Krishna Pushkaralu – 2016 in Telugu

nalgonda

Krishna Pushkaralu – 2016 in English

Krishna Pushkaralu – 2016 in English

తెలంగాణా కృష్ణా పుష్కరాలు-మహాబూబ్ నగర్2016

తెలంగాణా కృష్ణా పుష్కరాలు-నల్గొండ 2016

పుష్కరాలకు భారీ ఏర్పాట్లు

– ఓస రాజేష్‌

పశ్చిమ కనుమలలో సహ్యాద్రిలో మహాబలేశ్వరంలో ‘కృష్ణ అంశ’తో జన్మించింది.’కృష్ణా నది’. సహ్యాద్రిలో పరమేశ్వర అంశంతో వేణీనది అవతరించింది. ఎప్పుడైతే కృష్ణ, వేణీ అన్న ఈ రెండు నదులు కలిసి కృష్ణవేణీ నదిగా అవతరించిందో అప్పుడే ఆ రెండు నదులు వాటి ఆరంభస్థానం నుండి అవి సంగమించువరకు మాత్రమే పరిమితమై వాటివాటి పేర్లతో ఆయా స్థానాలలో మాత్రమే వ్యవహరించబడతాయి. ఆ రెండు కలిసిన కృష్ణ వేణీ నది మాత్రం తూర్పున సాగరసంగమం కృష్ణ వేణీ మహానదిగా వ్యవహరించబడుతుంది. ఆ విధంగా ఆవిర్భవించిన కష్ణవేణీ మహానది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో ప్రయాణించి చివరకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించి పలు జిల్లాలను పావనం చేస్తూ దివిసీమలో వైష్ణవక్షేత్రమగు హంసల దీవిలో సాగరసంగమం చేస్తున్నది. కృష్ణ అనే ప్రాంతం వద్ద కృష్ణా నది తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌ నగర్‌, నల్గొండ జిల్లాల్లో 281 కి.మీ మేర ప్రవహిస్తుంది. కృష్ణ గ్రామంలోని దత్తాత్రేయ స్వామి ఆలయం పవిత్ర క్షేత్రంగా విలసిల్లుతుంది.

కృష్ణమ్మ చెంతకు పుష్కరుడు చేరే సమయం ఆసన్నమైంది. కన్యారాశిలో బహస్పతి ప్రవేశిస్తున్న శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం శ్రావణ మాసం ఆగస్టు 12 వతేదీ నుంచి 23 వరకు 12 రోజుల పాటు కృష్ణ పుష్కర పుణ్య కార్యక్రమంతో భక్తి సిరులు తెలంగాణ జీవగడ్డ అంతటా ప్రసరించబోతున్నాయి. ఆగస్టు 12 న సుర్యోదయ సమయంలోకృష్ణ పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో కృష్ణా నది ఒడ్డున వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భక్త జనం పోటెత్తనుంది. కోటాను కోట్ల మంది భక్తులు కృష్ణా నది స్నానం కోసం పుష్కర ఘాట్లకు తరలిరానున్నారు. దీంతో పుష్కర ఘాట్లు ప్రత్యేక శోభతో విరాజిల్లనున్నాయి. జీవనదిగా పేరున్న కృష్ణమ్మ పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది.

స్వరాష్ట్రంలో తొలిసారి జరగనున్నకృష్ణా పుష్కరాలను నభూతో నభవిష్యత్తు అన్న రీతిలో కుంభమేళాను తలపించే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పుష్కరాల్లో ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడే విధంగా కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం భారీ కార్యాచరణ రూపొందించింది. గోదావరి పుష్కరాల స్పూర్తితో కృష్ణమ్మకు కూడా ఘనంగా పుష్కరాల పండుగ నిర్వహించేం దుకు సర్వం సిద్ధం చేసింది. దేశ వ్యాప్తంగా కోట్లాది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున కట్టుదిట్టమైన ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది.గోదావరి పుష్కరాలు తెలంగాణ ప్రభుత్వ కీర్తి ప్రతిష్టలను పెంచాయి. దీంతో గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించిన అనుభవంతో కృష్ణ పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ఈ ఏడాది జనవరి నుంచే పుష్కరాలకు ప్రభుత్వం సన్నధ్దమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌, సీయస్‌ రాజీవ్‌ శర్మ కూడా పుష్కర ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

పుష్కరాలకు భారీ ఏర్పాట్లు

పన్నెండేళ్లకోసారి వచ్చేకృష్ణా పుష్కర మహోత్సవాన్ని వందేళ్లు గుర్తుంచుకునేలా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ పట్టుదలగా ఉన్నారు. అందుకు తగ్గట్టుగా పుష్కర ఏర్పాట్ల కోసం భారీ ఎత్తున నిధులు కేటాయించారు.కృష్ణా పుష్కరాల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 825 కోట్లను కేటాయించింది. 14 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అధికారులు పనులను చేపట్టారు. రహదారుల నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులను కూడా యుద్ధ ప్రాతిపాదికన చేపట్టడం జరిగింది. ఆర్‌ అండ్‌ బీ శాఖ రూ.398 కోట్లు,పంచాయతీ రాజ్‌ శాఖ రూ.133 కోట్లతో రహదారుల నిర్మాణం,రోడ్డు విస్తరణ పనులు చేపట్టింది. తాగు నీరు, పారిశుద్ధ్య నిర్వహణకు కూడా ఆర్‌ డబ్ల్యూ ఎస్‌ శాఖకు రూ.38 కోట్లు, పంచాయతీ రాజ్‌ విభాగానికి రూ.10.22 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.అన్ని పుష్కర ఘాట్లు, ఆలయ ప్రాంతాల్లో శుద్ధ జల ప్లాంట్లను ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల తాత్కాలిక, మరికొన్ని చోట్ల శాశ్వత ప్రాతిపదికన మరుగుదొడ్లను నిర్మించారు. స్నాన ఘట్టాల వద్ద అపరిశుభత్రకు తావు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.మహిళా భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లను చేసింది.

భారీగా పెరిగిన పుష్కర ఘాట్లు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో పుష్కరాలు అంటే విజయవాడ ,రాజమండ్రి అని మాత్రమే అందరు అనుకునే వారు. గత ప్రభుత్వాలు పెద్దగా నిధులు కేటాయించకపోవడంతో పుణ్య స్నానమాచరించేందుకు విజయవాడకు వెళ్లేవారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక పుష్కరాలకు ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించింది. ఇంతకు ముందు నల్గొండ,మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లో కేవలం 28 పుష్కర ఘాట్లు ఉండగా, ఈసారి వాటికి అదనంగా 58 ఘాట్లను కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 86 ఘాట్లను 4852 మీటర్ల పొడవుతో నిర్మించడం జరిగింది. రెండు జిల్లాల్లో ఘాట్ల నిర్మాణం, మరమ్మత్తుల కోసం ప్రభుత్వం రూ.212కోట్లు కేటాయించింది.

భక్తుల సౌకర్యాలకు పెద్ద పీట

కృష్ణ పుష్కరాలకు సుమారు మూడున్నర కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లను చేశారు. స్నాన ఘట్టాల వద్ద భక్తుల సౌకర్యం కోసం వస్త్రాలు మార్చుకునేందుకు ప్రత్యేక డ్రెస్‌ చేంజింగ్‌ రూమ్స్‌, షవర్‌ బాత్‌ చేసేందుకు షవర్స్‌ ను ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణ నది లో లోతు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మత్స్య శాఖ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లను, మర బోట్లను సిద్ధంగా ఉంచనున్నారు. పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి ఎక్కడా పార్కింగ్‌ సమస్య తలెత్తకుండా పుష్కర ఘాట్లకు కొద్ది దూరంలో పార్కింగ్‌ కోసం పోలీసు శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. భక్తులు అసౌకర్యానికి గురికాకుండా ప్రధాన రహదారులపై సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.ఎక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటన జరగకుండా 15 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్‌ రూంలు, కాల్‌ సెంటర్లు, పెద్ద ఎత్తున సీసీ కెమరాలను కూడా ఏర్పాటు చేశారు. వీఐపీలకు కూడా కట్టుదిట్టమైన భద్రతా విధానాన్ని అమలు చేశారు.

పుష్కరాలకు ప్రత్యేక బస్సులు, రైళ్లు

కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థతో పాటు దక్షిణ మధ్య రైల్వే శాఖ కూడా ప్రత్యేక రైళ్లను నడపనుంది.. పుష్కరాలు జరగనున్న పన్నెండు రోజులు భక్తుల కోసం 1149 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌,రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్గొండ, వరంగల్‌ సహా ఇతర రీజియన్లను కలుపుకుని వెయ్యి ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ లగ్జరీ బస్సులతోపాటు మరో వంద ఏసీ బస్సులను పుష్కర ఘాట్ల వరకు టిఎస్‌ ఆర్టీసీ నడిపించనుంది. దక్షిణ మధ్య రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాల్లో 238 ప్రత్యేక రైళ్లను వివిధ స్టేషన్ల నుంచి నడపనుంది.

ముస్తాబవుతున్న ఆలయాలు

పుష్కరాల నేపథ్యంలో దేవాలయాల సుందరీకరణపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ప్రత్యేక దష్టి సారించారు. ఆలయాల జీర్ణోద్ధరణకు దేవాదాయ శాఖ కు సీయం ప్రత్యేకంగా రూ. 4.54 కోట్లు కేటాయించారు.దీంతో నల్గొండ ,మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లోని ప్రముఖ ఆలయాలను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు.. దైవ దర్శనం కోసం భక్తులు బారులు తీరే అవకాశం ఉన్నందున ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. దేవాలయాల వద్ద ఆధ్యాత్మికత కార్యక్రమాలతో పాటు సాంస్కతిక శాఖతో కలిసి సాంస్కతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

దేశంలో ఉన్న శక్తి పీఠాల్లో జోగులాంబ ఒకటి. కేసీఆర్‌తో పాటు గవర్నర్‌ ఈ క్షేత్రానికి సమీపంలో ఉన్న గొందిమల్ల పుష్కర్‌ ఘాట్‌లో పుణ్య స్నానమాచరించే అవకాశం ఉంది. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో బీచుపల్లి-ఆంజనేయ స్వామి ఆలయం, రంగాపూర్‌ – ఆంజనేయ స్వామి , ఆలంపూర్‌-జోగులాంబ శక్తి పీఠం, సోమశిల – లలితాంబిక అమ్మవారు, కృష్ణ – దత్తాత్రేయ స్వామి, గుందిమల్ల, నల్గొండ జిల్లాలో మట్టపల్లి – లక్ష్మీ నర్సింహ స్వామి ,వాడపల్లి – మీనాక్షీ అగస్త్యేశ్వర స్వామి, నాగర్జున సాగర్‌ – ఏలేశ్వర మాధవ స్వామి, చాయ సముద్రంకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది.

Source:

http://magazine.telangana.gov.in/పుష్కరాలకు భారీ ఏర్పాట్లు/

కృష్ణవేణి తీరంలో పవిత్ర క్షేత్రాలు

– దాసరి దుర్గాప్రసాద్‌

గత సంవత్సరం గోదావరి పుష్కరాలు జరుపుకున్నాం. జూలై నెల 30 తేదీ నుంచి గోదావరి అంత్య పుష్కరాలు కూడా జరుపుకున్నాం. గోదావరి అంత్య పుష్కరాలు పూర్తయిన నాటి నుంచి ప్రారంభమయ్యే మరో పుష్కరాలు కృష్ణా పుష్కరాలు. దేవగురువు బృహస్పతి ఒక్కొక్క రాశిలో ఒక్కో సంవత్సరం చొప్పున సంచరిస్తూ ఉంటాడు. ఆయన ఏ రాశిలో సంచరిస్తాడో, అప్పుడు ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలు వస్తాయి. అంటే బృహస్పతి సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరీ పుష్కరాలు, కన్యారాశిలోకి అడుగుపెట్టినప్పుడు కృష్ణా నదికి పుష్కరాలు వస్తాయి. కృష్ణా నదికి 2016 ఆగస్టు 12 నుంచి పుష్కరాలు ప్రారంభమై 12 రోజుల పాటు కొనసాగుతాయి. కృష్ణా నది శ్రీమహావిష్ణువు శరీరం. శివుని అష్టమూర్తులలో ఒకటైన జలస్వరూపం. శివకేశవ స్వరూపం. ఇది అత్యంత మహిమాన్వితమైనదని, దీనిలో స్నానాల వల్ల మహాపాపాలను పోగొడుతుందని పురాణ వచనం. పుష్కరాల సమయంలో కృష్ణలో స్నానాదులు, పూజలు, దానధర్మాలు, పితృ దేవతలకు పిండప్రదానాలు, జపాలు చేస్తే పుణ్య ఫలాలు సంప్రాప్తిసాయని పురాణాలు చెబుతున్నాయి. పుష్కరాలలో నదీ స్నానం చేస్తే పన్నెండు సంవత్సరాలపాటు ఆ నదులలో నిత్యం స్నానం చేసినంత పుణ్య ఫలం లభిస్తుందంటారు. అలాగే జన్మజన్మల పాపాలూ నశించి, మోక్షప్రాప్తి కలుగుతుంది. ఏ నదికి పుష్కరాలు వస్తాయో ఆ నదిపేరును మనం స్నానం చేసేటప్పుడు ముమ్మారు మనస్సులో తలచుకున్నా కొంతమేర పుష్కర స్నానఫలితం పొందచ్చునని శాస్త్రవచనం.
పుష్కర కాలంలో చేసే ఆయా కర్మల వలన శారీరక, మానసిక మలినాలు తొలగి పవిత్రత, ఆధ్యాత్మిక తేజస్సు కలుగుతాయి. బంగారం, వెండి, భూమి, ధనం, గోవులు, ధాన్యం, లవణం, రత్నాలు, అశ్వం, పండ్లు, బెల్లం, వస్త్రాలు, తైలం, కూరగాయలు, తేనె, పీట, అన్నం, పుస్తకం … ఇలా ఎవరి శక్తిని బట్టి వారు ఈ పుష్కర సమయంలో దానం చేస్తే పుణ్య ఫలాలు సిద్ధిస్తాయంటారు.
మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వతశ్రేణిలో మహాబలేశ్వరం వద్ద ఉద్భవించిన కృష్ణా నది మహాబలేశ్వర లింగం పైనుంచి ప్రవహించి నదిగా మారింది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల గుండా ప్రవహించి ఆంధ్రప్రదేశ్‌లోని హంసలదీవి మీదుగా ఏటిమొగ, ఎదురుమొండి వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. తుంగభద్ర, వేణి, మూసీ, దిండి, పాలేరు, మున్నేరు దీనికి ఉప నదులు. వీటిలో తుంగభద్ర, మూసీ నదులు ఇతర జీవ నదులకు మల్లే ప్రఖ్యాతి చెందాయి. కృష్ణానది పుష్కర కాలంలో ఆయా నదిలో స్నానాదికాలు, జప, తపాలతో పాటు ఆయా నదికి సమీపంలో ఉన్న ఆలయాల సందర్శనం ఆధ్యాత్మికానందాన్ని సొంతం చేయడంతో పాటు, మానసికానందన్నిచ్చి, పుణ్య ఫలాలు సొంతమవుతాయని పెద్దలు చెబుతారు. ఆకారణంగా నదికి సమీపంలోనూ, నది ఒడ్డున ఉన్న ఆలయాల సందర్శనం సర్వ విధాల మేలు చేస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. మహారాష్ట్ర నుంచి కర్ణాటక లోకి ప్రవేశించిన కృష్ణా నది మహబూబ్‌ నగర్‌ జిల్లాకు సమీపంలో మక్తల్‌ మండలంలో తెలంగాణలోకి ప్రవేశిస్తుంది.

దత్తాత్రేయ స్వామి దేవాలయం – వల్లభాపురం(మక్తల్‌ )

మహబూబ్‌ నగర్‌ జిల్లా మక్తల్‌ మండల కేంద్రంలో గల వల్లభాపురం గ్రామంలో వెలసిన మహిమాన్వితమైన దత్తాత్రేయ క్షేత్రం శ్రీపాద శ్రీవల్లభ స్వామి దేవాలయం . దత్తాత్రేయ స్వామి మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి వెలసిన క్షేత్రమిది. శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మ స్థలం పిఠాపురం అయితే తన తపస్సు, ధ్యానం అన్ని కురవాపురం లోనే జరిగాయని పురాణాల ద్వారా అవగతమవుతోంది. వల్లభాపురం తెలంగాణా, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న మహిమాన్విత దత్త క్షేత్రం. కృష్ణా నదికి ఇవతలి వైపు వల్లభాపురం ఉండగా, అవతలి వైపు కురువాపురం ఉంటుంది.
కృష్ణా నది సమీపంలో వెలసిన మహిమాన్విత దత్త పీఠమిది. శ్రీపాద శ్రీవల్లభ స్వామి దేశమంతా తిరుగుతూ, ఈ క్షేత్రానికి వచ్చి కొన్ని రోజులు ఇక్కడ నివాసముండి భక్తుల కష్టాలు తీర్చాడట.

కష్టాలు, కలతలతో బాధపడేవారు, దుష్ట శక్తుల బారి నించి విముక్తి కోరుకునేవారు ఇక్కడ స్వామిని పూజిస్తే కోరికలు నెరవేరుతాయని స్థల పురాణం చెబుతోంది.

కురుపురం, కురువాపురం, కురుంగడ్డ తదితర పేర్లతో పిలుచుకునే శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రం తెలంగాణ కర్ణాటక సరిహద్దులో ఉంది. మక్తల్‌ నుంచి అనుగొండ వెళ్ళే బస్సులో పంచదేవ్‌ పహాడ్‌ గ్రామాన్ని చేరుకుని అక్కడ నుంచి సమీపంలోనే ఉన్న కురుపురం చేరుకోవచ్చు. కురుపురం ఒక ద్వీపంలో ఉంది. చుట్టూ కృష్ణా నది. ఈ నది దాటితే స్వామి వారి ఆలయం ఉంది. శ్రీపాద శ్రీవల్లభులు చాలా సంవత్సరాలు కురుపురంలో తపస్సు చేశారు. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి తపస్సు చేసిన ఈ ప్రాంతంలో ఒక చిన్న ఆలయం ఉంది. సమీపంలోనే వాసుదేవానంద సరస్వతి స్వామి వారు తపస్సు చేసిన గుహ, శివాలయం దర్శించుకోవచ్చు. కురు మహారాజుకు జ్ఞాన సిద్ది కలిగిన ప్రదేశం కాబట్టి కురుపురమనే పేరు వచ్చింది. దీనికి సమీపంలోనే పంచదేవ పహాడ్‌ ఉంది. మక్తల్‌ మండలంలో ఉన్న ఈ క్షేత్రంలో పాండురంగ స్వామి, శ్రీలక్ష్మీనరసింహ స్వామి, ఆంజనేయ స్వామి, రాఘవేంద్ర స్వామి, వినాయకునితో పాటు అనఘ దత్త దేవాలయాలు ఒకే చోట దర్శనమిస్తాయి.

ఆంజనేయ స్వామి ఆలయం, బీచుపల్లి

మహబూబ్‌ నగర్‌ జిల్లా ఇటిక్యాల మండలం కృష్ణా నది ఒడ్డున బీచుపల్లి గ్రామంలో వెలసిన మహిమాన్విత ఆలయమిది. పదహారవ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం, తొమ్మిదవ శతాబ్దానికి చెందిన చోళ రాజ్యంలో ప్రాచుర్యం పొందిందని ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. ఇక్కడ స్వామిని బీచుపల్లిరాయుడని భక్తులు భక్తితో పిలుచుకుంటారు. ఇక్కడ ఈ ఆలయంలో స్వామివారి మొదటి పూజను బోయవారు చేయడం ఈ ఆలయం విశేషంగా చెబుతారు. స్వామి వారి ఆదేశం మేరకు ఈ సంప్రదాయం ఇలా కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఇక్కడ స్వామివారిని వ్యాస రాయల వారు ప్రతిష్ఠించినట్లు ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. అలాగే రెండు శతాబ్దాల క్రితం గద్వాల రాజులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. గర్భాలయంలో స్వామివారి మూర్తితోపాటు ఎడమ వైపున మహేశ్వర లింగం, కుడివైపున సీతా లక్ష్మణ సహిత శ్రీరాముడు కొలువుదీరి ఉన్నారు.

సోమేశ్వర స్వామి ఆలయం, సోమశిల:

మహబూబ్‌ నగర్‌ జిల్లా కొల్లాపూర్‌ గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమశిలలో సోమేశ్వర స్వామి ఆలయం ఉంది. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాల నేపధ్యంగా అలరారుతున్న ఈ దివ్యాలయం ప్రాంగణంలోని కృష్ణా నదిలో పుష్కర స్నానాదికాలు చేస్తే విశేష పుణ్యఫలాలు సొంతమవుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. సోమశిలలోని శ్రీలలితా సోమేశ్వర స్వామి దేవాలయాన్ని ఏడవ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు. శ్రీశైలం ప్రాజెక్టు వల్ల ఈ ఆలయం నదిలో మునిగిపోకుండా గట్టున ఆలయాన్ని తిరిగి పునర్నిర్మించారు. ఈ ఆలయం పదిహేను ఆలయాల సముదాయంగా విరాజిల్లుతోంది. జ్యోతిర్లింగాలుగా ప్రసిద్ధమైన ద్వాదశ లింగాల ప్రతిరూపాలను ఒకే చోట ఆలయంలో ప్రతిష్టించారు. ఈ ఆలయాలలోని అన్ని గర్భగుడుల లలాట బింబంగా గజలక్ష్మి ఉండడం ఈ ఆలయ విశేషంగా చెబుతారు. ఆలయం ముందు భాగంలో రెండు శాసనాలున్నాయి. కళ్యాణి చాళుక్య చక్రవర్తి త్రైలోక్య మల్ల ఒకటవ సోమేశ్వరుని పాలన కాలంలో, కాకతీయ మహారాజు రెండో ప్రతాప రుద్రుని కాలంలోనూ ఈ శాసనాలు వేసినట్లు ఇక్కడి ఆధారాల ద్వారా అవగతమవుతోంది.

అలంపురం ఆలయాలు:

అలంపురం సమీపంలో కృష్ణా, తుంగభద్ర నదులు సంగమించడం వల్ల ఈ ప్రాంతాన్ని దక్షిణకాశిగా అభివర్ణిస్తూ ఉంటారు. మహబూబ్‌నగర్‌కి 90 కిలోమీటర్ల దూరంలోనూ, హైదరాబాద్‌కి 200 కిలో మీటర్ల దూరంలోనూ నెలకొని ఉన్న అలంపురం అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవది. అలాగే, ఈ క్షేత్రంలో నవ బ్రహ్మలు కొలువై ఉన్నారు. క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో బాదామీ చాళుక్యులు ఈ ఆలయాలను నిర్మించారు. అలంపురం చుట్టూ నల్లమల అడవులు వ్యాపించి ఉన్నాయి. తుంగభద్ర నది ఎడమ గట్టున అలంపురం ఆలయం ఉంది. శాతవాహన, బాదామీ చాళుక్యులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యాధిపతులు, గోల్కొండకి చెందిన కుతుబ్‌ షాహీ ల కాలంలో ఈ ఆలయం అభివృద్ధి చెందింది. జోగులాంబ, బ్రహ్మేశ్వరస్వామి వార్ల ఆలయాలు చారిత్రక ప్రసిద్ధి చెందినవి. అలంపురాన్ని పూర్వం హలంపురంగానూ, హటాంపురంగానూ వ్యవహరించేవారని క్రీస్తు శకం 1101 సంవత్సరం నాటి శాసనం తెలియజేస్తోంది. ఈ శాసనం పశ్చిమ చాళుక్య రాజు త్రిభువనమల్ల విక్రమాదిత్య-4 కాలం నాటిది.

జోగుళాంబ ఆలయం అలంపురంలో ఆగ్నేయ దిశగా నెలకొని ఉంది. ఈ ఆలయాన్ని 14వ శతాబ్దంలో బహమనీ సుల్తానులు ధ్వంసం చేయగా, జోగులాంబ, చండి, ముండి విగ్రహాలను బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో భద్రపర్చారు. కొద్ది సంవత్సరాల క్రితం జోగులాంబ ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. సతీదేవికి చెందిన పై దవడ పంటితో సహా ఇక్కడ పడినట్టు పురాణకథనం. అమ్మవారు ఉగ్రరూపంతో దర్శనమిస్తారు. మొదట అమ్మవారి విగ్రహం ఇక్కడున్న బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉండేది. 2008లో అమ్మవారికి ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మించి, తిరిగి ప్రతిష్టించారు.

అలంపూర్‌కు ఈశాన్యంలో కృష్ణా, తుంగభద్ర నదుల సంగమ ప్రాంతంలో కూడవెల్లి అనే గ్రామంలో సంగమేశ్వరాలయం ఉండేది. ఈ గ్రామం, ఆలయం శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపునకు గురికావడంతో ఇక్కడి సంగమేశ్వరాలయాన్ని తరలించి అలంపూర్‌లో పునర్నిర్మించారు. ఈ ఆలయ శిల్పసంపద ఆకట్టుకుంటుంది. ఈ దేవాలయం కూడా చాళుక్యుల నిర్మాణ శైలిలోనిదే. అలాగే,

అలంపురం సమీపంలోని పాపనాశంలో ఇరవై దేవాలయాలు ఒకేచోట ఉండటం వల్ల అలంపురం ఆలయాల పట్టణంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఏడవ శతాబ్ది నుంచి 17వ శతాబ్ది వరకూ దక్షిణాపథాన్ని పరిపాలించిన రాజవంశీయుల శాసనాలు ఇక్కడ ఉన్నాయి. ప్రాచీన శిల్పకళకు కాణాచి అయిన ఈ ఆలయం అడుగడుగునా విజ్ఞాన విశేషాలకు ఆలవాలంగా ఉంది. వైదిక మతానికి చెందిన ఆలయాలు, జైన, బౌద్ధుల కాలం నాటి శిల్పనిర్మాణాలు ఇక్కడ ఎన్నో దర్శనమిస్తాయి.
ఈ ఆలయం మహాద్వారాన్ని రాష్ట్ర కూటుల హయాంలో నిర్మించినట్టు చారిత్రక కథనం. కాకతీయుల కాలంలో ఇక్కడ మండపాలను నిర్మించారు. శ్రీకృష్ణ దేవరాయలు రాయచూర్‌ నుంచి ఈ ఆలయానికి వచ్చి అనేక మాన్యాలిచ్చినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, మట్టంపల్ల్లి, నల్గొండ జిల్లా

నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌ సమీపంలోని మట్టంపల్ల్లి గ్రామంలో కృష్ణా నదీ తీరాన శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. తెలుగునాట పంచ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన పుణ్య క్షేత్రమే మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం. ఈ ఆలయానికి దాదాపు వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. మట్టపల్లిలో వెలసిన స్వామి కొన్నాళ్లు ఎవరికీ కనిపించకుండా గుహలో దాగి ఉండేవాడట. ఇదే గుహలో భరద్వాజ మహర్షి తపస్సు చేయడంతో ప్రత్యక్షమైన స్వామి ఇక్కడే వెలిశాడని, ఒక్క భరద్వాజ మహర్షి మాత్రమే అప్పట్లో స్వామివారిని ఆరాధించుకునేవారని ప్రతీతి. ఈ ఆలయంలో దేవనాగరి లిపిలో ఉన్న శిలాశాసనం ఆధారంగా ఈ ఆలయం 1100 సంవత్సరాల కిందటిదని తెలుస్తోంది. కొండ మీద స్వామి స్వయంభువుగా వెలిశాడు. ఇక్కడ స్వామితో పాటే ఒక దక్షిణావృత శంఖం కూడా ఆవిర్భవించింది.

గుంటూరు జిల్లాలోని తంగెడ గ్రామానికి చెందిన మాచిరెడ్డి అనే భక్తుడికి స్వామి కలలో కనిపించి, తాను ఇక్కడ కొండగుహలో వెలిశానని, తనను వెలికితీసి, పునఃప్రతిష్టించమని ఆదేశించాడట. ఆ భక్తుడు గుహలోనున్న స్వామి విగ్రహాన్ని వెలికితీసి, ఆలయం నిర్మించినట్లు ఇక్కడి స్థలపురాణాలు చెబుతున్నాయి. నాటి నుంచి ఈ ఆలయంలో రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భక్తులు పూజించడం మొదలైంది. ఈ ఆలయంలో స్వామివారికి ప్రీతిపాత్రమైన ఆరె ఆకులను దండలుగా చేసి అలంకరిస్తారు. పశ్చిమాభిముఖంగా ఉన్న స్వామివారి గుహాలయానికి ఆనుకుని గోదాదేవి ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం, నాగేశ్వర ఆలయం తదితర ఆలయాలు ఉన్నాయి. ఈ క్షేత్రానికి యమమోహిత క్షేత్రమని కూడా పేరుంది. యమధర్మరాజు స్వయంగా ఈ ఆలయంలో స్వామి వారి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల దీనికాపేరు వచ్చిందంటారు. హైద్రాబాద్‌ నుంచి వచ్చే భక్తులు రోడ్డు మార్గంలో కోదాడ వరకు వచ్చి అక్కడ నుంచి ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. అలాగే మిర్యాలగూడ మీదుగా కూడా ఇక్కడకు చేరుకోవచ్చు.

శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయం, దామెరచర్ల:

నల్గొండ జిల్లా దామెరచర్ల మండలంలో విష్ణుపురానికి సమీపంలో కృష్ణా, మూసీ నదుల సంగమ క్షేత్రంలో వెలసిన పుణ్య క్షేత్రమిది. ఇదో ప్రాచీన మహానగరం. 11,12 శతాబ్దాల కాలంలో ఈ క్షేత్రం గొప్ప ఓడరేవుగా ఉండేదని, వోడపల్లి కాలక్రమంలో వాడపల్లిగా, వజీరాబాద్‌ గా మారిందని చెబుతారు. అలాగే ఈ ప్రాంతాన్ని పూర్వం బదరికారణ్యం అని పిలిచేవారు. ఆరు వేల సంవత్సరాలకు పూర్వం అగస్త్య మహాముని, తన ధర్మపత్ని లోపాముద్రతో శివకేశవులను తన పూజా కావిడిలో ఉంచుకుని, వారిని ప్రతిష్టించే పవిత్ర ప్రదేశం కొరకు ముల్లోకాలు తిరుగుతూ భూలోకం చేరారట. ఉత్తరకాశీకి వెళ్ళే క్రమంలో ఈ బదరికారణ్యాన్ని చేరుకున్నారట. ఈ పవిత్ర క్షేత్రంలోకి రాగానే నరసింహ స్వామి తానా ప్రదేశంలోనే ఉండ దలచినట్లు ఆకాశవాణి వినిపించిందట. అంతట ఆ ముని దంపతులు శ్రీ లక్ష్మీసమేతునిగా నరసింహుని ప్రతిష్ఠించి ఈ క్షేత్ర పవిత్రతను ఇనుమడింప చేశాడని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. మరో కధనం మేరకు వ్యాస భగవానుడి కోరిక మేరకు లక్ష్మీనరసింహ స్వామి ఈ క్షేత్రంలో కొలువుదీరినట్లు చెబుతారు. ఈ ఆలయం దక్షిణ ముఖంగా ఉంటుంది. విష్ణుకుండినులు, చాళుక్యులు, కుందూరు చోళులు, రేచర్ల పద్మ నాయకులు, రెడ్డి రాజులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లు తెలుస్తోంది. శిధిలమైన ఆలయాన్ని 13వ శతాబ్దంలో అనవేమారెడ్డి పునర్నిర్మాణం చేసి వసతులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఎరయ తొండయ చోళుడు క్రీ.శ. 1050, 1065 మధ్య అద్భుతమైన వాడపల్లి దుర్గాన్ని అభివ్రుద్ది చేసినట్లు తెలుస్తోంది. 12వ శతాబ్దంలో రెడ్డి రాజులు ఈ ప్రదేశంలో పట్టణ నిర్మాణానికై తవ్వకాలు జరుపుతుండగా స్వామి వారి విగ్రహం బయట పడిందని, వారు అక్కడే ఆ విగ్రహాన్ని ప్రతిష్టించి క్రీ.శ. 1377లో ఆలయ నిర్మాణం చేసినట్లు శాసనాల ద్వారా అవగతమవుతోంది.

పుష్కరాల సమయంలో దర్శించుకోదగ్గ ఇతర ఆలయాలు:

వీటితో పాటు మాగనూరు మండలం తంగిడి పుష్కర ఘాట్‌ సమీపంలోని వల్లభేశ్వరస్వామి ఆలయం, దత్తాత్రేయస్వామి ఆలయం, రామలింగేశ్వరస్వామి, గుడెబల్లూరు ఘాట్‌ స్వయంభూ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి, మక్తల్‌ మండలం పస్పుల ఘాట్‌ సమీపంలోని శ్రీదత్తాత్రేయస్వామి . పరెవుల ఘాట్‌ సమీపంలోని శంకర లింగేశ్వర స్వామి ఆలయాలు దర్శించుకోవచ్చు. అలాగే ఆత్మకూరు మండలం నందిమళ్ల ఘాట్‌ సమీపంలోని శివాలయం, మూలమళ్ల ఘాట్‌ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం, జూరాల ఘాట్‌ దగ్గర శివాలయాలు. పెబ్బేరు మండలం రంగాపూర్‌ ఘాట్‌ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయాలను దర్శించుకునే వీలుంది. ధరూర్‌ మండలం పెద్దచింతరేవుల ఘాట్‌ ఆంజనేయస్వామి ఆలయం, వీపనగండ్ల మండలం పెద్దమరూర్‌ ఘాట్‌ ఈశ్వర ఆలయం, జటప్రోలు మదనగోపాల స్వామి, కొల్లాపూర్‌ మండలం సింగోటం శ్రీలక్ష్మీనర్సింహ్మస్వామి ఆలయం, శ్రీ అగస్తేశ్వర ఆలయాలు కూడా పుష్కరాల సమయంలో దర్శించుకోవచ్చు. అలాగే, అమరగిరి ఘాట్‌ అమరేశ్వర ఆలయం, పెబ్బేరు మండలం గుమ్మడం ఘాట్‌ సమీపంలోని చెన్నకేశవస్వామి ఆలయం, రామ్‌పూర్‌ ఘాట్‌ శ్రీరామాలయం, ముంగమందిన్నె ఘాట్‌ శ్రీ ఆంజనేయస్వామి, రామాలయాలు. వీపనగండ్ల మండలం చెల్లపాడు ఘాట్‌ శివాలయం, కొల్లాపూర్‌ మండలం మంచాలకట్ట, మల్లేశ్వరం ఘాట్‌ సమీపంలోని శ్రీ రామతీర్థస్వామి ఆలయం, శివాలయం. అచ్చంపేట మండలం పాతాళగంగ పుష్కరఘాట్‌ దగ్గర్లోని దత్తాత్రేయ స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. వీటితో పాటు ధరూర్‌ మండలం నెట్టెంపాడు శివాలయం, ఉప్పేరు, రేవులపల్లి ఘాట్‌ సమీపంలోని శివాంజనేయస్వామి ఆలయాలు, గద్వాల మండలం రేకులపల్లి ఘాట్‌ ఆంజనేయస్వామి ఆలయం, నదీ అగ్రహారం రామావధూత మఠం, బీరెల్లి చెన్నకేశవస్వామి ఆలయాలు, అలంపూర్‌ మండలం క్యాతూరు వెంకటేశ్వరస్వామి ఆలయం, గొందిమళ్ల ఘాట్‌ సమీపంలోని జూంకారేశ్వరీదేవి ఆలయాలు కూడా పుష్కర సమయంలో దర్శించుకునే మహాద్భాగ్యం కలుగుతుంది.

Source:

http://magazine.telangana.gov.in/కృష్ణవేణి తీరంలో పవిత్ర క్షేత్రాలు

కర్మభూమి ధర్మకార్యం పుష్కర సంస్కారం

డా|| సాగి కమలాకర శర్మ
డా|| భిన్నూరి మనోహరి

భారతదేశం ధర్మభూమి, కర్మభూమి. ధర్మాన్ని అనుసరించి, ఆచరించి కర్మలు నిర్వహించడం మన భారతీయ సంస్కృతిలో పరంపరగా వస్తుంది. మన ఋషులు శాస్త్రాధారంగా ధర్మబద్ధంగా మనం ఆచరించవలసిన కర్మలను నిర్దేశించినారు. వారు చూపిన మార్గంలో ఆయా సమయాల్లో మనం మన కర్మలను ఆచరించి ధర్మమార్గంలో పయనిస్తేనే ఉత్తమమైన జీవన విధానాన్ని అనుసరించగల్గుతాం. జీవనలక్ష్యమైన మోక్షాన్ని, విముక్తిని పొందాలంటే సంస్కార భావనతో నిరంతర శుద్ధి ప్రక్రియలో ఉండాలి. కాలానుగుణమైన శుద్ధి ప్రక్రియలు తప్పనిసరిగా పాటించాలి. భారతీయ జీవనవిధానంలో ఆ మార్గంలో వ్యక్తి ఉన్నతమైన సంస్కార విధుల్ని నిర్వహించే కర్మలే పుష్కర సంస్కారాలు.

పుష్కరం – విశిష్టత

పుష్కరం అంటే ఆధునిక కాలంలో ఏదైనా జీవనదికి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది అనే అర్థం చెపుతున్నారు. అయితే పుష్కరం అంటే జలం అనే అర్థం ఉంది. మనిషికి పుష్టినిచ్చే వాటిలో నీరు ఒకటి. ”పోషయతీతి పుష్కరం” పోషించేది అనే అర్థం. జలాన్ని బాహ్య శుద్ధికి, అంతఃశుద్ధికి కూడా వినియోగిస్తుంటాం. ఈ పుష్కర విజ్ఞానానికి సంబంధించి మన పూర్వీకులు ఒక కథను చెప్తారు.

పూర్వం తుందిలుడు అనే ఋషి పరమేశ్వరునిలో శాశ్వతంగా ఉండాలనే కోరికతో తీవ్రమైన తపస్సు చేసి అతన్ని ప్రత్యక్షం చేసుకున్నాడు. పరమశివుడు తన అష్టమూర్తుల్లో ఒకటైన జలరూపంలో అతనికి శాశ్వత స్థానం కల్పించి సమస్త జలరాశికి, మూడున్నరకోట్ల పుణ్యతీర్థాలకు సార్వభౌముడుగా వరాన్ని ప్రసాదించాడు. సృష్టి, స్థితి, లయాల్లో బ్రహ్మది సృష్టికార్యం. ఆ కార్యం నిర్వహించడానికి జలం అవసరమైంది. అప్పుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి, పుష్కరుడు తన కమండలంలో ఉండేటట్లు వరం పొందినాడు. జీవులను బ్రతికించే బాధ్యత బృహస్పతిది. కాబట్టి బ్రహ్మను గూర్చి తపస్సు చేసి పుష్కరుడిని (తుందిలుడు) తనకు అనుకూలంగా ఉంచమని అర్థించాడు. పుష్కరుడు బ్రహ్మను వదిలి ఉండటం ఇష్టంలేనివాడై తనకు తోడుగా బృహస్పతివద్ద ఉండమని బ్రహ్మను కోరినాడు. కాని సృష్టికార్య నిర్వహణ కష్టమవుతుంది కాబట్టి బ్రహ్మ ఒక సూచన చేశాడు. గ్రహ స్వరూపుడైన బృహస్పతి మేషాది 12 రాశుల్లో ప్రవేశించేటప్పుడు 12 రోజులు, ఆ రాశులనుండి వెళ్ళిపోయేటప్పుడు 12 రోజులు సంవత్సరంలో మిగిలిన అన్నిరోజుల్లో మధ్యాహ్న సమయంలో రెండు ముహూర్తాల కాలం గురువుతో పుష్కరుడు ఉండాలని, ఆ సమయంలో తాను (బ్రహ్మ) యావద్దేవతా గణాలతో కలిసి బృహస్పతి ఏ రాశిలో ఉంటే ఆ రాశి అధిష్ఠానమైన పుణ్యనదికి వస్తుంటానని చెప్పి అటు బృహస్పతిని, ఇటు పుష్కరుణ్ణి సంతుష్టులను చేసి, సమస్త మానవాళికి సంతోషాన్ని కూర్చినాడు. ఈ విధంగా సృష్టి స్థితులకు ఆధారమైన ఈ జలమే పుష్కరాల రూపంలో మనకు పుణ్యాన్ని చేకూరుస్తున్నాయి.

మేషే గంగా వృషే రేవా మిథునేచ సరస్వతీ |
కర్కటే యమునా ప్రోక్తా సింహే గోదావరీ స్మృతా ||
కన్యాయాం కృష్ణవేణీచ కావేరీ ఘటకే స్మృతా|
వృశ్చికే తామ్రపర్ణీ చ చాపే పుష్కర వాహినీ|
మకరే తుంగభద్రా చ కుంభే సింధునదీ స్మృతా ||
మీనే ప్రణీతా చ నదీ గురోస్సంక్రమణే స్మృతా |
పుష్కరాఖ్యో మునీనాం హి ప్రదేశోకత్ర బుధ్ణైుు స్మృత్ణ ||

పన్నెండు రాశుల్లో సంచరించే గురువు కన్యారాశిలో ప్రవేశించిన సమయంలో కృష్ణవేణీ పుష్కరాలు ప్రారంభం అవుతాయి. ప్రవేశించినప్పటినుండి మొదటి 12 రోజులు ప్రధానమైనవిగా చెప్తారు. సంవత్సర మధ్యంలో మధ్య పుష్కరం అని, సంవత్సరం చివరి 12 రోజులు అంత్య పుష్కరంగా వ్యవహరిస్తారు.

కృష్ణా పుష్కరాల విశిష్టత

కృష్ణా నది రంగు నలుపు. అంటే కృష్ణుని రంగు. ఈ నది ఏర్పడడానికి కూడా పెద్దలు ఒక కథ చెప్తారు. లోకానుగ్రహ తత్పరులైన రాధాకృష్ణులు కోపావేశంలో గంగాది పుణ్యనదుల పేర్లతో ఉన్న గోపికలను భూలోకంలో జన్మించమని శపించినారట. అప్పుడు ఆ గోపికలు ప్రార్థించగా భరతభూమిలో మీ మీ పేర్లతో నదులుగా జన్మించి సర్వజీవులను ఉద్ధరించమని వరమిచ్చినారట. ఆవిధంగా గంగా, యమున, సరస్వతి మొదలైన జీవనదులు ఉద్భవించినాయి. దేవతల కోరికమీద సహ్యాద్రి పర్వతప్రాంతంలో కృష్ణుడు తన వామభాగంనుండి కృష్ణానది (రాధారూపం)ని పుట్టించి ప్రవహింపచేసినట్లు ఐతిహ్యం. కాబట్టే ”కృష్ణే కృష్ణాంగ సంభూతే జంతూనాం పాపహారిణి” అనే పేరు సార్థకమైంది. ఈవిధంగా కృష్ణవేణీ నది ఉద్భవించి ప్రతి 12సంవత్సరాలకు ఒకసారి ముప్పైకోట్ల దేవతలు, సమస్త గురు, దేవతా, రాశిగణం గురువుతో వచ్చి పుష్కరమనే పేరుతో సకల జీవులకు దర్శనం, స్పర్శనం, స్నానమాత్రంచేత అనేక పాపాలను పోగొడుతూ శారీరక, మానసిక ప్రశాంతతను కల్పిస్తూ ప్రజల్లో ధార్మిక, ఆధ్యాత్మిక భావాలను ఉత్తేజపరుస్తున్నది.

”కృష్ణవేణీతి యో బ్రూయాత్‌ సప్త జన్మార్జితాన్యపి |
మహా పాపాని నశ్యంతి విష్ణులోకం స గచ్ఛతి||”

పుష్కర సమయంలో కృష్ణవేణీ అని ఆ తల్లి నామాన్ని స్మరిస్తేనే ఏడుజన్మల క్రింద చేసిన పాపాలు నశించి, స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని తెలుస్తుంది.

కృష్ణాపుష్కర సమయంలో స్నానం చేసే విధానం

పుష్కర సమయంలో బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, సర్వదేవతలు, ఋషులు, పితృదేవతలు అందరూ నదిలో కొలువై ఉంటారు. అందుకే వీరందరికీ నమస్కారం చేసి అర్ఘ్యం ఇచ్చి స్నానం చేయాలి.

నదిలో స్నానం చేయడానికి ముందు
‘పిప్పలాదాత్సముత్పన్నే కృష్ణే లోక భయంకరి |
మృత్తికాం తే మయా దత్తాం ఆహారార్థం ప్రకల్పయ ||
నదిలో దిగుతూ రేగిపండంత మట్టిని మూడుసార్లు నదిలో వేసి ప్రార్థించాలి.
పొద్దున్నే నిద్రలేస్తూనే భూదేవిని క్షమించమని ప్రార్థిస్తాం. అదే విధంగా నదీస్నానం చేయడానికి
”పావని! త్వం జగత్పూజ్యే! సర్వ తీర్థమయే శుభే |
త్వయి స్నాతుమనుజ్ఞాం మే దేహి కృష్ణే! మహానది ||

నదీమతల్లి ఆజ్ఞ తీసుకొని
”కన్యాగతే దేవగురౌ పితౄణాం తారణాయ చ
సర్వ పాప విముక్త్యర్థం తీర్థస్నానం కరోమ్యహమ్‌ ||
మనస్సులో ధ్యానం చేసుకోవాలి.

ఆ తర్వాత నదికి నమస్కారం చేస్తూ ”సర్వలోకాల పాపాలను హరించే ఓ తీర్థరాజమా! నీ నదిలో స్నానం చేయడం వల్ల భవ బంధ విముక్తుడిని చేయి” అంటూ ప్రార్థిస్తూ స్నానం చేయాలి.

ఆ తరువాత కృష్ణానదికి, తీర్థరాజుకు, బృహస్పతికి, విష్ణువుకు, శివుడికి, బ్రహ్మాది దేవతలకు, వశిష్ఠాది మునులకు, గంగాది సకల నదులకు, ప్రత్యక్ష దైవమైన సూర్య నారాయణుడికి నీటితో అర్ఘ్యమిచ్చి వచ్చినవారు ప్రార్థనా శ్లోకాలను చదువుకోవాలి. లేనిచో ఆ దైవాలను తలచుకొని అర్ఘ్యం ఇవ్వాలి.

పుష్కరాలు – పితృకర్మలు

పుష్కరాల్లో స్నానం చేయడమే ఎంతో పుణ్యం. ఇంకా పితృకర్మలు నిర్వహించాలా? అని చాలామంది సందేహం. అసలు పితృకర్మలు ఎందుకు నిర్వహించాలి. మనం నిర్వహించే ఈ కర్మలు మన పితృదేవతలకు చెందుతుందా? వారు గమనిస్తారా?, పుష్కరాలకు, పితృకర్మలకు ఎటువంటి సంబంధం ఉంది వంటి అనేక ప్రశ్నలకు సమాధానం ఈ క్రింది శ్లోకం చెప్తుంది.

గంగాయాం పుష్కరే శ్రాద్ధే అర్ఘ్యమావాహనాదికమ్‌
తృప్తి ప్రశ్నాదికం పిండం యథావిధి సమాచరేత్‌ ||
బ్రహ్మావిష్ణుశ్చ రుద్రశ్చ ఇంద్రాద్యాస్సర్వ దేవత్ణా |
పితరో ఋషయశ్చైవ తత్రైవ నివసంతి హి ||
కృష్ణాయ్ణా పుష్కరే కృత్వా స్నానం దానం చ పైతృకమ్‌ |
గంగాయాం కోటి గుణితం ఫలమాప్నోతి మానవ్ణ ||

పుష్కరాల సమయంలో పుణ్యఫలం మీద అపేక్షతో త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు, ఋషులు, పితృదేవతలు వస్తారు. ఆ సమయంలో మనం స్నానం, దానం, పూజ, పితృ తర్పణాలు శ్రాద్ధ కర్మలు చేస్తే పుణ్యం కోటిరెట్లు పెరుగుతుందని పెద్దలు చెప్తారు.

సాధారణంగా ఇంట్లో ఎవరైనా చనిపోతే వారికి నెల నెల మాసికాలు సంవత్సర విమోకం, ప్రతి సంవత్సరం వారు మరణించిన తిథినాడు ఆబ్దికాలు నిర్వహిస్తారు. ఆవిధంగా చేయడం వల్ల వారిని మనం స్మరించుకుని వారి పేరు మీద నలుగురికి అన్నదానం చేయడం, బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులు ఇవ్వడం చేస్తారు.

ఆధునిక కాలంలో అవి నిర్వహించే సమయం, ఓపిక, అవకాశాలు లేకుండా పోయాయి. అటువంటివారు తప్పనిసరిగా పుష్కర సమయాల్లో పితృదేవతలు కూడా పుష్కరస్థానంలో ఉంటారు కాబట్టి వారు మరణించిన తిథి నాడు లేదా అమావాస్యల్లో కాని పితృకార్యాన్ని, శ్రాద్ధాన్ని నిర్వహిస్తే పితృదేవతలు సంతృప్తులవుతారు. ఆ కర్మ నిర్వహించినవారు కూడా తృప్తి చెందుతారు. ఆ కారణంగా పుష్కర సమయాల్లో శ్రాద్ధ కర్మలు నిర్వహించాలనే నియమం ఏర్పడింది.

పితృకర్మల విషయంలో ఇంకో విశేషం కూడా ఉంది. ఉన్నతమైన, పవిత్రమైన జీవితం గడిపిన ఒక వ్యక్తి మరణానంతరం అతని జీవన విధానం ఆ ఇంట్లో కొనసాగుతూ ఉంటే వారు ఆ ఇంట్లో సంతానంగా జన్మిస్తారనే నమ్మకం ఉంది. అందుకు ఈ పితృ తర్పణాలు ఎంతో ఉపకరిస్తాయి. ఇట్లా మళ్ళీ మళ్ళీ జన్మించడం వల్ల కుటుంబ సంస్కారం విలువలు పడిపోకుండా నిలబడటానికి, భారతీయ ధర్మాన్ని కొనసాగించడానికి వీలవుతుంది. అట్లా అని శ్రాద్ధకర్మలు చేయనివాళ్ళంతా పతనం వైపు పయనిస్తారని కాదు. కాని ఒక ప్రశాంతమైన జీవన విధానంలో ఉన్న సుఖం, సౌలభ్యం వేరేచోట లభించదు కదా. అందుకే మన పూర్వీకులను తలచుకుని, వారికి శ్రాద్ధకర్మలు నిర్వహించి పితృ ఋణం తీర్చుకొని, వారి ఆశీస్సులను పుష్కరసమయంలో పొందడం పుష్కరాలకు, శ్రాద్ధకర్మల నిర్వహణకు ఉన్న సంబంధం. తమ భౌతికదేహానికి, మానసిక వికాసానికి కారకులైన వారికి జన్మ ఉన్న సమయంలో సేవ చేసుకోవడం, మరణం తర్వాత పవిత్ర క్షేత్రాలు, తీర్థాలు, పుష్కరాదులలో స్మరించి వారి కోసం ప్రత్యేక అర్చనలు చేయడమే శ్రాద్ధం. దీనిలో శ్రద్ధ ప్రధానం. దీనివల్ల పెద్దల ఆశీస్సులు, మార్గదర్శనం తరువాతి తరాలకు లభిస్తుంది.

అంతేకాదు చనిపోయినవారు దానం చేసినా చేయకపోయినా మరణించిన 12 రోజుల్లో చేసే కర్మల్లో దశదానాలు, షోడశ దానాలు వారి సంతానం చేస్తారు. దానివల్ల వైతరణిని దాటుతారని పెద్దలు చెప్తారు. పుష్కరాల్లో కూడా పెద్దల పేరుమీద దానాలు చేయడం కూడా అటు వంటిదే. పుష్కరాదుల్లో దానాదులకు అత్యంత వైశిష్ట్యం ఉంది.

కేవలం పితరులే కాదు మనకు సన్నిహితులు, గురువులు, మిత్రులు, ఉపకారం చేసినవారు, సేవకులు ఇలా ఎవరికైనా ధర్మపిండ ప్రదానం చేయడంవల్ల వారికి సద్గతి ప్రాప్తిస్తుంది. తత్ఫలితంగా కర్మ చేసినవారికి పుణ్యం లభిస్తుంది.

పుష్కరాలు 12 రోజుల్లో చేయవలసిన దానములు
మొదటిరోజు: బంగారం, వెండి, ధాన్యం, భూమి
రెండవరోజు: వస్త్రాలు, ఉప్పు, రత్నం
మూడవరోజు: బెల్లం, అశ్వం (వాహనం), పండ్లు
నాల్గవరోజు: నెయ్యి, నూనె, పాలు, తేనె
ఐదవరోజు: ధాన్యం, ఎద్దు, దున్నపోతు, నాగలి
ఆరవరోజు: ఔషధం (మందులు), ర్పూరం, కస్తూరి, చందనం
ఏడవరోజు: ఇల్లు, చాప, మంచం, పల్లకి
ఎనిమిదవరోజు: గంధపుచెక్క, పూలు, అల్లం
తొమ్మిదవరోజు: పిండ ప్రదానం చేసి పరుపు, మెత్త, కంబళి వంటి శయ్యాదానం
పదవరోజు: కూరగాయలు, దేవతామూర్తులు
పదకొండవరోజు: సాలగ్రామం, పుస్తకాలు, కంబళి
పన్నెండవరోజు: నువ్వులు

ఆయారోజుల్లో ఈవిధమైన దానాలు చేయడం మంచిదని పెద్దలు సూచించినారు. అయితే అన్నిరోజులు కచ్చితంగా ఇవే ఇవ్వాలనే నియమం లేదు. ఎవరికి ఎంత శక్తి ఉంటే, వీలునుబట్టి వారి స్థాయికి తగిన దానాలు నిర్వహించుకోవచ్చు.

దంపతీ స్నానం

భారతీయ ధర్మంలో భర్త ఏ కార్యం నిర్వర్తించినా భార్య తోడుంటేనే అతడు చేసే కర్మలకు ఫలితం దక్కుతుంది. యజ్ఞయాగాలు నిర్వహించినా, వివాహ తంతులోనైనా, ఏ కార్యానికైనా భార్యతో కలిసి చేయడం మన సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని అనుసరించే పుష్కరాల్లో కూడా దంపతులు కలిసి స్నానం చేయడం ఆచారంగా మారింది. అంతేకాకుండా అత్తవారింటికి వచ్చిన తర్వాత ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి అవుతుంది, అత్తమామలు తల్లితండ్రులతో సమానం కాబట్టి వారికి సంబంధించిన పితృకార్యాల్లో భార్య తప్పనిసరిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఇద్దరు కలిసి చేసే పనుల వల్ల కుటుంబం సౌఖ్యంగా, పిల్లలు వారిని అనుసరించి తమ జీవన విధానాన్ని ఏర్పరచుకుంటారు.

”కృష్ణవేణీతి యో బ్రూయాత్‌ సప్త జన్మార్జితాన్యపి |
మహా పాపాని నశ్యంతి విష్ణులోకం స గచ్ఛతి||”

అన్న శ్లోకాన్ని స్మరిస్తూ మూడుసార్లు నదిలో మునిగి ఆ తరువాత సర్వదేవతలకు నమస్కరించి తరువాతి కార్యక్రమాలు నిర్వహించాలి.

గౌరీ పూజ, మూసి వాయనాలు

పుష్కరాల సమయంలో ఆడవారు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. వీరు గౌరీ పూజను నిర్వహిస్తారు. అదేవిధంగా నదీమతల్లికి తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని, సంతానం వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ పసుపు, కుంకుమ, పూలు, వస్త్రం, నల్లపూసలు, అద్దం వంటివి సమర్పించుకుంటారు. తోటి ఆడవాళ్ళకు పసుపు కుంకుమలిచ్చి మూసి వాయనాలు ఇవ్వడం వల్ల కుటుంబాలకు శ్రేయస్సు కలుగుతుంది.

పుష్కర సమయంలో నదీతీరంలో చేయకూడనివి

పుష్కరాల సమయంలో ఇప్పటివరకు ఎటువంటి విధులు ఆచరించాలి, ఏవిధంగా స్నాన సంస్కారాలు, శ్రాద్ధ విధులు నిర్వర్తించుకోవాలో తెలుసుకున్నాం. అదేవిధంగా పుష్కరాల్లో చేయకూడనివి కూడా తెలిస్తే మన పుష్కర యాత్ర విజయవంతమవుతుంది.

– కృష్ణమ్మతల్లి పరమ పవిత్రమైనది. ఆ అమ్మను అపవిత్రం చేయకూడదు.
– నదిలో స్నానం చేసేటప్పుడు అన్ని విధులను శ్రద్ధగా ఆచరించాలి కాని ఏదో నీళ్ళలో మునగాలి కదా అని అశ్రద్ధగా ఉండకూడదు.
– నదీ జలాల్లో బట్టలు ఉతకకూడదు. అదేవిధంగా మలమూత్ర విసర్జన, ఉమ్మివేయడం, ముక్కు చీదడం వంటికి నిషిద్ధం. దీనివల్ల స్నానం చేయడంవల్ల వచ్చే పుణ్యం కంటే పాపమే ఎక్కువ వస్తుంది.
– స్నానం చేసే సమయంలో పిల్లలను జాగ్రత్తగా గమనించుకోవాలి. వారిని ఒంటరిగా వదిలిపెట్టకూడదు.
– స్నానం చేసిన తర్వాత పొడిబట్టలు కట్టుకొని ఆ తీర్థ క్షేత్రంలో కొలువై ఉన్న దైవాన్ని దర్శించుకోవాలి.
– నదీ తీరాల్లో ఏర్పాటు చేసే అన్నదాన సత్రాలకు, అన్నదానం చేసేవారివద్ద మనం భోజనం చేసినప్పుడు మనకు తోచిన సహాయం వస్తు, ధన రూపంలో చేయాలి. ఎందుకంటే ఎవరో దానం చేస్తే మనం తింటున్నాం. కాబట్టి మనం కూడా ఆ ధర్మకార్యంలో పాలుపంచుకోవడం ఆవశ్యకం.
– దేవాలయ సంద్శనం కూడా ప్రశాంతంగా దైవధ్యానం చేసుకుంటూ చేయాలి.

కృష్ణమ్మతల్లి పన్నెండు సంవత్సరాల విరామం తర్వాత మనను రుణించటానికి పుష్కరుడి రూపంలో వస్తుంది. అందరం ఆ అమ్మకు నమస్కరించి, మనపై ఎల్లప్పుడు రుణను కురిపించమని వేడుకుంటూ పుష్కర స్నానాలు నిర్వహించుకుందాం.

కృష్ణానదీ సాంస్కృతిక వైభవం

– డా. సంగనభట్ల నరసయ్య

తెలుగు నేలపై పారే నదుల్లో అతి పెద్ద నదులు రెండు. ఒకటి గోదావరి, రెండు కృష్ణ. ఈ రెండు నదులను ప్రాచీన కాలం లో తెల్లనది, నల్లనది అనే అర్థంలో తెలివాహ, కణ్ణ బెణ్ణ అని పిలిచేవారు. వీటికీపేర్లు బౌద్ధ వాఙ్మయంలో లభిస్తున్న పేర్లు. అంతే కాదు పచ్చేరు అని మరో ఏరుంది. దాన్ని ఈనాడు హరిద్రానది అని అంటున్నాం. అది గోదావరికి ఉపనది. నిజామాబాద్‌ జిల్లాలో కందకుర్తి వద్ద ఎగువగా గోదావరిలో కలుస్తుంది. తెలి అంటే తెల్ల, కణ్ణ అంటే కృష్ణ. అంటే నల్లనది. నది నీళ్లకు రంగు లేకున్నా అది పారే ప్రాంతాల మట్టితో నదికి రంగు, రంగుతో నదికి పేరు పెట్టుకున్న అతి ప్రాంచీనమైన ప్రాంతాలు ఈ తెలంగాణవే.

ఉత్తర తెలంగాణ అదిలాబాద్‌ జిల్లాల నుండి మధ్యకృష్ణా నది తీరాలైన మహబూబ్‌ నగర్‌, నల్గొండల వరకు ఉభయ నదుల (గోదావరి, కృష్ణా నదుల) మధ్య ప్రాంతాలలో ఆదిమ మానవులు నివసించినారు. వీరి మూలాల ఆధారాలు ఉట్నూరు ప్రాంతంలో లభించాయి. ఈ తీరాల లోయల్లో అరణ్య మానవ నివాసాలకు తారీఖులు చెప్పలేకున్నా, రాజ్యాల నిర్మాణం బట్టి కనీస చరిత్ర మూడు వేల సంవత్సరాలని భావించవచ్చు. ప్రాక్‌శిలా యుగం నుండే మానవ జీవనంకు చారిత్రకాధారాలున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అమరాబాద్‌, మన్ననూరు, నల్లగొండలో ఏలేశ్వరం, కర్నూలులో కేతవరం, గుంటూరు జిల్లాలో నాగార్జునకొండ మొదలగుచోట్ల వీటి ఆనవాళ్లున్నాయి.
కృష్ణా నది సుమారు 1400 కి.మీ. ప్రయాణం చేసి తూర్పు సముద్రమైన బంగాళాఖాతంలో రెండు పాయలుగా విడిపోయి వలుస్తుంది. ఒకపాయ హంసల దీవి వద్ద మరోపాయ నాచుగుంట వద్ద కలుస్తుంది. తిరిగి ఏటిమొగ వద్ద మూడు పాయలుగా చీలి మొదటిపాయ గుల్లలమోద వద్ద గోటిముట్టిపాయ లేదా బల్లలేరు పేరుతో ప్రవహించి సంగమం చేస్తుంది. రెండో పాయ నాచుగుంట వద్ద ఈల చెట్ల దిబ్బలగుండా ప్రవహించి, మూడో పాయ లంకవేణి దిబ్బను చేస్తూ ప్రవహించి, చేమలమండి వద్ద సంగమిస్తుంది. ఇలా పాయలుగా చీలడం జడకుచ్చులుగా జన్నకారణంగా దీనికి కృష్ణవేణి అనే పేరు వచ్చిందని కొందరు పేర్కొన్నా, నిజానికి ఇది, కృష్ణ, వేణ్ణా అనే రెండు నదుల సంగమం. అపుడే కృష్ణవేణి అవుతుంది. అలాగే గోదా శబరితో కల్సి గోదావరి అవుతుంది. తుంగానది భద్రానదితో కల్సి తుంగభద్ర అని, వారణ, అసితో కల్సిపోయి వారణాసి (గంగా) నది అనిపేర్లున్నాయి.

కృష్ణానది గోదావరివలె కాక, ప్రవహించే దూరం తక్కువైనా, కలిసే ఉపనదులు ఎక్కువే కనుక దీనికి కృష్ణవేణి (నల్లని జడ) అన్న పేరు సార్థకమే. దీని ఉపనదులు సుమారు 30 వరకు ఉన్నాయి.
వేణ్ణా, భీమా, మూలా, మన్‌, కుందళి, పవనా, కమండలా, ఘోడ్‌, ఇంద్రాయణి, భోగవతి, కోయనా, యెర్లా, దిండి, వర్నా, దూద్‌గంగా, పంచగంగా, మూసీ, పాలేరు, భవనాశిని, వేదా, అవతి (వేదవతి), నాదవతీ, మున్నేరు, ఆకేరు ఇలా కొండల్లో పారే ఈ నదిని కలిసే చెలికత్తెలెందరో!

ఈ నదికి తెలుగునాట ఉభయ పార్శ్వాల్లో ఎడవ వైపు భీమా, డిండి (మహబూబ్‌నగర్‌ జిల్లా) మూసీ (రంగారెడ్డి జిల్లాలో ప్రవహించి నల్లగొండ జిల్లా వాడపల్లి వద్ద సంగమం), హాలియా (నల్లగొండ జిల్లా), పాలేరు, మున్నేరు (వరంగల్‌ జిల్లాలో వ్రహించేవి), కడివైపు నుండి తుంగభద్ర (మహబూబ్‌ నగర్‌ జిల్లా) ఘటప్రభ, మలప్రభ, బుడమేరు, తమ్మిలేరు, రామలేరు అనేవి లుస్తాయి. మహబూబ్‌నగర్‌లో తంగెడ వద్ద తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించి ప్రవహించి మహబూబ్‌నగర్‌, నల్లగొండ, కృష్ణా, కర్నూలు, గుంటూరు జిల్లాలను కృష్ణా నది పునీతం చేస్తున్నది.

సహ్యాద్రి పర్వత శ్రేణిలో పుట్టిన ఈ నది మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రవహిస్తూ అనేక ఉపనదీ జలాలతో పుష్టమై తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెడుతుంది. దీనికి కలుస్తున్న ఉప నదుల్లో తుంగభద్ర పెద్దనది. దాని ప్రవాహం, నిడివి దృష్ట్యా అది ప్రత్యేక నదిగా గుర్తించబడింది. ఇది కర్ణాటక రాష్ట్రంలో పారుతుంది.

ఈ నది పరిసరాల నేలిన శాతవాహన పూర్వరాజులు భట్టిప్రోలు – కుబ్బీరకుడు, వడ్డమాను – సోమకుడు, అమరావతి – అవతకామ, పెదవేగి – కికీచక మొదలగు ప్రభువులు, ధాన్య కటకమును పాలించిన సదా వంశీయులు సిరిసద, మహాసద, శివసద మొదలగువారు. శాతవాహన ప్రభువులలో శాకర్ణి (తొలి) ప్రభువు నుండి గౌతమీపుత్ర శాతకర్ణి వరకు తొలినాళ్ల ప్రభువులీ కృష్ణా తీరాలు ఏలినారు. ఇక్ష్పాకు ప్రభువుల విజయపురి కృష్ణాతీరమే. బందరు ప్రాంతాల నేలిన బృహత్ఫలాయనులు, ఏలూరు ప్రాంతాలేలిన శాలంకాయనులు, ఆనంద గోత్రీకులు, పల్లవులు ఏలిన తరువాత కృష్ణానదీ ప్రాంతాలైన నల్లగొండ ఇంద్ర పాలనగరం, రాజధానిగా ఏలిన విష్ణు కుండినులు, మహబూబ్‌నగర్‌ కర్నూలు ప్రాంతాల నేలిన బాదామీ చాళుక్యులు, ఆపై రాష్ట్రకూటులు, తూర్పు చాళుక్యులు, నల్గొండ, మహబూబ్‌నగర్‌ కృష్ణా దివి సీమలు గెల్చిన కాకతీయులు, నల్గొండ నేలిన పద్మనాయకులు, వీరి రాచకొండ దేవరకొండ రాజ్యములు, ఆపై విజయ నగర రాజ్య సీమలు కృష్ణానదీ పరీవాహక రాజ్యములుగా తెలుగువారి ప్రాభవాన్ని పులకించేలా చరిత్రలో కీర్తిమంతం ఐనాయి.

కృష్ణా తీరాన్ని నివసించిన ప్రజలు వివిధ మతాలను కాలానుసరణంగా ఆదరించినారు. భారత దేశంలోని అన్ని మతాలు ఇక్కడి ప్రజల జీవితాలతో ముడివేసుకున్నాయి. తొలుత ఆచరణలోకి వచ్చిన బౌద్ధం క్రీ.పూ. 4వ శతాబ్ది నుండి క్రీ.శ. ఆరవశతాబ్ది వరకు అనగా సహ స్రాబ్ది పర్యంతం రాజుల, ప్రజల ఆదరణకు నోచుకొంది.

నల్లగొండ జిల్లాలోని నాగార్జున కొండ పరిసరాలు, కృష్ణా ఉభయత టాలు, ఫణిగిరి, నేలకొండపల్లి ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు. అమరావతి, జగ్గయ్యపేట, భట్టిప్రోలు, ఘంటసాల, గుడివాడ బౌద్ధ పుణ్య క్షేత్రాలుగా విరాజిల్లినవి. ఆచార్య నాగార్జునితో ముడిపడ్డ శ్రీ నర్వత విహారం కృష్ణవేణి జలాలతో నిత్యం పునీతమైన గిరి ప్రాంతం. మహాయాన బౌద్ధానికి, భిక్షుకనివాస, నివేశన స్థలాలకు, స్థూప, చైత్య నిర్మాణాలకు, గుహలకు, ఈ ప్రాంత ప్రజల దానాలు విరివిగా ఇవ్వబడ్డాయి. విష్ణుకుండి రాజుల్లో గోవింద వర్మ మూసి ఒడ్డున (నేటి చైతన్యపురిలో) బౌద్ధ విహారం ఏర్పాటు చేసిన శాసనం, ఈ రాజులు బౌద్ధాభిమానానికి కృష్ణానదికి సంబంధం తెలుపుతూ ఉంది. శ్రీపర్వతం ఆక్రమించిన పల్లవుల నుండి హిందూ ధర్మం ప్రాభవంలోకి వచ్చింది. కృష్ణలోయలో బౌద్ధం ప్రాభవం క్షీణించడానికి త్రిలోచన పల్లవుడు కారణం. జైనం బౌద్ధం కంటే ముందే కృష్ణమ్మతో ముడివేసుకుని ఉంది. గుంటూరు వడ్డెమాను, మాండలికులు కళింగ నేలిన ఖారవేలుడు, తూర్పు చాళుక్య (వేంగి) ప్రభువులు జైనాన్ని ఆదరించారు. కృష్ణా తీరంలోని విజయవాడ, గుడివాడ, నందిగామ, జగ్గయ్యపేటల్లో జైన క్షేత్రాలుండేవి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా మునుగోడు, చేజెర్ల వంటిచోట్ల జైనాల ఆలయాలుండేవి. మలిశాతవాహనులు వైదిక మతావలంబులు. ఇక్ష్వాకులు విష్ణుకుండినులు కృష్ణాతీరప్రాంతాల నేలిన రాజులు. వీరు వైదిక మతాన్ని పోషించి యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించారు. శైవం కృష్ణా తుంగ భద్రతీరాల్లో తొలినాళ్ల నుండి ఉండేది. ఏనది కృష్ణలో సంగమించినా, ఆ సంగమ క్షేత్రంలో శివాలయాలుండేవి. సంగమేశ్వరుడనే శివునికి పేరు. శివాలయాలతో బాటు కృష్ణా తీరంలో కార్తికేయాలయాలు నిర్మించబడ్డాయి. ఆనంద గోత్రీకుల చేజెర్ల కపోతేశ్వరాలయం, సంగమేశ్వర, మల్లేశ్వరాలు మొదలగు ప్రసిద్ధ క్షేత్రాలు అడవి దేవులపల్లి, బీచుపల్లి, వాడపల్లి వంటి క్షేత్రాలు నారసింహారాధన వెలిసాయి. తూర్పు చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు అనేక శివాలయాలుగా బౌద్ధ రామాలను మార్చినారు. కాలాముఖ, పాశుపాత, కాపాలిక శైవ శాఖలు కృష్ణ వెంబడి నడిచాయి. కూడలి సంగమేశ్వరం (కర్ణాటక) మొదలు, బెజువాడ, దుర్గి, తాడికొండ, శ్రీశైలం, భైరవకోన, అలంపురం వంటివి ఎన్నయినా చూపవచ్చు. వైష్ణవం కూడా శైవంతోబాటు అభివృద్ధి పొందినది. నారసింహ క్షేత్రాలు తెలంగాణలోని కృష్ణా తీరాల్లో వెలిసాయి. ఉండవల్లి, మాచెర్ల, శ్రీకాకుళం, మంగళగిరి, రాచకొండ, మాచెర్ల వంటివి ఉదాహరణలు. కృష్ణా జల పానం చేసిన రాజులు ప్రజలు రెండువేల సంవత్సరాలు వివిధ మతాలను ఆచరించినారు.
కృష్ణానది సాహిత్యానికి ప్రసిద్ధిగాంచిన ఎందరో సారస్వత మూర్తులకు జన్మనిచ్చి, జీవ జలాలతో లాలించి, పాలించి, పెంచి, పోషించిన నదీమతల్లి. మత్స్య, వాయు, విష్ణు, స్కాంద పురాణాలతో బాటు మహాభారతంలో పేర్కొబడ్డ ఈ నది పరిసరాల్లో 9వ శతాబ్ది వరకు సంస్కృతానికి, ఆపై తెలుగు సాహిత్యానికి నెలవైనాయి. 12 శతాబ్దంలోని పాల్కుర్కి సోమన పండితారాధ్య చరిత్రలో శ్రీశైల పాతాళ గంగను వర్ణించడంతో ఈ నదీ స్తుతి ప్రారంభమౌతుంది. గుంటూరికవి తిక్కన, శ్రీనాథుడు కృష్ణా తీర జన్ములు. శ్రీకాకుళపు తిరునాళ్లకు స్మరించిన వినుకొండ వల్లభరాయుడు, రామరాజ భూషణుడు వంటి కవులు కృష్ణను వర్ణింపగా, ఈ తీరాన్నే జన్మించిన మరెందరో కవులు ప్రసిద్ధులైనారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 13 శతాబ్ద చివరన రంగనాథ రామాయణం రాసిన గోనబుద్ధారెడ్డి, కేశంపేట మండల కాకునూరి నివాసి అప్పకవి, జట్రపోలు నందు చాంద్రికాపరిణయం రాసిన సురభి మాధవరాయలు, ఈ సంస్థానాశ్రితుడు ఎలకూచి బాల సరస్వతి, చింతలపల్లి ఛాయాపతి, వీర రాఘవ, సంజీవ కవులు అనర్ఘరాఘవ కర్త ప్రాగ తూరు రాజైన బిజ్జల తిమ్మ భూపాలుడు, ప్రసిద్ధులు. నల్గొండ జిల్లాలోని విష్ణుకుండి 4వ మాధవ వర్మ జనాశ్రయీ ఛందఃకర్త. కొలనుపాక నేలిన 2వ తైలపుని కొలువులోని రన్న కవి, అభిలషితార్థ చింతామణీ కారుడు మూడవ సోమేశ్వరుడు, పానుగల్లు నేలిన ఉయాదిత్యాలంకార కర్త ఉదయాదిత్యుడు, రాచకొండనేలిన రసార్ణవసుధాకర కర్త సింగభూపాలుడు, పశుపతి నాగనాథుడు (విష్ణుపురాణకర్త), చమత్కార చంద్రికాకారుడు విశ్వేశ్వరుడు బొమ్మకంటి అప్పయ, శాకల్య మల్లభట్టు, 3వ సింగభూపాలుని కొలువులో ఉన్న బమ్మె పోతన, నవనాథ చరిత్ర కర్త గౌరన వంటి ప్రసిద్ధులున్నారు. గుంటూరు మండలంలోని ఆంధ్రాభాషా భూషణ కర్త మూల ఘటిక కేతన, భోజరాజీయ కర్త అనంతామాత్యుడు, అయ్యంకిపుర వాసిగా చెప్పుకొన్న వాడైన మాదయగారి మల్లన మహాకవులు.

కృష్ణా జిల్లాలోని పదకర్త క్షేత్రయ్య, కూచిపూడి నాట్య స్రష్ట సిద్ధేంద్ర యోగి మొదలగు వారున్నారు. శ్రీకృష్ణదేవరాయల ఆముక్త మాల్యదకు శ్రీకారం చుట్టింది కృష్ణా తీరమే. కర్నూలు జిల్లా (కందవోలు)లోని అయ్యలరాజు రామభద్రుడు, పింగళిసూరన (నంద్యాల) మొదలగు ప్రాచీన మహాకవులతో బాటు విశ్వనాథ సత్యనారాయణ (విజయవాడ), జాషువా (గుంటూరు), సురవరం ప్రతాపరెడ్డి (మహబూబ్‌నగర్‌) వంటి ఆధునిక సత్కవులకు కృష్ణాతీరం పుట్టుగడ్డ.

కృష్ణానది అతి ప్రాచీనమైన తెలుగు జాతితో సంబంధం కల్గి, జాతి, భాషా, సారస్వత, కళా, సామాజిక రంగాలలో శతాబ్దుల వెంబడి ఎంతో వికాసాన్ని సాధించింది. ఈ నదీమతల్లి ఒడిలో వికసించిన సంస్కృతీ వైభవం ఘన వారసత్వం కల్గిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తెలుగువారి సంస్కృతీ చరిత్రలో విడదీయరాని ఒక భాగం కృష్ణమ్మతల్లి, ప్రాజెక్టుల రూపంలో, విద్యుదుత్పత్తి రూపంలో, సాగు, తాగు నీటి అవసరాల్లో, పరిశ్రమల విషయంలో కృష్ణవేణి తెలుగింటి విరిబోణి.