భక్తులకు బంపర్ హాలీడేస్..

-12రోజుల వేడుకలో ఆరు రోజులు సాధారణ సెలవులే..
కల్చరల్ : కృష్ణా పుష్కరాలకు వెళ్లే భక్తులకు బంపర్ హాలీడేస్ కలిసి రానున్నాయి. నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు జరగనుండగా, ఆరు రోజులు ప్రభుత్వ సెలవులు రానున్నాయి. దీంతో ఆయా రోజుల్లో భక్తుల తాకిడి అధికంగా అవకాశం ఉంది. ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పిస్తుంది. ఈ నెల 12న వరలక్ష్మి వ్రతం విద్యాసంస్థలన్నింటికీ ఐచ్ఛిక తేదీన శనివారం, 14న ఆదివారం, 15న స్వాతంత్య్ర దినోత్సవం, 18న రాఖీపౌర్ణమి, 21న ఆదివారం.. ఇవన్నీ సాధారణ సెలవులే. ఈ రోజుల్లో ఉద్యోగులు, ఇతరులు తమ పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి స్నానాలకు వెళ్లే అవకాశం ఉంది. అదేవిధంగా గోదావరి పుష్కరాలకు వెళ్లలేని జిల్లావాసులు పుష్కరాల్లో స్నానమాచరించి పునీతం కావచ్చు.

సాంస్కృతిక వైభవం..
నీలగిరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న కృష్ణా పుష్కరాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు డీపీఆర్వో డి.నాగార్జున గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వాడపల్లి, మట్టపల్లి, నాగార్జునసాగర్ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో భక్తులను ఆనందపరిచేందుకు తెలంగాణ సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాతోపాటు ఇతర జిల్లాల్లోని భజన బృందాలు, సింధు యక్షగానాలు, ఒగ్గు కళలు, డ్యాన్స్, హరికథ, బుర్రకథ, జానపదాలు, పౌరాణికాలు నిర్వహిస్తారని, మంది కళాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. సాయంత్రం 4గంటల నంచి అర్ధరాత్రి 2గంటల వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Source:
http://www.namasthetelangaana.com/Districts/Nalgonda/%E0%B0%AD%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%AC%E0%B0%82%E0%B0%AA%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B2%E0%B1%80%E0%B0%A1%E0%B1%87%E0%B0%B8%E0%B1%8D-22-596870.aspx

ప్రత్యేక రైళ్లు: భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు

క్లాక్‌టవర్ : కృష్ణా పుష్కారాలకు హాజరయ్యే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులు సైతం సమాయత్తమయ్యారు. రైలు ప్రయాణికుల ఆసక్తి మేరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఈ మేరకు సికింద్రాబాద్ నుంచి కాకినాడ వరకు ఐదు ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. నల్లగొండ జిల్లా పరిధిలోని దామరచర్ల మండలంలోని వాడపల్లి శ్రీఅగస్తేశ్వరస్వామి సన్నిధిలో పుష్కర స్నానానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే విష్ణుపురం, పొందుగుల తాత్కాలిక స్టేషన్లలో పలు రైళ్లను నిలపడానికి ఏర్పాట్లు చేశారు.

Source:
http://www.namasthetelangaana.com/Districts/Nalgonda/%E0%B0%AD%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2-%E0%B0%95%E0%B1%8B%E0%B0%B8%E0%B0%82-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95-%E0%B0%B0%E0%B1%88%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81-22-596872.aspx

పుష్కర సేవకు.. ప్రగతిరథ చక్రం

-జిల్లావ్యాప్తంగా 527 బస్సు సర్వీసులు
-నాగార్జునసాగర్, వాడపల్లి, మట్టపల్లి ప్రాంతాలకు షటిల్ బస్సులు
-హైదరాబాద్ నుంచి 20 రాజధాని(ఏసీ) బస్సుల సేవలు
-ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు అందుబాటులో…
నల్లగొండ, నమస్తే తెలంగాణ : నేటి నుంచి ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాల్లో ఆర్టీసీ సేవలు అందించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ఘాట్ల వద్దకు ప్రయాణికులను చేర్చేందుకు బస్సులను కేటాయించారు. జిల్లాలోని 7 డిపోలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రానున్నందున ఆర్టీసీ సేవలను విస్తరించి ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా ఈ 12 రోజుల్లో ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 527 బస్సులను ఆయా ప్రాంతాల నుంచి ఘాట్లకు నడుపనున్నారు. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి వివరాలను సైతం గురువారం ఆ శాఖ రీజనల్ మేనేజర్ కృష్ణహరి తెలియజేశారు. ఆయా రూట్లలో కేటాయించిన బస్సులు రాత్రి అక్కడే బస చేసి మరునాడు తెల్లవారుజాము నుంచే ప్రయాణికులను అనుకున్న స్థలానికి తీసుకెళ్లనున్నాయి.

ఆయా ఘాట్లలో 527 సర్వీసులు….
జిల్లాలో 29ఘాట్లు ఉండగా, 24 ఘాట్లలో ఆర్టీసీ బస్సులు సేవలు అందించనున్నాయి. జిల్లాలో ఉన్నటువంటి ఏడు బస్ డిపోల ద్వారా 307 బస్సులను, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డిపోల నుంచి 150 బస్సులను నడుపనుండగా, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాల నుంచి మరో 70 బస్సులను నడుపనున్నారు. అయితే ప్రధానంగా నాగార్జునసాగర్‌లో మూడు ఘాట్లు ఉండడంతో అక్కడ జిల్లాకు చెందిన బస్సులతో పాటు ఇతర జిల్లాల నుంచి మొత్తంగా 295, వాడపల్లికి 107, మట్టపల్లికి 100 బస్సులను నడుపనున్నారు. ఇందులో 105 షటిల్ పేరుతో ఉచిత సర్వీస్‌లు మూడు ప్రాంతాల నుంచి ఆయా ఘాట్లకు ప్రయాణికులను తీసుకెళ్లనున్నాయి. వీటిలో మట్టపల్లి ఘాట్ల వద్ద 20, సాగర్ ఘాట్ల వద్ద 60, వాడపల్లి ఘాట్ల వద్ద 25 షటిల్ బస్సులు తిరగనున్నాయి.

మిగిలిన ఘాట్లకూ నడువనున్న బస్సులు…
జిల్లావ్యాప్తంగా 24 ఘాట్లకు బస్సులు నేటి నుంచి ఈ నెల 23 వరకు నడువనున్నాయి. అయితే ప్రధాన ప్రాంతాలైన నాగార్జునసాగర్‌లో-3, మట్టపల్లిలో-3, వాడపల్లిలో-8 ఘాట్లు ఉండగా వీటికి ఎక్కువ స్థాయిలో సర్వీస్‌లు అందుబాటులో పెట్టారు. అయితే కాచరాజుపల్లి ఘాట్‌కు-2 సర్వీసులను ఏర్పాటు చేసిన అధికారులు అజ్మాపురం ఘాట్‌కు-2, పెద్దమునిగాల్‌కు-4, ఉట్లపల్లికి-4, కిష్టాపురం-2, వజినేపల్లి-2, ఇర్కిగూడెం-2, ముదిమాణిక్యం-2, మహంకాళిగూడెం-5 సర్వీసుల చొప్పున ఏర్పాటు చేశారు. ఇవి ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిత్యం తిరగనున్నాయి. జిల్లాలో 29 పుష్కర ఘాట్లుండగా జిల్లా కేంద్రంలోని పానగల్ సమీపంలో ఉన్నటువంటి ఛాయసోమేశ్వర ఆలయం, కనగల్ మండల కేంద్రంలోని పుష్కర ఘాట్‌తో పాటు అదే మండల పరిధిలోని దర్వేశిపురం పుష్కరఘాట్ నిత్యం బస్సులు తిరుగుతుండడంతో సర్వీసులు ఏర్పాటు చేయలేదు. ఇక దామరచర్ల మండలంలోని అడవిదేవులపల్లి, మేళ్లచెరువు మండలంలోని బుగ్గమాదారం ఘాట్లకు వెళ్లే అవకాశం ఉండడంతో బస్సు సౌకర్యం కల్పించలేదు.

Source:
http://www.namasthetelangaana.com/Districts/Nalgonda/%E0%B0%AA%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0-%E0%B0%B8%E0%B1%87%E0%B0%B5%E0%B0%95%E0%B1%81-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%97%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B0%E0%B0%A5-%E0%B0%9A%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82-22-596874.aspx

సాగరం చెంత.. భక్తజనుల పులకింత…

-పుష్కరాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నజడ్పీ చైర్మన్ బాలూనాయక్, ఎమ్మెల్యే రవీంద్రకుమార్
-పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం
దేవరకొండ, నమస్తేతెలంగాణ/చందంపేట: కృష్ణానదిలో పుష్కరుని ఆగమన వేళ.. నల్లమ ల తీరం ఆధ్యాత్మిక తరంగాలతో తడిసిముద్దయి ంది. వేద మంత్రోచ్ఛరణల నడుమ హారతుల తో పుష్కరాల కు స్వాగతం పలకగా.. కృష్ణమ్మ దీవెనల కోసం భక్త జనం తరలివచ్చి పవిత్ర స్నానాలాచరించారు. దేవరకొండ నియోజకవర్గంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్లు చందంపేట మండలం పెద్దమునిగల్, కాచరాజుపల్లి ఘా ట్లకు, పీఏపల్లి మండలంలోని అజ్మాపూర్ పుష్కర ఘాట్ల వద్దకు అశేష భక్తజనం తరలివచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున 5.58 గంటలకు పుష్కరాల సంర ం భం ఆరంభం కాగా పెద్దమునిగల్ ఘాట్ వద్ద పు ష్కరాల ప్రారంభోత్సవంలో జడ్పీ చైర్మన్ నేనావత్ బాలూనాయక్ పాల్గొన్నారు.దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తన సతీమణి శ్యామల ఇతర కుటుంబసభ్యులతో కలిసి ఇక్కడే పుష్కరాల్లో పాల్గొన్నారు.

కాచరాజుపల్లి వద్ద పుష్కరాలను బావోజి బిక్కునాయక్, సర్పం చు మంగమ్మలు ప్రారంభించగా, పీఏపల్లి మం డలం అజ్మాపురం వద్ద పుష్కరాలను ఎంపీపీ మేడారం రాజమ్మ, సర్పంచు రామకృష్ణలు లాంఛనంగా ప్రారంభించారు. పుణ్య స్నానాలనంతరం కాచరాజుపల్లి వద్ద ఉన్న శివాలయాన్ని, పెద్దమునిగల్ ఘాట్ వద్ద తుల్జాభవాని ఆలయాన్ని, అజ్మాపూర్ ఘాట్ వద్ద గంగమ్మ దేవాలయాన్ని భక్తులు దర్శించుకుని పరవశులయ్యారు.

వేద మంత్రాలతో హారతి
అర్చకులు కృష్ణానదికి హారతులివ్వడంతో పుష్కరాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. మంగళ వాయిద్యాలు మారుమోగుతుండగా వేద మంత్రోచ్చారణలు మిన్నంటగా నదీ హారతులు భక్తులకు పరమానందాన్ని పంచాయి. పుష్కర స్నానాలచరించేందుకు వచ్చిన జడ్పీ చైర్మన్ నేనావత్ బాలూ నాయక్, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌లకు పంప్రదాయ పద్దతిలో అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం వారు తుల్జాభవాని దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తన సతీమణితో ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం వస్త్రదానం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఘాట్ ప్రాంగణమంతా కలియతిరిగిన ఎమ్మెల్యే భక్తుల కోసం ఏర్పాటుచేసిన వసతులు, సదుపాయాలను పరిశీలించారు.

అధికారయంత్రాంగం సమీక్ష
పెద్దమునిగల్ ఘాట్ ప్రాంతాన్ని ఘాట్ల జిల్లా స్పెషల్ ఆఫీసర్ వికాస్‌రాజ్, నాగార్జునసాగర్ ప్రాజెక్టు సీఈ సునీల్‌కుమార్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణలు సందర్శించారు. భక్తుల కోసం ఏర్పాటుచేసిన తాగునీటి వసతి, వైద్య సదుపాయం తదితర ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని వారు ఈ సందర్భంగా ఇక్కడి అధికారులకు సూచించారు. ఆర్డీఓ గంగాధర్, డీఎస్పీ చంద్రమోహన్‌ల పర్యవేక్షణలో ఘాట్ల ఇన్‌ఛార్జిలు చంద్రశేఖర్, గోపాల్‌రావు, తహసీల్దార్లు హుస్సేన్, హన్మానాయక్, అలివేలు, ప్రమోదిని, ఎంపీడీఓ రామకృష్ణ, సీఐ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్‌ఐ, వివిధ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను సమీక్షించే పనుల్లో నిమగ్నమయ్యారు.

Source:
http://www.namasthetelangaana.com/Districts/Nalgonda/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%97%E0%B0%B0%E0%B0%82-%E0%B0%9A%E0%B1%86%E0%B0%82%E0%B0%A4-%E0%B0%AD%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B0%9C%E0%B0%A8%E0%B1%81%E0%B0%B2-%E0%B0%AA%E0%B1%81%E0%B0%B2%E0%B0%95%E0%B0%BF%E0%B0%82%E0%B0%A4-22-597177.aspx

పుష్కర వాడపల్లి…

-కృష్ణవేణికి పూజలు..
-దామరచర్ల మండలంలో ఘనంగా కృష్ణా పుష్కరాలు ప్రారంభం
-పుష్కరస్నానం ఆచరించిన ఎంపీ గుత్తా, ఎమ్మెల్యే భాస్కర్‌రావు
-ఐజీ నాగిరెడ్డి, కలెక్టర్ పర్యవేక్షణ
మిర్యాలగూడ, నమస్తే తెలంగాణ: కృష్ణానది తీరంలో దామరచర్ల మండలంలో ఏర్పాటు చేసిన 11ఘాట్ల వద్ద శుక్రవారం తెల్లవారుజామున పుష్కరాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. వాడపల్లి వీఐపీ ఘాట్ వద్ద తెల్లవారుజామున ఐదు గంటలకు పురోహితులు, అర్చకులు వేదమంత్రాలతో పుష్కరుడిని ఆహ్వానించారు. ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే నలమోతు భాస్కర్‌రావు, ఏజేసీ వెంకట్రావ్, ఆలయ కమిటీ చైర్మన్ కె.సిద్ధయ్య, ఈఓ మృత్యుంజయశాస్త్రి పూజలను చేయించారు. అనంతరం వారిచే నదిలో పుష్కరస్నానం చేయించి నదికి హారతి ఇచ్చారు.

అనంతరం శ్రీమీనాక్షీ అగస్తేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. దీనితో పాటుగా పాతపోలీస్‌స్టేషన్ ఘాట్‌వద్ద స్థానిక సర్పంచ్ దేవండ్ల వరమ్మ, సుబ్బయ్య, వైస్ సర్పంచ్ వీ సైదయ్య మండలంలోని అడవిదేవులపల్లిఘాట్ వద్ద ఎంపీపీ కే.మంగమ్మ, చినరామయ్య పుష్కరాలను ప్రారంభించారు. వాడపల్లిలో ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు మిర్యాలగూడ మున్సిపల్ చైర్‌పర్సన్ నాగలక్ష్మీ భార్గవ్, వేములపల్లి ఎంపీపీ నామిరెడ్డి రవీనాకరుణార్‌రెడ్డి, జడ్పీటీసీ కే.శంకర్‌నాయక్ తదితరులు పుష్కరస్నానాలు అచరించారు. టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి పుష్కర ఏర్పాట్లు పరిశీలించారు.

Source:
http://www.namasthetelangaana.com/Districts/Nalgonda/%E0%B0%AA%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B0%AA%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF-22-597181.aspx

నల్గొండ : ఇతర ప్రాంతాల సర్వీసులు రద్దు

కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపించాల్సి ఉన్నందున గ్రామీణ, ఇతర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులను ఈ నెల 12 నుంచి 23 వరకు రద్దు చేసినట్లు డిపో మేనేజర్ జువ్వాది బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ డిపో పరిధిలో యల్లమ్మగూడెం, పందెనపల్లి, నక్కలపల్లి, తక్కెళ్లపాడు, గురజాల, మనిమిద్దె, కాసనగోడు, పులిపలుపుల, ఊకొండి, మారుపాక, బొల్లేపల్లి, ముక్కాముల, కుదాబక్షుపల్లి, గడ్డికొండారం, నర్సింగ్‌బట్ల, రేగట్టె, అప్పాజిపేట, ఎర్రవల్లి, కామారెడ్డిగూడెం, తంగెల్లవారిగూడెం, ఊట్కూర్, నకిరేకల్, మనిమిద్దె, రాజుపేట, మోత్కూర్, మాచర్ల బస్సులను రద్దు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా చండూరు-మాల్, గట్టుప్పల్-చౌటుప్పల్, మునుగోడు-చౌటుప్పల్, భద్రాచలం-సూర్యాపేట, భువనగిరి, దేవరకొండ, మిర్యాలగూడెం రూట్లలో బస్సుల సంఖ్య తగ్గించినట్లు తెలిపారు.

Source:
http://www.namasthetelangaana.com/Districts/Nalgonda/%E0%B0%87%E0%B0%A4%E0%B0%B0-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B1%80%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B0%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B1%81-22-596873.aspx

నాగార్జునసాగర్ : మంత్రాలతో కృష్ణమ్మకు హారతి

నాగార్జునసాగర్ వద్ద శుక్రవారం ఉదయం 5.58 నిమిషాలకు పుష్కరాలు ప్రారంభం కావడంతో సాగర్ శివాలయం పుష్కరఘాటు వద్ద శివాలయం అర్చకులు సుధాకర్‌శాస్త్రీ ఆధ్వర్యంలో వేదపండితులు కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణమ్మకు వాయినం సమర్పించి, అమ్మవారికి హారతిని ఇచ్చారు. కృష్ణమ్మ హారతి కార్యక్రమములో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని హారతిని అందుకున్నారు. అ ర్చకులు సుధాకర్‌శాస్త్రీ మాట్లాడుతూ పుష్కరాలలో ప్రజలు పాల్గొన్ని పుణ్యస్నానాలు ఆ చరించడం ద్వారా పుణ్యం లభిస్తుందన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారి కి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.

Source:
http://www.namasthetelangaana.com/Districts/Nalgonda/%E0%B0%B5%E0%B1%87%E0%B0%A6-%E0%B0%AE%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%95%E0%B1%81-%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B0%BF-22-597176.aspx

పుకార్లను నమ్మి పరుగులు తీయొద్దు : ఎస్పీ(నల్గొండ జిల్లా)

భక్తులు పుకార్లను నమ్మి ఘాట్ల వద్ద పరుగులు తీయవద్దని, ఎలాం టి పుకార్లు వచ్చినా ఘాట్ సమీపంలో ఉన్న పోలీస్ కంట్రోల్‌రూమ్‌కు తెలియజేయాలని జిల్లా ఎస్పీ ప్రకాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలోని పుష్కరఘాట్లతో పాటు పానగల్ ఘాట్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తొలిసారిగా కృష్ణాపుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. కృష్ణా పుష్కరాల నిర్వహణకు జిల్లాను 7 సెక్టార్లుగా విభజించి 6,754 మంది పోలీస్ సిబ్బంది, 2088 మంది స్వచ్ఛంద కార్యకర్తలతో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించామన్నారు. మొదటి రోజు పుష్కర స్నానాలకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు నిర్వహించినట్లు వెల్లడించారు. శనివారం నుంచి పుష్కరాలకు వచ్చే భక్తుల సంఖ్య లక్షలకు పైగా పెరుగుతుందని భావిస్తున్నామని, అయినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

జిల్లాలో ఉన్న 28ఘాట్లలో సుమారు 79 వేల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారన్నారు. జిల్లాలో 9 ట్రాఫిక్ రీడింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి జిల్లాలోకి వచ్చి పోయే వాహనాలు లెక్కిస్తు ముందస్తుగా ట్రాఫిక్ అంచనాలు వేస్తున్నామన్నారు. జిల్లాలో ఉన్న 33 పార్కింగ్ పాయింట్లలో శుక్రవారం 1800 బైక్‌లు, 450 మూడు చక్రాల వాహనాలు, 1500 నాలుగు చక్రాల వాహనాలు , 190 బస్‌లు, 25 లారీలు, 23 హోర్డింగ్ పాయింట్ల నందు 300 భారీ వాహనాలను నిలిపివేయడం జరిగిందన్నారు. హైదారాబాద్ నుంచి నాగార్జునసాగర్ మీదుగా మాచర్ల వెళ్లే వాహనాలు, గూడ్స్ వాహనాలను హోర్డింగ్ ప్రాంతాలలో నిలిపివేయడం జరుగుతుందన్నారు. వాహన డ్రైవర్లు, రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు జిల్లా సరిహద్దు దాటిపోవాలని, ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించాలన్నారు.

Source:
http://www.namasthetelangaana.com/Districts/Nalgonda/%E0%B0%AA%E0%B1%81%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%A8%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BF-%E0%B0%AA%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%A4%E0%B1%80%E0%B0%AF%E0%B1%8A%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B1%81-%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AA%E0%B1%80-22-597178.aspx

పటిష్ట బందోబస్తు : ఐజీ నాగిరెడ్డి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఐజీ నాగిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన దామరచర్ల మండలం వాడపల్లిలో శివాలయం పుష్కరఘాట్‌ను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని 28పుష్కరఘాట్లలో 6754 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఘాట్ వద్ద 300 మంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. అదేవిధంగా మరో 3వేల మంది వలంటీర్లు, ఎన్‌డీఆర్‌ఎఫ్ టీంలు పుష్కరసేవలు అందిస్తున్నారని తెలిపారు. ఆయన వెంట ఏఎస్పీ గంగారాం, డీఎస్పీ శృతకీర్తి, సీఐ పాండురంగారెడ్డి ఉన్నారు.

Source:
http://www.namasthetelangaana.com/Districts/Nalgonda/%E0%B0%AA%E0%B0%9F%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F-%E0%B0%AC%E0%B0%82%E0%B0%A6%E0%B1%8B%E0%B0%AC%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81-%E0%B0%90%E0%B0%9C%E0%B1%80-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%97%E0%B0%BF%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF-22-597180.aspx

తరాల వారధిగా పుష్కరాలు – పీఠాధిపతి కమలానందభారతి స్వామి

మానవ జీవన విధానంలో పుష్కరాలు తరాల మధ్య వారధిగా వస్తున్నాయని హిందూ దేవాలయాల సంస్థాన పీఠాధిపతి కమలానందభారతి అన్నారు. సమాజం సుభిక్షంగా ఉండాలని సర్వదేవతలను ప్రార్థిస్తున్నానని చెప్పారు. పుష్కరఘాట్‌లో కమలానందభారతి మాట్లాడుతూ, పుష్కరాల్లో నదీ స్నానం, పిండప్రదానం అనే రెండు విధానాలు ఉంటాయని చెప్పారు. మానవ జీవన వ్యవస్థలో వంశాలు ఏర్పడ్డాయని, పాతతరాలను స్మరించుకోవడం ఆచారంగా వస్తున్నదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న కృష్ణాపుష్కరాలను సీఎం కేసీఆర్ శాస్త్రీయంగా ఆచరణీయం చేశారని కమలానందభారతి ప్రశంసించారు. నియమనిష్ఠలతో పాలకులు ధర్మసంస్కృతులను ఆచరించడం వల్ల ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందన్నారు.

Source:
http://www.namasthetelangaana.com/LatestNews-in-Telugu/pontiff-kamalananda-bharti-on-krishna-pushkaralu-1-1-501009.html