదాయ, పోలీసుశాఖ ప్రతి ఒక్కరూ విజయవంతంగా కర్తవ్యాన్ని సేవా కార్యక్రమంలా నిర్వహించారు.

శానిటేషన్ వర్కర్ నుంచి మొదలుకుని అని శాఖల అధికారులు, పోలీసు అధికారులు, ఎస్పీ కలసికట్టుగా చేసిన పనికి ప్రతిఫలమే ఈ ఫలితం. ముఖ్యంగా ఘాట్ల వద్ద నీటి కొరత లేకుండా విడుదల చేసేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న చొరవ.. పుష్కర పనులను అనునిత్యం పర్యవేక్షించిన మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిల ప్రోత్సాహం మరువలేనిది. మంత్రులు స్వయంగా పుష్కరాల నిర్వహణను పరిశీలించడమే కాకుండా.. ప్రతిరోజూ మానిటరింగ్ కూడా నిర్వహించారు. మీడియా సహకారం ఎంతగానో కొనసాగింది. ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

అందరి సహకారంతోనే సఫలీకృతం
– ప్రకాష్ రెడ్డి, జిల్లా ఎస్పీ
మా పోలీసులు, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతోనే పుష్కరాలను విజయవంతంగా నిర్వహించుకోగలిగాం. 12 రోజుల పాటు చాలాపెద్ద ఎత్తున సుమారు 75 లక్షల మంది భక్తులు తరలి వచ్చారు. ఎక్కడ కూడా ఎలాంటి సమస్య లేకుండా అని శాఖల సమన్వయంతో పక్కా ప్లాన్‌తో పని చేశాం. ట్రాఫిక్‌తోపాటు ఘాట్ల వద్ద భద్రతా ఏర్పాట్లు ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించాం. షీ టీమ్స్, సీసీ కెమెరాలతో సునిశితమైన నిఘా కొనసాగించాం. భక్తులకు ఒకటీరెండు రోజులు కొంత ఇబ్బంది నెలకొన్నా.. ఘాట్ల వద్దకు బస్సులు నడిపించడంతో తర్వాత వచ్చిన వారు సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు భక్తుల సహకారం కూడా చాలా అందింది. ఎప్పటికప్పుడు సమాచారం అందించడంలో ప్రత్యేక ఆప్‌తోపాటు మీడియా పాత్ర అమోఘమైనది. అందరికీ కృతజ్ఞతలు.

ఘాట్ల వారీగా హాజరైన భక్తులు
సాగర్ శివాలయం : 19,58,049
ఉట్లపల్లి ఘాట్ : 94,685
వీరాంజనేయ స్వామి : 5,32,273
పొట్టిచెల్మ ఘాట్ : 5,136
సాగర్ మొత్తం : 25,90,143
వాడపల్లి (8ఘాట్లు) : 15,88,586
మట్టపల్లి : 9,21,046
దర్వేశిపురం : 8,86,127
మహంకాళిగూడెం : 2,49,900
పానగల్ : 2,44,718
అడవిదేవులపల్లి : 2,09,363
కాచరాజుపల్లి : 2,68,035
ఇర్కిగూడెం : 88,707
వజినేపల్లి : 74,282
కనగల్ : 73,265
ముదిమాణిక్యం : 64,787
బుగ్గమాదారం : 55,116
కిష్టాపురం : 19,754
అజ్మాపురం : 19,639
పెద్ద మునిగల్ : 14,917
మొత్తం : 73,14,842

Source:http://www.namasthetelangaana.com/Districts/Nalgonda/73%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%B2%E0%B1%81-22-599853.aspx